Daniel Medvedev
-
నయా నంబర్‌వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్‌వన్ ర్యాంకర్‌గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
వరల్డ్ నంబర్‌వన్‌గా మెద్వెదెవ్
దుబాయ్: రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ టెన్నిస్ ప్రపంచంలో శిఖర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదెవ్కు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ దక్కుతుంది. కెరీర్లో ఒకే ఒక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్... కఫెల్నికోవ్, మారత్ సఫిన్ తర్వాత అగ్ర స్థానానికి చేరిన మూడో రష్యా ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్‌లో కనీసం సెమీ ఫైనల్ చేరితే నంబర్‌వన్ ర్యాంక్ నిలబెట్టుకోగలిగే స్థితిలో బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్యంగా 4–6, 6–7 (4/7) తేడాతో వరల్డ్ నంబర్ 123 జిరి వెస్లీ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలై అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫిబ్రవరి 2020నుంచి జొకోవిచ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ముర్రేని మినహాయించి గత 18 ఏళ్లలో (2004నుంచి) వరల్డ్ నంబర్ స్థానానికి చేరిన తొలి ఆటగాడు కావడం విశేషం. -
Australian Open: చరిత్రకు చేరువగా...
ఇద్దరు దిగ్గజాలు రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టేసి కొత్త చరిత్ర సృష్టించేందుకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఒకే ఒక్క విజయం దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)తో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ గెలిస్తే... పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్, ఫెడరర్, జొకోవిచ్ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతి కష్టమ్మీద గట్టెక్కిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ సెమీఫైనల్ అడ్డంకిని మాత్రం మరీ శ్రమించకుండానే దాటేశాడు. ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 6–3, 6–2, 3–6, 6–3తో నెగ్గి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 35 ఏళ్ల నాదల్ 2009లో ఏకైకసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత 2012, 2014, 2017, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. బెరెటినితో 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు 28 విన్నర్స్ కొట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ కేవలం 19 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. బెరెటిని 14 ఏస్‌లు సంధించినప్పటికీ 39 అనవసర తప్పిదాలు చేశాడు. నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం రాగా ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. షపోవలోవ్‌తో నాలుగు గంటలకుపైగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సెట్లో నెగ్గి ఊపిరి పీల్చుకున్న నాదల్ సెమీఫైనల్లో మాత్రం బెరెటినికి ఏదశలోనూ అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో రెండుసార్లు, నాలుగో సెట్లో ఒకసారి బెరెటిని సర్వీస్‌లను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గత ఏడాది రన్నరనప్ మెద్వెదెవ్ (రష్యా) తో నాదల్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు ఒకేసారి (2019 యూఎస్ ఓపెన్ ఫైనల్) తలపడగా నాదల్ నెగ్గాడు. ఈసారీ మెద్వెదెవ్‌దే పైచేయి... ఫిలిక్స్ (కెనడా)తో 4 గంటల 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని గట్టెక్కిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో మాత్రం నాలుగు సెట్లలో విజయం రుచి చూశాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో 25 ఏళ్ల మెద్వెదెవ్ 7–6 (7/5), 4–6, 6–4, 6–1తో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో సిట్సిపాస్నే ఓడించి మెద్వెదెవ్ ఫైనల్ చేరాడు. తొలి మూడు సెట్లలో మెద్వెదెవ్కు పోటీ ఎదురైనా నాలుగో సెట్లో మాత్రం ఈ రష్యా స్టార్ ఒకే గేమ్ కోల్పోయాడు. 13 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ 39 విన్నర్స్ కొట్టాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) X కొలిన్స్ (అమెరికా) మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్ 29: ఇప్పటి వరకు తన కెరీర్లో నాదల్ చేరిన గ్రాండ్‌స్లామ్ టోర్నీల ఫైనల్స్. 500: హార్డ్కోర్టులపై నాదల్ నెగ్గిన మ్యాచ్‌లు. ఈ జాబితాలో ఫెడరర్ (783), జొకోవిచ్ (634) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 3: కఫెల్నికోవ్ (1999, 2000), సఫిన్ (2004, 2005) తర్వాత వరుసగా రెండేళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన మూడో రష్యా ప్లేయర్‌గా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. -
మెద్వెదెవ్ అద్భుతం
ఒకే ఒక్క తప్పిదం చేసి ఉంటే ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ బుధవారమే విమానమెక్కి స్వదేశం రష్యాకు వెళ్లిపోయేవాడు. కానీ కెనడా యువతార ఫిలిక్స్ అగుర్ అలియాసిమ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ రష్యా స్టార్ ఓటమి అంచులలో నిగ్రహం కోల్పోకుండా సమయస్ఫూర్తితో ఆడి నిలబడ్డాడు. నాలుగో సెట్లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. అదే జోరులో సెట్‌నూ గెలిచాడు. తుది ఫలితం కోసం మ్యాచ్‌ను ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. ఆఖరి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి బ్రేక్ చేశాడు. ఆ ఆధిక్యాన్ని చివరిదాకా నిలబెట్టుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో ఏడాది సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మెల్బోర్న్: కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా రష్యా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ మరో అడుగు వేశాడు. గత ఏడాది రన్నరప్, 25 ఏళ్ల మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 21 ఏళ్ల ఫిలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 6–7 (4/7), 3–6, 7–6 (7/2), 7–5, 6–4తో గెలుపొందాడు. 4 గంటల 42 నిమి షాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ 15 ఏస్‌లు సంధించాడు. తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 53 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 41 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచిన మెద్వెదెవ్ 49 విన్నర్స్ కొట్టాడు. కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఫిలిక్స్‌కు నాలుగో సెట్లో స్కోరు 5–4 (40–30) వద్ద మెద్వెదెవ్ సర్వీస్‌లో మ్యాచ్ పాయింట్ అవకాశం లభించింది. అయితే దానిని ఫిలిక్స్ చేజార్చు కున్నాడు. ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో మెద్వెదెవ్ పాయింట్ సాధించి గేమ్‌ను దక్కించుకొని స్కోరు ను 5–5తో సమం చేశాడు. ఫిలిక్స్ 11వ గేమ్‌లో మెద్వెదెవ్ బ్రేక్ పాయింట్ సాధించి 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని మెద్వెదెవ్ సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో మెద్వెదెవ్ మూడో గేమ్‌లో ఫిలిక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఫిలిక్స్ 18 ఏస్‌లు సంధించాడు. అయితే నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 75 అనవసర తప్పిదాలు ఫిలిక్స్ ఓటమికి బాట వేశాయి. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–4, 6–2తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి సెమీఫైనల్లో మెద్వెదెవ్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. సెమీస్‌లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కయా కనెపి (ఎస్తోనియా)తో 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 4–6, 7–6 (7/2), 6–3తో గెలిచి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. కొలిన్స్ గంటా 28 నిమిషాల్లో 7–5, 6–1తో అలిజె కార్నెట్ (ఫ్రాన్స్)పై నెగ్గి 2019 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ రెండు సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో మాడిసన్ కీస్ (అమెరికా); స్వియాటెక్‌తో కొలిన్స్ తలపడతారు. -
గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్ భావోద్వేగం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పరుషుల ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డేనియల్ మెద్వదెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు పదేపదే మెద్వదేవ్‌ను తమ మాటలతో అవమానపరచడం అతన్ని బాధించింది. ఈ విషయాన్ని మెద్వదేవ్ మ్యాచ్ ముగిసిన అనంతరం కోర్టులో కామెంటేటర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు లో ఐక్యూ. ఒక క్రీడాకారుడితో ఎలా ప్రవర్తించాలన్న కనీస పరిజ్ఞానం లేదు. ఒకప్పుడు నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు ఇలా అవమానించడం కరెక్టు కాదు. ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. మనషులమన్న సంగతి మరిచి రోబోల్లా ప్రవర్తించారు..'' అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్రమంలో డేనియల్ మెద్వదేవ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం చూపించాడు. మ్యాచ్ సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ.. తన చర్యలతో ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టించాడు. అప్పట్లో ఈ ఘటన మెద్వదేవ్‌ను విలన్‌గా మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రెండోరౌండ్ మ్యాచ్‌లో లోకల్ ఆటగాడు నిక్ కిర్గియోస్‌తో తలపడ్డాడు. మ్యాచ్ ఆడుతున్నంతసేపు నిక్ కిర్గియోస్ పదే పదే ప్రేక్షకుల వైపు చూస్తూ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టండంటూ ఎంకరేజ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసేవరకు సైలెంట్‌గా ఉన్న మెద్వదేవ్... ఆ తర్వాత కామెంటరీ ఇంటర్వ్యూలో తన ఆగ్రహాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డేనియల్ మెద్వదేవ్ రెండో రౌండ్లో నిక్ కిర్గియోస్‌పై 7-6, 6-4,4-6,6-2తో ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ముర్రే రెండో రౌండ్లోనే వైదొలగడంతో.. నాదల్ తర్వాత మెద్వదేవ్ టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. కాగా మెద్వదేవ్ 2021 యూఎస్ ఓపెన్ విజేత అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. గతేడాది యూఎస్ ఓపెన్ గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునన్న మెద్వదేవ్ కెరీర్లో 13 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. "Show some respect." 😡😡 Daniil Medvedev was NOT happy with the crowd behaviour tonight and he let them know in the on-court interview! 😳 #AusOpen - Live on Channel 9 and 9Now pic.twitter.com/5UKAFOuV9v — Wide World of Sports (@wwos) January 20, 2022 -
నాదల్కు మెద్వెదేవ్ షాక్
లండన్: తన కెరీర్లో లోటుగా ఉన్న టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారీ నాదల్కు నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్కసారీ చాంపియన్‌గా నిలువలేకపోయిన 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నాదల్ సెమీఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3–6, 7–6 (7/4), 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్)పై గెలిచి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. నాదల్‌తో గతంలో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన మెద్వెదేవ్ మొదటిసారి స్పెయిన్ స్టార్‌ను ఓడించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ (ఆస్ట్రియా)తో మెద్వెదేవ్ టైటిల్ కోసం తలపడతాడు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి వారి ఖాతాలో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ చేరుతుంది. -
నాదల్ విజయనాదం
అద్భుతం ఆ పోరు... అనూహ్యం ఆ పోరాటం... దాదాపు ఐదు గంటల సమరంలో అంతిమ విజేతగా నిలిచేందుకు సాగించిన అసమాన, అసాధారణ ఆట... అపార అనుభవం ఒకరిదైతే, అంతులేని ఆత్మవిశ్వాసం మరొకరిది... ‘బిగ్ 3’లలో ఏ ఇద్దరైనా పోటీ పడినప్పుడు మాత్రమే గ్రాండ్‌స్లామ్ ఫైనల్ రసవత్తరం, మిగతా మ్యాచ్‌లన్నీ ఏకపక్షం అంటూ తీర్మానించుకున్న అభిమానులు అయ్యో చూడలేకపోయామే అని ఆ తర్వాత వగచిన క్షణం ఇది! ఇలాంటి ఘనాఘన హోరాహోరీ సమరంలో చివరకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌దే పైచేయి అయింది. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నాలుగోసారి గెలుచుకొని నాదల్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకోగా... చివరి వరకు తలవంచని రష్యా కుర్రాడు మెద్వెదేవ్ రన్నరప్‌గానే ముగించాడు. తొలి రెండు సెట్లను స్పెయిన్ బుల్ సొంతం చేసుకున్న తర్వాత ఇక లాంఛనమే అనిపించిన మ్యాచ్‌లో తర్వాతి రెండు సెట్లు సాధించి మెద్వెదేవ్ ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ తనదైన పదునైన ఆటతో నాదల్ మళ్లీ లయ అందుకొని విజేతగా మారాడు. ఫెడరర్ ఆల్‌టైమ్ గ్రేట్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుకు మరో అడుగు దూరంలోనే నిలిచాడు. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వశమైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్ ఈ టోర్నీలోనూ తన సత్తా చాటాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక మొదలై సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ముగిసిన ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 5–7, 4–6, 6–4 స్కోరుతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు. పోటాపోటీగా సాగిన ఐదు సెట్ల ఈ పోరాటం 4 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను కట్టిపడేయడం విశేషం. తాజా విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 19కి చేరింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ రన్నరప్‌గా సంతృప్తి పడాల్సి వచ్చింది. నాదల్ గతంలో 2010, 2013, 2017లలో యూఎస్ ఓపెన్ గెలిచాడు. నాదల్ (62)కంటే ఎక్కువ విన్నర్లు (75) కొట్టినా... 57 అనవసర తప్పిదాలు మెద్వెదేవ్ ఓటమికి కారణమయ్యాయి. విజేత నాదల్కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ జోరు... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నాదల్కు సరైన ఆరంభం లభించలేదు. అతని ఫోర్హ్యాండ్లలో ధాటి లేకపోవడంతో మెద్వెదేవ్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మూడో గేమ్‌ను బ్రేక్ చేసిన రష్యన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమయ్యాడు. తర్వాతి 10 పాయింట్లలో 8 గెలుచుకొని దూసుకుపోగా... స్కోరు 5–5కు చేరిన తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న నాదల్ మళ్లీ బ్రేక్ చేసి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ నాదల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బేస్‌లైన్ వద్దనుంచే చక్కటి రిటర్న్‌లతో మెద్వెదేవ్పై ఒత్తిడి పెంచిన అతను 48 నిమిషాల్లోనే అలవోకగా సెట్‌ను సాధించాడు. అనూహ్య ప్రతిఘటన... పరిస్థితి చూస్తే మరో సెట్‌తో పాటు మ్యాచ్ కూడా ఇదే తరహాలో ముగుస్తుందని అనిపించింది. అయితే మెద్వెదేవ్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మరో మూడు గేమ్‌లు గెలిస్తే నాదల్ విజేతగా నిలుస్తాడనగా రష్యన్ ప్రతిఘటించాడు. 2–3తో వెనుకబడి ఉన్న దశ నుంచి తర్వాతి 7 గేమ్‌లలో 5 గెలుచుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. నాలుగో సెట్లో మెద్వెదేవ్ మరింత దూకుడు ప్రదర్శించాడు. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన అతను పదో గేమ్‌లో కూడా మరో రెండు బ్రేక్ పాయింట్లు అందుకొని ముందంజ వేశాడు. బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్ అతని ఖాతాలో చేరింది. హోరాహోరీ... 64 నిమిషాల పాటు సాగిన చివరి సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు. అయితే అనుభవాన్నంతా రంగరించిన నాదల్ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకొని స్కోరు 2–2కు చేరిన తర్వాత నాదల్ రెండు బ్రేక్‌లు సహా వరుసగా మూడు గేమ్‌లు గెలుచుకొని 5–2తో విజయానికి చేరువయ్యాడు. అయితే పోరాటం వదలని మెద్వెదేవ్ కూడా మళ్లీ రెండు గేమ్‌లు సాధించి స్కోరు 4–5కు తీసుకొచ్చాడు. ఉత్కంఠ తారాస్థాయికి పెరిగిపోయిన సమయంలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్ చేశాడు. ఒక దశలో 30–30, 40–40తో మెద్వెదేవ్ పోటీనిచ్చినా... చివరకు నాదల్‌నే విజయం వరించింది. మెద్వెదేవ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ కోర్టు బయట పడటంతో నాదల్ భావోద్వేగంతో కూలిపోయాడు. నా టెన్నిస్ కెరీర్లో నేను ఎంతో భావోద్వేగానికి లోనైన రోజుల్లో ఇది ఒకటి. చివరి మూడు గంటలు హోరాహోరీగా పోరు సాగింది. ఫైనల్ జరిగిన తీరు, దాదాపు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ మళ్లీ కష్టంగా మారిపోవడం, మళ్లీ కోలుకోవడం చూస్తే నా దృష్టిలో ఈ విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గెలవాలంటే ఈ మాత్రం శ్రమించాల్సిందే. స్క్రీన్‌పై నా గత టైటిల్స్‌ను చూడటం, ఆ విజయాలను గుర్తు చేసుకోవడం గర్వంగా, ప్రత్యేకంగా అనిపించింది. అందుకే నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. మెద్వెదేవ్ తన పోరాటంతో మ్యాచ్ దిశను మార్చేసిన తీరు అద్భుతం. మున్ముందు అతను ఎన్నో విజయాలు సాధించడం ఖాయం. భవిష్యత్తులో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవాలని నేనూ కోరుకుంటున్నా. అయితే అత్యధిక స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా నిలవకపోయినా నేను ప్రశాంతంగా నిద్రపోగలను. –నాదల్ విజయం ఖాయమైన క్షణాన... నాదల్ భావోద్వేగం -
నాదల్‌ను ఆపతరమా!
అమెరికా గడ్డపై స్పెయిల్ బుల్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా సాగిపోతోంది. చిరకాల ప్రత్యర్థులు, తనకు పోటీ కాగల ఇద్దరు స్టార్లు జొకోవిచ్, ఫెడరర్ ముందే నిష్క్రమించిన చోట నాదల్ జోరు ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు. ఇదే ఊపులో నాదల్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకొని 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటకు సన్నద్ధమయ్యాడు. మరోవైపు నుంచి తుది పోరుకు అర్హత సాధించిన రష్యన్ మెద్వెదేవ్ నేడు జరిగే ఫైనల్లో నాదల్కు ఎదురుగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం తన అదృ ష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సెమీఫైనల్లో నాదల్ ముందు బెరెటిని తలవంచగా... మెద్వెదేవ్ ముందు దిమిత్రోవ్ నిలవలేకపోయాడు. న్యూయార్క్: ఒకవైపు 18 గ్రాండ్‌స్లామ్‌ల విజేత... మరోవైపు తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టిన ఆటగాడు... వీరిద్దరి మధ్య యూఎస్ ఓపెన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో నేడు జరిగే తుది పోరులో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) తలపడతాడు. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ నాదల్ 7–6 (8/6), 6–4, 6–1తో 24వ సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించగా... మెద్వెదేవ్ 7–6 (7/5), 6–4, 6–3తో అన్‌సీడెడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించాడు. రెండు సెమీస్ మ్యాచ్‌లు దాదాపు ఒకే తరహాలో, ఒకే సమయం పాటు సాగడం విశేషం. నాదల్ ఇప్పటి వరకు మూడు సార్లూ యూఎస్ ఓపెన్ గెలుచుకున్నాడు. తొలి సెట్ మినహా... బెరెటినితో తొలిసారి తలపడిన నాదల్ మొదటి సెట్లో కొంత పోరాడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో సెట్లో కాస్త సులువుగా... మూడో సెట్లో తిరుగులేని విధంగా అతని ప్రదర్శన సాగింది. తొలి సెట్ హోరాహోరీగా సాగి బెరెటిని ఎక్కడా తగ్గకపోవడంతో టైబ్రేక్‌కు వెళ్లింది. ఇక్కడా బెరెటిని 4–0తో ఆధిక్యంలో నిలిచాడు. నాదల్ 2–5తో అంతరం తగ్గించినా ఇటలీ ఆటగాడు 6–4తో సెట్ విజయానికి చేరువయ్యాడు. అయితే రెండు సార్లు సెట్‌ను గెలుచుకునే అవకాశం వచ్చినా నాదల్ తిప్పికొట్టాడు. ఆపై తన అనుభవాన్ని ఉపయోగించి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3 వరకు చేరింది. కొద్ది సేపటికి బెరెటిని సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యం ప్రదర్శించిన నాదల్ ఆపై వెంటనే సెట్‌ను కూడా గెలుచుకున్నాడు. మూడో సెట్లో మరింత దూకుడుగా ఆడిన నాదల్కు ఎదురు లేకుండా పోయింది. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్ (31)కంటే బెరెటిని ఎక్కువ విన్నర్లు (37) కొట్టినా... ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేసి ఓటమిని ఆహ్వానించాడు. దిమిత్రోవ్‌కు నిరాశ... క్వార్టర్స్‌లో రోజర్ ఫెడరర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన దిమిత్రోవ్ ఈ మ్యాచ్‌లో అదే స్థాయి పోరాట పటిమ కనబర్చలేకపోయాడు. 2 గంటల 38 నిమిషాల ఈ మ్యాచ్‌లో పోటాపోటీగా సాగిన తొలి సెట్ టైబ్రేకర్‌కు దారి తీసింది. సుదీర్ఘమైన ర్యాలీలతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి మెద్వదేవ్ చివరకు సెట్‌ను గెలుచుకున్నాడు. 6–5 వద్ద సెట్ గెలిచే అవకాశం వచ్చినా దిమిత్రోవ్ విఫలమయ్యాడు. రెండో సెట్లో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచిన దశలో సర్వీస్ నిలబెట్టుకొని మెద్వెదేవ్ 5–4తో ముందంజ వేశాడు. చక్కటి ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో రెండో సెట్ కూడా మెద్వెదేవ్ వశమైంది. కెరీర్లో తొలి రెండు సెట్లు ఓడిన తర్వాత ఎప్పుడూ కోలుకోలేకపోయిన దిమిత్రోవ్‌కు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. మూడో సెట్లో ప్రత్యర్థి 5–2తో ఆధిక్యంలో ఉన్న దశలో తన సర్వీస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోగలిగినా... చివరకు అతని ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో పరాజయం ఖాయమైంది. తొలి సెట్ టైబ్రేక్‌లో నాకు అదృష్టం కలిసొచ్చింది. 4–0తో ఆధిక్యం అంటే అతనికి 100 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ బతికిపోయాను. రెండో సెట్లో నాకు బ్రేక్ లభించిన తర్వాత ఆట మొత్తం మారిపోయింది. యూఎస్ ఓపెన్‌లో మరోసారి ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. మెద్వెదేవ్ ఈ సీజన్లో చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతీ వారం అతని ఆటతీరు ఎంతో మెరుగవుతూ వస్తోంది కాబట్టి ఫైనల్లో నేను శ్రమించాల్సిందే. అయితే గ్రాండ్‌స్లామ్ తుది పోరు అంటే ఎవరినీ తక్కువగా అంచనా వేయవద్దు. –నాదల్ ఓడిపోతాననుకున్న తొలి సెట్ నాకు దక్కడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. అమెరికా హార్డ్కోర్ట్ సీజన్లో వరుసగా నాలుగో ఫైనల్‌కు చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఇక్కడ అడుగు పెట్టినప్పుడు దీనిని ఊహించలేదు. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటి వరకు నా అత్యుత్తమ ప్రదర్శన నాలుగో రౌండ్ మాత్రమే. ఐదు సెట్ల మ్యాచ్‌లు నేను గెలవలేనని అనిపించేది. కానీ ఇక్కడ సాధించిన విజయాలు నాలో నమ్మకాన్ని పెంచాయి. ఫైనల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. – మెద్వెదేవ్ బెథానీ–జేమీ ముర్రే జంటకు ‘మిక్స్డ్’ టైటిల్ యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్‌సీడెడ్ బెథానీ–జేమీ ముర్రే ద్వయం 6–2, 6–3తో టాప్ సీడ్ హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీపై సంచలన విజయం సాధించింది. టైటిల్ నెగ్గిన బెథానీ–జేమీ జంటకు 1,60,000 డాలర్ల (రూ. కోటీ 14 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. 1: ఈ ఏడాది అత్యధిక విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మెద్వెదేవ్ (50 విజయాలు) అగ్రస్థానంలో ఉన్నాడు. 46 విజయాలతో నాదల్ రెండో స్థానంలో ఉన్నాడు. 1: ముఖాముఖి రికార్డులో నాదల్ 1–0తో మెద్వెదేవ్పై ఆధిక్యంలో ఉన్నాడు. ఇటీవల రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ ఫైనల్లో మెద్వెదేవ్పై గెలిచి నాదల్ టైటిల్ సాధించాడు. 27: నాదల్ కెరీర్లో ఇది 27వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఇందులో అతను 18 ఫైనల్స్‌లో గెలిచి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు. 1:మరాత్ సఫిన్ (2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి రష్యా ప్లేయర్ మెద్వెదేవ్. 5: యూఎస్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. గతంలో మూడుసార్లు (2017, 2013, 2010) విజేతగా నిలిచిన అతను ఒకసారి రన్నరప్ (2011)తో సరిపెట్టుకున్నాడు. -
చాంప్స్ మెద్వెదేవ్, కీస్
సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్‌లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం. కుజ్నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్‌లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్‌లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉంది. -
‘చిల్లర’ విసిరేశాడు!
లండన్: ‘ఎవరైనా కోపం వస్తే అరుస్తారు, అసహనం ఎక్కువైపోతే ఏవైనా బూతులు తిట్టేస్తారు, వీడేంట్రా ఇలా ఆగ్రహం వ్యక్తం చేశాడు’... గురువారం వింబుల్డన్‌లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ప్రవర్తన చూస్తే అందరికీ వచ్చే సందేహమిది! తొలి రౌండ్లో వావ్రింకాపై సంచలన విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 21 ఏళ్ళ కుర్రాడు రెండో రౌండ్లో ఓటమిని మాత్రం భరించలేకపోయాడు. రూబెన్ బెమెల్మన్స్ (బ్రెజిల్)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదేవ్ 4–6, 2–6, 6–3, 6–2, 3–6 తేడాతో పోరాడి ఓడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన చెయిర్ వద్దకు వెళ్లిన అతను వ్యాలెట్‌ను బయటకు తీశాడు. అందులోంచి ఒక్కొక్కటిగా చిల్లర నాణేలు తీసి అక్కడే ఉన్న అంపైర్ మారియానా ఆల్వ్ కాళ్ల వద్దకు వరుసగా విసిరేయడం ఆశ్చర్యం కలిగించింది! ఐదో సెట్లో ఒక పాయింట్ విషయంలో అంపైర్ తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు అతను ఇలా చేసి ఉంటాడని అక్కడ ఉన్నవారు భావించారు. ‘ఓటమితో నేను తీవ్రంగా నిరాశ చెందాను. చిల్లర విసిరేయడానికి కారణం ఇదీ అని కూడా నేను చెప్పలేను. అలా ఎందుకు చేశానో నాకే తెలీదు. ఆ సమయంలో అసహనంతో అలా జరిగిపోయిందంతే. దీనికి క్షమాపణ కోరుతున్నాను’ అని మెద్వెదేవ్ ఆ తర్వాత మీడియా సమావేశంలో చెప్పాడు. అయితే వింబుల్డన్ నిర్వాహకులు మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో, ఆ తర్వాత అతని ప్రవర్తనను కారణంగా చూపిస్తూ మూడు వేర్వేరు రకాల జరిమానాలు విధించారు. మూడూ కలిపి మెద్వెదేవ్పై మొత్తం 14,500 డాలర్లు (దాదాపు రూ. 9.38 లక్షలు) జరిమానా పడింది. మరో వైపు తొలి రౌండ్లో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఆడి ‘టెన్నిస్ బోర్ కొట్టింది’ అనే వ్యాఖ్యలు చేసిన బెర్నార్డ్ టామిక్‌కు కూడా 15,000 డాలర్లు (దాదాపు రూ. 9.71 లక్షలు) జరిమానా విధించి గట్టి హెచ్చరిక జారీ చేశారు.