
భారత విద్యార్థుల్లో నయా ట్రెండ్
తక్కువ ట్యూషన్ ఫీజులు, సరళతర వీసా నిబంధనలు
నాణ్యమైన విద్య, స్కాలర్‌షిప్స్, చక్కటి కెరీర్ అవకాశాలు
అమెరికా, బ్రిటన్, కెనడాలలో తడిసిమోపెడవుతున్న జీవన వ్యయం
దీనికి తోడు ఉద్యోగ అనిశ్చితి
దీనితో ఆ దేశాలకు తగ్గుతున్న దేశ యువత
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్
యూఎస్,యూకేల్లో కఠిన విధానాలు
అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం.
ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ..
అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్‌లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్‌లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?
⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్‌లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి.
⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి.

⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్‌లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది.
⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి.
⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్‌షిప్‌లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్‌లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి.