
బెట్టింగ్ యాప్స్ అలాగే డిజైన్ చేసి ఉంటాయి
‘సాక్షి’తో సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు.
బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’
యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది.
మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు
సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్‌ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి.
అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే..
బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం.
తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం
బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు.
ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు.