
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్‌తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.
దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్‌లో ఉన్నాడు.
మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్‌లో నిలిచాడు. రామ్‌కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment