
కెనడా పార్లమెంటు భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పార్లమెంట్ హిల్‌లోని ఈస్ట్ బ్లాక్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు వెల్లింగ్టన్ స్ట్రీట్‌లోని అన్ని రోడ్లను మూసివేశారు. పెద్ద సంఖ్యల్లో పోలీసులు మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, కెనడాలో అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలకు ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.