ఒకే ఒక్క తప్పిదం చేసి ఉంటే ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ బుధవారమే విమానమెక్కి స్వదేశం రష్యాకు వెళ్లిపోయేవాడు. కానీ కెనడా యువతార ఫిలిక్స్ అగుర్ అలియాసిమ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ రష్యా స్టార్ ఓటమి అంచులలో నిగ్రహం కోల్పోకుండా సమయస్ఫూర్తితో ఆడి నిలబడ్డాడు. నాలుగో సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. అదే జోరులో సెట్‌నూ గెలిచాడు. తుది ఫలితం కోసం మ్యాచ్‌ను ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. ఆఖరి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి బ్రేక్ చేశాడు. ఆ ఆధిక్యాన్ని చివరిదాకా నిలబెట్టుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో ఏడాది సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
మెల్‌బోర్న్: కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా రష్యా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ మరో అడుగు వేశాడు. గత ఏడాది రన్నరప్, 25 ఏళ్ల మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 21 ఏళ్ల ఫిలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 6–7 (4/7), 3–6, 7–6 (7/2), 7–5, 6–4తో గెలుపొందాడు.
4 గంటల 42 నిమి షాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ 15 ఏస్‌లు సంధించాడు. తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 53 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 41 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచిన మెద్వెదెవ్ 49 విన్నర్స్ కొట్టాడు. కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఫిలిక్స్‌కు నాలుగో సెట్‌లో స్కోరు 5–4 (40–30) వద్ద మెద్వెదెవ్ సర్వీస్‌లో మ్యాచ్
పాయింట్ అవకాశం లభించింది. అయితే దానిని ఫిలిక్స్ చేజార్చు కున్నాడు. ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో మెద్వెదెవ్ పాయింట్ సాధించి గేమ్‌ను దక్కించుకొని స్కోరు ను 5–5తో సమం చేశాడు. ఫిలిక్స్ 11వ గేమ్‌లో మెద్వెదెవ్ బ్రేక్ పాయింట్ సాధించి 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని మెద్వెదెవ్ సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్‌లో మెద్వెదెవ్ మూడో గేమ్‌లో ఫిలిక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఫిలిక్స్ 18 ఏస్‌లు సంధించాడు. అయితే నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 75 అనవసర తప్పిదాలు ఫిలిక్స్ ఓటమికి బాట వేశాయి. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–4, 6–2తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి సెమీఫైనల్లో మెద్వెదెవ్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు.
సెమీస్‌లో స్వియాటెక్
మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కయా కనెపి (ఎస్తోనియా)తో 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 4–6, 7–6 (7/2), 6–3తో గెలిచి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. కొలిన్స్ గంటా 28 నిమిషాల్లో 7–5, 6–1తో అలిజె కార్నెట్ (ఫ్రాన్స్)పై నెగ్గి 2019 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ రెండు సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో మాడిసన్ కీస్ (అమెరికా); స్వియాటెక్‌తో కొలిన్స్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment