
ఆగంతకుడు లోపలికి ప్రవేశించడమే కారణం
ఒట్టావా: కెనడా పార్లమెంట్ భవనం శనివారం ఉన్నట్టుండి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఓ వ్యక్తి ఆ భవనంలోకి అనధికారికంగా ప్రవేశించి, రాత్రంతా అక్కడే ఉండడమే ఇందుకు కారణమని పోలీసులు చెప్పారు. పార్లమెంట్ హిల్స్ ఈస్ట్ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆగంతకుడి వద్ద ఏవైనా ఆయుధాలు ఉన్నాయా? అనే తెలియరాలేదు.
ఈస్ట్ బ్లాక్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని పోలీసులు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. ఆగంతకుడు ఎవరిపైనా దాడి చేయలేదని వెల్లడించారు. అతడు ఎవరు? ఎలా లోపలికి వచ్చాడు? అతడి ఉద్దేశం ఏమిటి? అతడి వెనుక ఎవరున్నారు? అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మార్చి 23న పార్లమెంట్‌ను రద్దుచేసిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.