
2024లో బాగా తగ్గిన వైనం
కెనడాకు 41 శాతం తగ్గుదల
బ్రిటన్‌కు 27, అమెరికాకు 13 శాతం
రష్యా, ఇతర దేశాలవైపు చూపు
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌లకు వెళ్తున్న వారి సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్తాన్‌లకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం విశేషం! మొత్తంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. 2023లో 8,92,989 మంది భారత విద్యార్థులు (Indian Students) విదేశీ బాట పట్టగా 2024లో ఏకంగా 7,59,064కు తగ్గారు! అంటే దాదాపు 15 శాతం తగ్గుదల!!
ఆ మూడు దేశాల్లో...
2024లో ఉన్నత విద్య కోసం వెళ్లిన అమెరికా, కెనడా, బ్రిటన్‌లకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 27 శాతం తగ్గినట్టు ఇమిగ్రేషన్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1,64,370 తగ్గుదల! 2023లో కెనడాకు 2,33,532 మంది భారత విద్యార్థులు వెళ్లగా 2024లో 1,37,608కు తగ్గారు. అంటే 41 శాతం తగ్గుదల. బ్రిటన్‌కు 27 శాతం, అమెరికాకు 13 శాతం తగ్గుదల నమోదైంది. కఠినమైన వీసా నిబంధనలు, అధిక ఆర్థిక డిమాండ్లు, ఎక్కువ తిరస్కరణలు, దౌత్య సమస్యల వంటివి ఇందుకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి.
ఉద్రిక్తతలు...
ప్రధానంగా కెనడాతో భారత్‌కు దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో ఉన్నత విద్యకు ఆ దేశాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్య బాగా తగ్గింది. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అందులో భారత ప్రమేయం ఉందని కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో 2023 నుంచి పరిస్థితి దిగజారుతూ రావడం ఇందుకు కారణమైంది. వీటికి తోడు కెనడా తన వీసా, స్టూడెంట్ పర్మింట్ నిబంధనలను కఠినతరం చేసింది.
చదవండి: తెలుగు అమ్మాయి సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
బ్రిటన్‌లో నిబంధనలే అడ్డంకిగా మారాయి. పీజీ రీసెర్చ్, ప్రభుత్వ నిధులతో నడిచే పథకాల్లోని వారు మినహా ఇతర విదేశీ విద్యారులు (Foreign students) తమ కుటుంబీకులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ 2023లో నిబంధనలు తెచ్చింది. దాంతో ఉన్నత చదువులకోసం యూకేను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య తగ్గింది.
ఆ దేశాలవైపు చూపు
కొత్త దేశాలపై భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2024లో అత్యధిక మంది విద్యార్థులు రష్యాకు వెళ్లారు! 2023తో పోలిస్తే 34 శాతం పెరుగుదల నమోదైంది. 2024లో జర్మనీకి 34,702 విద్యార్థులు పెరిగారు. ఉజ్బెకిస్తాన్‌కు 9,915 మంది, బంగ్లాదేశ్‌కు 8,864 మంది అధికంగా వెళ్లారు. కోవిడ్ తర్వాత విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment