రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది! | Indian students face hardship due to falling rupee value | Sakshi
Sakshi News home page

రూపాయి పడింది.. ఫీజు భారం పెరిగింది!

Published Mon, Dec 30 2024 3:20 AM | Last Updated on Mon, Dec 30 2024 2:12 PM

Indian students face hardship due to falling rupee value

విదేశీ చదువుకు డాలర్‌ దెబ్బ

అమెరికాలో ఎమ్మెస్‌ కలకు ఆటంకాలు 

పతనమవుతున్న రూపాయి విలువతో భారత విద్యార్థులకు కష్టాలు 

ట్యూషన్‌ ఫీజులో సగటున 10 శాతం పెరుగుదల! 

అదనపు రుణం ఇవ్వబోమంటున్న బ్యాంకులు.. 

దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్‌ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్‌ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్‌ సీజన్‌ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌)లో డాలర్‌ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 

2014లో డాలర్‌ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్‌ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. 

పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే  డాలర్‌ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. 

మరోవైపు పార్ట్‌ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 

2025లో రూ.5.86 లక్షల కోట్ల భారం
భారత్‌ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. 

ప్రస్తుతం డాలర్‌ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయం
స్ప్రింగ్‌ (మార్చి నుంచి జూన్‌) సీజన్‌లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్‌ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. 

ఉపాధి భరోసా ఏదీ?
అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్‌ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. 

చ‌ద‌వండి: త్వరలో హైదరాబాద్‌ – డాలస్‌ విమానం

ఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. 

ఈ పరిస్థితి ఊహించలేదు 
అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్‌ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్‌ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్‌ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. 
– పాయం నీలేష్‌ (అమెరికాలో ఎంఎస్‌ విద్యార్థి)

వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..
యూఎస్‌ వెళ్లడానికి బ్యాంక్‌ లోన్‌ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్‌ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు  ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. 
– నీలిమ  (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)

2014లో డాలర్‌ విలువ రూ.60.95
2022 (ఫాల్‌ సీజన్‌)లో రూ.79
2024 డిసెంబర్‌లో రూ.85.03
2025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement