Association of Tennis Professionals
-
సినెర్... కొత్త నంబర్‌వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
ATP Rankings: నంబర్‌వన్ బోపన్న
లండన్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ భారత ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. సోమవారం విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న అతిపెద్ద వయసు్కడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గత శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోరీ్నలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గి తన కెరీర్లో పురుషుల డబుల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోరీ్న లు ఆడినందుకు బోపన్నకు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, ఎబ్డెన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. చివరిసారి భారత్ నుంచి లియాండర్ పేస్ 2000 మార్చి 13న ... మహేశ్ భూపతి 1999 జూన్ 14న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్‌గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్‌లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్ సాధించడంతోపాటు 504 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. -
టాప్–100లోకి అనిరుధ్
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో అనిరుధ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచాడు. గతవారం అమెరికాలో జరిగిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)తో కలిసి ఆడిన అనిరుధ్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. వెటరన్ రోహన్ బోపన్న ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా... యూకీ బాంబ్రీ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 60వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని నాలుగు స్థానాలు పురోగతి సాధించి 77వ ర్యాంక్‌లో నిలిచారు. జీవన్ నెడుంజెళియన్ 91వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 94వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ నగాల్ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 178వ ర్యాంక్‌లో నిలిచాడు. -
జొకోవిచ్ ‘నంబర్‌వన్’ రికార్డు
దుబాయ్: టెన్నిస్ చరిత్రలో ఏ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. 1973 నుంచి టెన్నిస్‌లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 6,980 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ సెర్బియా స్టార్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉంది. గ్రాఫ్ 377 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే జొకోవిచ్ గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండ్ మేటి రోజర్ ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. తాజాగా అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా ఈ సెర్బియా యోధుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ‘మీరందరి ప్రేమాభిమానం కారణంగా నా కెరీర్లో ఎన్నో కొత్త ఘనతలు సాధించాను. తాజాగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని దుబాయ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 2011 జూలై 4న 24 ఏళ్ల 43 రోజుల ప్రాయంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ అయ్యాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన 28 ప్లేయర్లలో ఒకడైన జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్–5 ప్లేయర్లు 1. జొకోవిచ్: 378 వారాలు 2. స్టెఫీ గ్రాఫ్ : 377 వారాలు 3. మార్టినా నవ్రతిలోవా : 332 వారాలు 4. సెరెనా విలియమ్స్: 319 వారాలు 5. రోజర్ ఫెడరర్ : 310 వారాలు -
Tata Open: మెయిన్ ‘డ్రా’కు రామ్‌కుమార్
పుణే: భారత్‌లో జరిగే ఏకైక అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీ టాటా ఓపెన్‌లో భారత మూడో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 432వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 7–5తో ప్రపంచ 153వ ర్యాంకర్ మతియా బెలూచి (ఇటలీ)పై సంచలన విజయం సాధించాడు. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఏడుసార్లు కాపాడుకున్న రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)తో రామ్‌కుమార్ తలపడతాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో యూకీ 1–6, 4–6తో ఇలియాస్ ఈమర్ (స్వీడన్) చేతిలో ఓడిపోయాడు. నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ‘వైల్డ్ కార్డు’ పొందిన భారత టీనేజర్, 15 ఏళ్ల మానస్‌తో మైకేల్ మో (అమెరికా); సుమిత్ నగాల్ (భారత్)తో క్రయినోవిచ్ (సెర్బియా) తలపడతారు. 6,42,735 డాలర్ల (రూ. 53 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సింగిల్స్ విజేతకు 97,760 డాలర్లు (రూ. 80 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. -
నయా నంబర్‌వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్‌వన్ ర్యాంకర్‌గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
ప్రజ్నేశ్ ముందంజ
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 134వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–4, 2–6, 7–6 (7/1)తో ప్రపంచ 102వ ర్యాంకర్ జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన ప్రజ్నేశ్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్ థామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)తో ప్రజ్నేశ్ ఆడతాడు. -
వరుసగా 800 వారాలు...
పారిస్: పురుషుల టెన్నిస్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వరుసగా 800 వారాలపాటు టాప్–10లో నిలిచిన తొలి ప్లేయర్‌గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 9,850 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న నాదల్... 800 వారాల పాటు (15 ఏళ్లకు పైగా) టాప్–10లో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా ఘనత వహించాడు. గతంలో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన రికార్డు జిమ్మీ కానర్స్ (789 వరుస వారాలు) పేరిట ఉండేది. 2005 ఏప్రిల్‌లో తొలిసారిగా టాప్–10లో ప్రవేశించిన 34 ఏళ్ల నాదల్... గతేడాది నవంబర్లోనే జిమ్మీ కానర్స్ను వెనక్కి నెట్టేశాడు. వరుస వారాల పరంగా కాకుండా ఓవరాల్‌గా చూస్తే... అత్యధికంగా 931 వారాల పాటు స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ టాప్–10లో నిలిచాడు. -
నాదల్ మరో ఘనత
పారిస్: పురుషుల టెన్నిస్‌లో ఇప్పటికే పలు రికార్డులు సాధించిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన ప్లేయర్‌గా నాదల్ కొత్త రికార్డును నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్ తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ స్పెయిన్ స్టార్ వరుసగా 790 వారాలపాటు టాప్–10 ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. 2005లో ఏప్రిల్ 25న 18 ఏళ్ల ప్రాయంలో తొలిసారి టాప్–10లోకి వచ్చిన నాదల్ 2020 నవంబర్ 11 వరకు టాప్–10లోనే కొనసాగుతున్నాడు. 789 వారాలతోపాటు ఇప్పటివరకు అమెరికా దిగ్గజ ప్లేయర్ జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న ఈ రికార్డును 34 ఏళ్ల నాదల్ బద్దలు కొట్టాడు. కానర్స్ 1973లో ఆగస్టు 23 నుంచి 1988 సెప్టెంబర్ 25 వరకు టాప్–10లో ఉన్నాడు. ఐదు వారాల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 13వసారి సొంతం చేసుకొని అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. టాప్–10లో అత్యధిక వరుస వారాలు నిలిచిన క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ మూడో స్థానంలో (734 వారాలు; 2002 అక్టోబర్ 14 నుంచి 2016 అక్టోబర్ 31 వరకు)... ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్/అమెరికా– 619 వారాలు; 1980 జూలై 7 నుంచి 1992 మే 10 వరకు) నాలుగో స్థానంలో... పీట్ సంప్రాస్ (అమెరికా–565 వారాలు; 1990 సెప్టెంబర్ 10 నుంచి 2001 జూలై 1 వరకు) ఐదో స్థానంలో ఉన్నారు. -
ఔను... ఒక్కటి చేద్దాం: కింగ్
పారిస్: మహిళల, పురుషుల టెన్నిస్ పాలక మండళ్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఇటీవల ట్విట్టర్లో రెండు టెన్నిస్ పాలక వర్గాలను విలీనం చేయాలని సూచించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విలీనానికి అతని సమకాలీన దిగ్గజం రాఫెల్ నాదల్ మద్దతు తెలపగా.... ఇప్పుడు ఈ జాబితాలో డబ్ల్యూటీఏ వ్యవస్థాపకులు బిల్లీ జీన్ కింగ్ చేరారు. విలీనానికి ఇదే సరైన సమయమని ఆమె అన్నారు. ఆమె 1973లో డబ్ల్యూటీఏను స్థాపించారు. అప్పట్లోనే తాను రెండు వర్గాలను ఏకం చేయాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడైనా సాకారం కావాలని ట్వీట్ చేశారు. -
కిర్గియోస్‌కు రూ.80 లక్షల జరిమానా!
సిన్సినాటి: కెరీర్ ఆరంభంనుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఇప్పుడు దూషణల పర్వాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాడు! ఫలితంగా భారీ జరిమానాకు గురవడంతో పాటు నిషేధానికి కూడా చేరువయ్యాడు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో పరాజయం అనంతరం అతని ప్రవర్తన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ మ్యాచ్‌లో కరెన్ కచనోవ్ (రష్యా) 6–7, 7–6, 6–2తో కిర్గియోస్‌ను ఓడించాడు. మ్యాచ్ ముగిశాక కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇది తక్షణ చర్య మాత్రమేనని, మున్ముందు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కిర్గియోస్‌పై మరింత తీవ్ర చర్య ఉండవచ్చని కూడా ఏటీపీ ప్రకటించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ అయిన 24 ఏళ్ల కిర్గియోస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో శిక్షలకు గురయ్యాడు. -
సాకేత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చెంగ్డూ చాలెంజర్ టూర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 0–6, 10–6తో జి సంగ్ నామ్–మిన్ యు సంగ్ (కొరియా) జంటపై నెగ్గింది. 62 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 4 ఏస్‌లు సంధించి, 3 డబుల్స్ ఫాల్ట్‌లు చేసింది. ఈ విజయంతో సాకేత్ జోడీకి 7,750 డాలర్ల (రూ. 5 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీ, 110 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ రామ్‌కుమార్
న్యూపోర్ట్ (అమెరికా): రెండు దశాబ్దాలుగా భారత క్రీడాకారులను ఊరిస్తోన్న అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ సింగిల్స్ టైటిల్ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆదివారం ముగిసిన న్యూపోర్ట్ ఓపెన్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 161వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–3, 2–6తో ప్రపంచ 48వ ర్యాంకర్, మూడో సీడ్ స్టీవ్ జాన్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. విజేతగా నిలిచిన స్టీవ్ జాన్సన్‌కు 99,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 68 లక్షల 29 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రామ్‌కుమార్‌కు 52,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 97 వేలు)తోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నైకు చెందిన 23 ఏళ్ల రామ్‌కుమార్ 6–4, 7–5తో టిమ్ స్మిజెక్ (అమెరికా)పై గెలుపొంది తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–250 టూర్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009లో చెన్నై ఓపెన్‌లో, 2011లో దక్షిణాఫ్రికా ఓపెన్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్‌కు చేరిన తర్వాత భారత్ నుంచి రామ్‌కుమార్ రూపంలో మరో ప్లేయర్ ఏటీపీ టూర్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరడం ఇదే ప్రథమం. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. భారత్ తరఫున చివరిసారి ఏటీపీ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆటగాడు లియాండర్ పేస్. 1998 న్యూపోర్ట్ ఓపెన్‌లో లియాండర్ పేస్ విజేతగా నిలిచాడు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సుకోవా, స్టిక్ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వింబుల్డన్ మాజీ సింగిల్స్ చాంపియన్ మైకేల్ స్టిక్ (జర్మనీ), 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్)లకు చోటు కల్పించారు. స్టిక్ 1991 వింబుల్డన్ టోర్నీలో బోరిస్ బెకర్ (జర్మనీ)పై వరుస సెట్లలో గెలిచాడు. 1994 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో... 1996 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కఫెల్నికోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1997లో రిటైరయిన స్టిక్ కెరీర్ మొత్తంలో 18 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. సుకోవా, మైకేల్ స్టిక్ -
పేస్ పయనమెటు?
►వెంటాడుతున్న వరుస వైఫల్యాలు ►రెండేళ్లుగా లేని ఏటీపీ డబుల్స్ టైటిల్ సాక్షి క్రీడావిభాగం వరుసగా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఏకైక టెన్నిస్ క్రీడాకారుడు... మరో విజయం సాధిస్తే డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలిచిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు... నాలుగు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గని ఉత్సాహం... 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్... 27 ఏళ్లుగా అలుపెరుగని ఆట... 114 మంది భాగస్వాములతో కలిసి బరిలోకి... ఇలాంటి ఎన్నో ఘనతలు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సొంతం. కానీ కొన్నాళ్లుగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూ ట్లో పేస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొత్త కొత్త భాగస్వాములతో కలిసి టోర్నీలలో ఆడుతున్నా టైటిల్స్ మాత్రం దక్కడంలేదు. ఒకానొక సమయంలో పేస్ ఆటకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చినా... వాటిని అతను ఖండిస్తూ, తనలో ఆటపట్ల ఆసక్తి ఉన్నంత కాలం టెన్నిస్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 43 ఏళ్ల వయస్సులోనూ ఫిట్నెస్ సమస్యలు లేకుండా ఆడుతున్న పేస్ ఏటీపీ సర్క్యూట్లో టైటిల్ సాధించి రెండేళ్లు దాటిపోయింది. చివరిసారి అతను 2015 జనవరిలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఆక్లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. అదే ఏడాది మరో రెండు టోర్నీల్లో, గత సంవత్సరం మరో రెండు టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్నా పేస్ ఖాతాలో మాత్రం టైటిల్ చేరలేదు. ఈ ఏడాది ఆరు టోర్నీల్లో ఆడిన పేస్... నాలుగింటిలో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. దుబాయ్ ఓపెన్, డెల్రే బీచ్ ఓపెన్ టోర్నీలలో మాత్రం సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. అవకాశం దక్కేనా... డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. 42 విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పేస్ సమం చేశాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భగా పేస్‌కు ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చినా... విష్ణువర్ధన్తో జతకట్టిన అతనికి విజయం దక్కలేదు. దాంతో ప్రపంచ రికార్డుకు పేస్ వచ్చే నెలదాకా వేచి చూడాలి. ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో పేస్ ఉంటాడా లేదా అనే అనుమానం కలిగినా సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఆరుగురు సభ్యులతో కూడిన జట్టులో డబుల్స్ స్పెషలిస్ట్‌లుగా పేస్‌తోపాటు రోహన్ బోపన్నకు స్థానం కల్పించారు. కానీ నలుగురు సభ్యులు ఉండే తుది జట్టును ఎంపిక చేసే అధికారాన్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి ఇచ్చారు. తుది జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు, ఒక డబుల్స్ ప్లేయర్ ఉంటారని మహేశ్ భూపతి ప్రకటించడంతో... పేస్, బోపన్నలలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశముంది. పేస్‌తో కలిసి డబుల్స్‌లో ఆడటం ఇష్టం లేదని రియో ఒలింపిక్స్ సందర్భంగా బోపన్న ప్రకటించడం వివాదాస్పదమైంది. భారత టెన్నిస్ సంఘం జోక్యం చేసుకొని వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినా రియో ఒలింపిక్స్‌లో పేస్–బోపన్న జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనే తుది జట్టును ఈ నెలాఖర్లో మహేశ్ భూపతి ప్రకటించే అవకాశముంది. తాను ప్రపంచ రికార్డును అందుకోవాలంటే పేస్‌కు బోపన్నలాంటి అనుభవజ్ఞుడైన భాగస్వామి అవసరం. ఒకవేళ పేస్‌ను కాదని బోపన్నను భూపతి ఎంపిక చేసుకుంటే మరోసారి భారత టెన్నిస్‌లో వివాదం రాజుకోవడం ఖాయం. డేవిస్ కప్ పోటీలకు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాక పేస్‌కు తుది జట్టులో స్థానం దక్కని దాఖలాలు లేవు. ఒకవేళ పేస్‌కు స్థానం లభించకపోతే ఈ టెన్నిస్ దిగ్గజం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి. తొలి రౌండ్లోనే పరాజయం ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో డెల్‌పొట్రో (అర్జెంటీనా)తో జతకట్టిన పేస్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ‘వైల్డ్ కార్డు’తో ఆడిన పేస్–డెల్‌పొట్రో జంట ఆదివారం జరిగిన తొలి రౌండ్లో 3–6, 4–6తో సామ్ క్వెరీ (అమెరికా)–గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండు సెట్లలో ఒక్కోసారి పేస్ ద్వయం తమ సర్వీస్‌ను కోల్పోయింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా పేస్–డెల్‌పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయారు.