
సిన్సినాటి: కెరీర్ ఆరంభంనుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఇప్పుడు దూషణల పర్వాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాడు! ఫలితంగా భారీ జరిమానాకు గురవడంతో పాటు నిషేధానికి కూడా చేరువయ్యాడు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్‌లో పరాజయం అనంతరం అతని ప్రవర్తన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ మ్యాచ్‌లో కరెన్ కచనోవ్ (రష్యా) 6–7, 7–6, 6–2తో కిర్గియోస్‌ను ఓడించాడు.
మ్యాచ్ ముగిశాక కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇది తక్షణ చర్య మాత్రమేనని, మున్ముందు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కిర్గియోస్‌పై మరింత తీవ్ర చర్య ఉండవచ్చని కూడా ఏటీపీ ప్రకటించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ అయిన 24 ఏళ్ల కిర్గియోస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో శిక్షలకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment