
భారతీయ విద్యార్థులకు కాసింత ఊరట
టొరంటో: కెనడాలో జీవనవ్యయం విపరీతంగా పెరిగిన వేళ ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చే నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం తీసుకుంది. ప్రైవేట్ రంగంలో కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్య కోసం కెనడాకు వచ్చి తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే భారతీయ విద్యార్థులకు లబి్ధచేకూరనుంది. ప్రస్తుతం ప్రతి గంటకు 17.30 కెనడియన్ డాలర్ల చొప్పన కనీస వేతనం చెల్లిస్తుండగా ఇకపై 17.75 కెనడియన్ డాలర్లను చెల్లించనున్నారు. కొత్త వేతనాలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చదువుకుంటూనే చిరుద్యోగాలు చేస్తూ సంపాదించే భారతీయ విద్యార్థుల ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గనున్నాయి.
‘‘ఆదాయ అసమానతలను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఫెడరల్ కనీస వేతనాలను పెంచుతున్నాం. దీంతో వ్యాపారాలు, పరిశ్రమల్లో కార్మికులకు స్థిరాదాయం కొంతైనా పెరుగుతుంది. మరింత పారదర్శకమైన ఆర్థికవ్యవస్థను నిర్మించే క్రమంలో మేం మరో అడుగు ముందుకేశాం’’అని కెనడా ఉపాధి, కార్మికాభివృద్ధి, శ్రామికుల మంత్రిత్వ శాఖ మంత్రి స్టీవెన్ మ్యాకినన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సంస్థలన్నీ తమ ఉద్యోగుల జీతభత్యాల జాబితాలను పెంచిన కనీస వేతనాలకు అనుగుణంగా వెంటనే సవరించాలని ఆదేశించాం. ఇంటర్మ్‌లు సహా ఉద్యోగులు, కార్మికులందరికీ సవరించిన కనీస వేతనాలు అందేలా చూస్తాం’’అని ఆయన అన్నారు. కెనడాలో గత ఏడాది వినియోగదారుల ధరల సూచీ వార్షిక సగటును ఆధారంగా చేసుకుని ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన కనీస వేతనాల సవరణ విధానాన్ని అమలుచేస్తారు.
తగ్గనున్న స్థానికుల కష్టాలు
పెరిగిన జీవన వ్యయంతో కెనడాలోని మధ్యతరగతి స్థానికులకు ఆహార కష్టాలు పెరిగాయి. ఇన్నాళ్లూ వీళ్లలో చాలామంది స్థానికంగా ఉచితంగా ఆహారం అందించే ఫుడ్‌బ్యాంక్‌ల మీదనే ఆధారపడ్డారు. ఉన్నత విద్య కోసం వచ్చిన విదేశీ విద్యార్థులు సైతం కాస్త డబ్బును ఆదా చేసుకునేందుకు ఈ ఉచిత ఫుడ్‌బ్యాంక్‌లనే ఆశ్రయిస్తారు. అయితే గత ఏడాది విదేశీ విద్యార్థులు వెల్లువలా పోటెత్తడంతో లక్షలాది మందికి ఉచితంగా ఆహారం అందించడం తమ వల్లకాదని ఫుడ్‌బ్యాంక్‌లు చేతులెత్తేశాయి. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులు ఖాళీ కడుపులతో ఫుడ్‌బ్యాంక్‌ల నుంచి వెనుతిరిగారు.
ఇప్పుడు కనీస వేతనాలు పెరిగిన నేపథ్యంలో స్థానిక కెనడియన్ల నిత్యావసరాల కొనుగోలు శక్తి కాస్తంత పెరిగింది. దీంతో ఇప్పుడు వీళ్లంతా మునపటిస్థాయిలో ఫుడ్‌బ్యాంక్‌లను ఆశ్రయించకపోవచ్చు. దాంతో విదేశీ విద్యార్థులకు మళ్లీ ఫుడ్‌బ్యాంక్‌లలో ఉచిత ఆహారం లభించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం అనేది జస్టిన్ ట్రూడో ప్ర భుత్వానికి పెద్ద సమస్యగా తయారవడం తెల్సిందే. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ధరల అంశమే ప్రధానంకానుంది. కనీస వేత నం 2.4 శాతం పెరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయులకూ లబ్ధి చేకూరనుంది.
కెనడా జనాభాలో 3.7 శాతం భారతీయులే
కెనడా జనాభాలో 3.7 శాతం భారతీయులే ఉన్నారు. గత ఏడాది కెనడావ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగాలు చేసిన వారిలో 22 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇలా తాత్కాలిక(గిగ్) ఆర్థికరంగంలో భారతీయులు కీలకంగా ఉన్నారు. కెనడాలో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న వారిలో అత్యధిక మంది వలసదారులే. 2005 ఏడాది నుంచి 2020 ఏడాదిదాకా గమనిస్తే కెనడా కార్మికుల్లో తాత్కాలిక కార్మికుల వాటా 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. వీళ్లుగాక కెనడాలో ఉన్న దాదాపు 13.5 లక్షల మంది తాము భారతీయ మూలాలున్న వ్యక్తులమని వెల్లడించడం విశేషం.
ముఖ్యంగా భారతీయులు రిటైల్, హెల్త్‌కేర్, నిర్మాణం, ఇతర రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు మాత్రమేకాదు ఇంటర్మ్‌లుగా పనులు చేసుకుంటున్న భారతీయ విద్యార్థులకు సైతం ఈ కనీస వేతన లబ్ధి ప్రయోజనాలు దక్కనున్నాయి. భారత్ నుంచి ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, వ్యాపారాలు, ఇంజనీరింగ్, హెల్త్‌సైన్సెస్, ఐటీ రంగాల్లో విద్యనభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు కెనడాకు వస్తున్నారు. చదువు పూర్తయ్యాక ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, వాణిజ్య, వ్యాపార రంగాల్లో ఉద్యోగులుగా కెనడాలోనే స్థిరపడుతున్నారు. భారతీయ విద్యార్థులు విద్య రూపంలో, తాత్కాలిక ఉపాధి, వస్తూత్పత్తుల వినియోగం ఇలా అన్నింటిలో కలిపి 2021 ఏడాదిలో కెనడా ఆర్థికవ్యవస్థకు 4.9 బిలియన్ కెనడియన్ డాలర్లమేర లబి్ధచేకూర్చారు. కెనడాకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ.