rithvik
-
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మోంటెకార్లో (మొనాకో): భారత టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ప్లేయర్ రోహన్ బోపన్న మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్‌తో జత కట్టి ఈ టోర్నీలో బరిలోకి దిగిన బోపన్న ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీకి షాక్ ఇచ్చాడు. 96 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–షెల్టన్ ద్వయం 2–6, 7–6 (7/4), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో బొలెలీ–వావాసోరి జోడీని బోల్తా కొట్టించింది. మూడు ఏస్‌లు సంధించిన బోపన్న–షెల్టన్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో మాన్యుయెల్ గినార్డ్ (ఫ్రాన్స్)–రొమైన్ అర్నియోడో (మొనాకో)లతో బోపన్న–షెల్టన్ తలపడతారు. ఈ ఏడాది ఏడో టోర్నీలో ఆడుతున్న బోపన్న ప్రస్తుతం మోంటెకార్లో ఓపెన్‌లో, దోహా ఓపెన్‌లో మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. సాకేత్–రామ్‌కుమార్ జంట పరాజయం సాక్షి, హైదరాబాద్: మాడ్రిడ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని, హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్, భారత ప్లేయర్ సిద్ధాంత్ బంతియా వేర్వేరు భాగస్వాములతో ఈ టోర్నీలో పోటీపడ్డారు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట 2–6, 4–6తో మూడో సీడ్ ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–లుకాస్ మిడ్లెర్ (ఆ్రస్టియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరో క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్)–డేవిడ్ వేగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ 4–6, 2–6తో ఇనిగో సెర్వాంటెస్ (స్పెయిన్)–డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సిద్ధాంత్ బంతియా (భారత్)–అలెగ్జాండర్ డాన్స్కీ (బల్గేరియా) ద్వయం 6–7 (2/7), 6–7 (4/7)తో ఒర్లాండో లుజ్ (బ్రెజిల్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాకేత్, అనిరుధ్, సిద్ధాంత్ జోడీలకు 1,470 యూరోల (రూ. 1 లక్ష 42 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రిత్విక్ ద్వయం శుభారంభం3మెక్సికో సిటీ: భారత పురుషుల టెన్నిస్ డబుల్స్ నాలుగో ర్యాంకర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ రిత్విక్ (భారత్)–నికోలస్ బరియంతోస్ (కొలంబియా) ద్వయం 3–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో రే హో (చైనీస్ తైపీ)–క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బరియంతోస్ ద్వయం రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వ్‌లో 38 పాయింట్లకుగాను 29 పాయింట్లు, రెండో సర్వ్‌లో 24 పాయింట్లకుగాను 11 పాయింట్లు సాధించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్‌లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్‌లో నిలిచాడు. రామ్‌కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్‌లో నిలిచారు. -
రిత్విక్... మళ్లీ సాధించాడు
సాక్షి, హైదరాబాద్: అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి... అంచనాలకు మించి రాణించి... హైదరాబాద్ టెన్నిస్ యువతార బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ అద్భుతం చేశాడు. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లాటిన్ అమెరికాలో క్లే కోర్టులపై ఏటీపీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా రిత్విక్ గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బరియెంతోస్ (కొలంబియా) ద్వయం 6–3, 6–2తో టాప్ సీడ్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్తాని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకుంది. విజేతగా నిలిచిన రిత్విక్–బరియెంతోస్లకు 35,980 డాలర్ల (రూ. 31 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 24 ఏళ్ల రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ –250 డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలి డబుల్స్ టైటిల్ గెలిచాడు. తాజా టైటిల్‌తో రిత్విక్ సోమవారం విడదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 66వ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 11 ఏస్‌లతో మెరిసి... 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బరియెంతోస్ ద్వయం పూర్తి ఆధిపత్యం చలాయించింది. 11 ఏస్‌లు సంధించిన ఈ జోడీ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ఫస్ట్ సర్వ్లోని 30 పాయింట్లకుగాను 26 పాయింట్లు... సెకండ్ సర్వ్‌లో 13 పాయింట్లకుగాను 10 పాయింట్లు ఈ జంట గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని ఈ ఇండో–కొలంబియన్ జంట ప్రత్యర్థి ద్వయం సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఈ టోర్నిలో అన్‌సీడెడ్ గా పోటీపడ్డ రిత్విక్–బరియెంతోస్ తొలి రౌండ్లో 7–6 (7/5), 7–6 (9/7)తో ద్రెజెవ్స్కీ–పీటర్ మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)లపై, క్వార్టర్ ఫైనల్లో 3–6, 7–6 (7/2), 10–8తో మార్సెలో డెమోలైనర్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్)లపై, సెమీఫైనల్లో 4–6, 7–6 (9/7), 10–5తో మూడో సీడ్ గిడో ఆంద్రెజీ (అర్జెంటీనా)–థియో అరిబెజ్ (ఫ్రాన్స్)లపై గెలుపొందారు. -
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
డెల్రే బీచ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 7–6 (7/4), 7–6 (7/5)తో రొంబోలి–జొర్మాన్ (బ్రెజిల్) జంటపై గెలిచింది. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బారింటోస్ జోడీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. రెండు సెట్లలోటైబ్రేక్లో రిత్విక్–బారింటోస్ ద్వయం పైచేయి సాధించింది. ఇదే టోర్నీలో ఆడుతున్న శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) జంట కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో నాలుగో సీడ్ బాలాజీ–వరేలా ద్వయం 3–6, 6–2, 10–4తో లెర్నర్ టియెన్–ఈథన్ క్విన్ (అమెరికా) జంటపై గెలిచింది. -
రిత్విక్ జోడీ ఓటమి
బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో తాను పాల్గొన్న తొలి టోర్నీలో భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఏటీపీ–250 టోర్నీలో రిత్విక్ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 2–6తో రింకీ హిజికాటా–జేసన్ కుబ్లెర్ (ఆ్రస్టేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–డచ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో రిత్విక్–రాబిన్ హాస్ 7–6 (7/4), 3–6, 10–6తో గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా)లపై గెలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన రితి్వక్–రాబిన్ హాస్‌లకు 2,980 డాలర్ల (రూ. 2 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత డేవిస్‌కప్ జట్టులో రిత్విక్
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పోటీపడే భారత పురుషుల టెన్నిస్ జట్టును ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా టోగో జట్టుతో భారత బృందం తలపడుతుంది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సెలెక్షన్ ప్యానెల్ ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించగా... ఈ ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో నిలకడగా రాణించిన తెలంగాణ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. శశికుమార్ ముకుంద్, రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, కరణ్ సింగ్ జట్టులోని ఇతర సభ్యులు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్, డబుల్స్‌లో భారత రెండో ర్యాంకర్ యూకీ బాంబ్రీ టోగోతో మ్యాచ్‌కు తాము అందుబాటులో ఉండటం లేదని ఏఐటీఏకి తెలిపారు. సింగిల్స్ మ్యాచ్‌ల్లో శశికుమార్, రామ్‌కుమార్... డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ చౌదరీ ఆడే అవకాశం ఉంది. ఆర్యన్ షా, మానస్ ధామ్నె, దక్షిణేశ్వర్ సురేశ్, యువన్ నందల్లను డేవిస్‌కప్ సన్నాహక శిబిరానికి ఎంపిక చేశారు. ఈ నలుగురిలో నుంచి ఇద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేస్తామని భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు. స్వీడన్‌తో గత సెప్టెంబర్‌లో జరిగిన వరల్డ్ గ్రూప్ పోటీలో ఆడిన సిద్ధార్థ విశ్వకర్మ, నిక్కీ పునాచాలను టోగోతో మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు. -
సెమీస్‌లో అనిరుధ్, రిత్విక్ జోడీలు
అకాపుల్కో (మెక్సికో): జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు అనిరుధ్ చంద్రశేఖర్, బొల్లిపల్లి రి త్విక్ చౌదరీ సంచలనం సృష్టించారు. అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో)... రిత్విక్–నిక్కీ పునాచా (భారత్) జోడీలు సీడెడ్ జంటలను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో రి త్విక్–నిక్కీ జంట 6–4, 6–1తో రెండో సీడ్ పీటర్ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జోడీని ఓడించగా... అనిరుధ్–వెర్డొగో ద్వయం 3–6, 6–4, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ రింకీ హిజికాటా (ఆ్రస్టేలియా)–మ్యాక్ కిగెర్ (అమెరికా) జంటకు షాక్ ఇచ్చింది. -
సెమీఫైనల్లో రిత్విక్ జోడీ పరాజయం
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్–జీవన్ (భారత్) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్ (బ్రిటన్)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్ చేరింది. -
రిత్విక్–నిక్కీ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: సాన్ లూయిస్ ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్ రిత్విక్–నిక్కీ కలియంద పునాచా (భారత్) ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–నిక్కీ జంట 6–3, 6–2తో ఆంటోనీ బెలీర్–మార్క్ హ్యుస్లెర్ (స్విట్జర్లాండ్) జోడీపై గెలిచి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 88 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్‌లో ఇటలీలో జరిగిన ఒల్బ్లా ఓపెన్‌లో అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలిసారి చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెలిచాడు. -
రిత్విక్–నిక్కీ పునాచా జోడీ ముందంజ
చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రిత్విక్–నిక్కీ జంట 5–7, 6–1, 10–7తో పరీక్షిత్ సొమాని–మనీశ్ సురేశ్ కుమార్ (భారత్) ద్వయంపై విజయం సాధించింది. భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ కూడా సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 4–6, 6–4, 10–6తో డాన్ యాడెడ్–ఉగో బ్లాంచెట్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో తొషిహిదె మత్సుయ్–కైటో యుసుగి (జపాన్)లతో సాకేత్–రామ్‌కుమార్; జేకబ్–మార్క్ వాల్నెర్ (జర్మనీ)లతో రిత్విక్–నిక్కీ తలపడతారు. -
ITF Mens Tourney: క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ రిత్విక్–నిక్కీ పునాచా ద్వయం 6–1, 6–3తో జేకబ్ బ్రాడ్షా (ఆస్ట్రేలియా)–బోరిస్ బుతుల్యా (సెర్బియా) జోడీని ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన రిత్విక్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ గత ఏడాది ఐటీఎఫ్ సర్క్యూట్లో విశేషంగా రాణించి ఏడు డబుల్స్ టైటిల్స్, ఈ ఏడాది ఒక డబుల్స్ టైటిల్‌ను సాధించారు. -
రిత్విక్‌కు 7 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: డాన్ బాస్కో హైస్కూల్ బౌలర్ రిత్విక్ 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ నాకౌట్ టోర్నీలో ఆ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన డాన్ బాస్కో 109 పరుగులు చేసింది. వశిష్ట బౌలర్ అరవింద్, నవీన్ చెరో మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన వశిష్ట జట్టు 89 పరుగుల వద్ద ఆలౌటైంది. నవీన్ (51) అర్ధ సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో మెదక్ డిస్ట్రిక్ట్ బ్యాట్స్‌మన్ అఖిల్ నాయక్ (126 నాటౌట్) మెరుపు శతకంతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 149 పరుగుల భారీ తేడాతో డీఏవీ పబ్లిక్ స్కూల్‌పై ఘన విజయం సొంతం చేసుకుంది. తొలుత బరిలోకి దిగిన మెదక్ 225 పరుగులు చేసింది. డీఏవీ బౌలర్ కార్తీక్ ఆనంద్ 4 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన డీఏవీ పబ్లిక్ స్కూల్ 86 పరుగులకే కుప్పకూలింది. ఆనంద్ 5, మహ్మద్ అజ్మతుల్లా 3 వికెట్లు చేజిక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు తక్షశిల పబ్లిక్ స్కూల్: 82 (ఇజాజ్ ఖాన్ 3/8); హైమౌంట్ హైస్కూల్: 85/8 (తరుణ్ కుమార్ 4/11, నీరజ్ కుమార్ 3/30). సెయింట్ జోసెఫ్ హైస్కూల్(హబ్సిగూడ): 204 (ప్రత్యూష్ 77, మహ్మద్ ఖాజా పాషా 35; గ్యాబ్రియల్ 65; ప్రత్యూష్ 4/26). భవాన్స్: 204/4 (జయవర్ధన్ 50, విష్ణునాయక్ 56; అజయ్ 4/50); వరంగల్ డిస్ట్రిక్ట్: 165 (త్రిషూల్ 36, అజయ్ 51 నాటౌట్; అభిషేకర్ 3/17, విష్ణునాయక్ 3/26).