నయా నంబర్‌వన్‌..డానిల్‌ మెద్వెదెవ్‌ | ATP tennis rankings: Daniil Medvedev officially becomes world no. 1 | Sakshi
Sakshi News home page

నయా నంబర్‌వన్‌..డానిల్‌ మెద్వెదెవ్‌

Published Tue, Mar 1 2022 5:15 AM | Last Updated on Tue, Mar 1 2022 5:24 AM

ATP tennis rankings: Daniil Medvedev officially becomes world no. 1 - Sakshi

లండన్‌: టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన ఎవరికైనా కెరీర్‌లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్‌ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించాడు.

2020 ఫిబ్రవరి నుంచి టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్‌ 8,615 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్‌ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్‌ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్‌ ర్యాంక్‌ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్‌ వ్యాఖ్యానించాడు.  

► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్‌ ఫోర్‌’గా పేరొందిన ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), జొకోవిచ్‌ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్‌)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్‌’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్‌ రూపంలో మరో ప్లేయర్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలువడం విశేషం.  
► ఆండీ ముర్రే (2016 నవంబర్‌ 7) తర్వాత కొత్త నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా మెద్వెదెవ్‌ నిలిచాడు.  
► యెవ్‌గెనీ కఫెల్నికోవ్‌ (1999; మే 3), మరాత్‌ సఫిన్‌ (2000, నవంబర్‌ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్‌ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్‌ వరుసగా ఆరు వారాలు, సఫిన్‌ వరుసగా తొమ్మిది వారాలు టాప్‌ ర్యాంక్‌లో ఉన్నారు.  
► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్‌ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్‌ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్‌–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు.  
► ఇప్పటివరకు మెద్వెదెవ్‌ మొత్తం 13 సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (యూఎస్‌ ఓపెన్‌–2021), నాలుగు మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్, సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ (2020) ఉన్నాయి.  
► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్న 27వ ప్లేయర్‌ మెద్వెదెవ్‌ కావడం విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement