సరిగ్గానే దిద్దుతున్నారా? | Objections to evaluation of competitive exams in Telugu states | Sakshi
Sakshi News home page

సరిగ్గానే దిద్దుతున్నారా?

Published Sat, Apr 12 2025 2:05 AM | Last Updated on Sat, Apr 12 2025 2:05 AM

Objections to evaluation of competitive exams in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు

గ్రూప్‌–1 సహా అన్ని పరీక్షలపై అనుమానాలు 

లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన 

పేపర్‌ రూపకల్పన నుంచి మూల్యాంకనం వరకు సమస్యలు

అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కొరతతో ఇబ్బందులు 

తెలుగు రాష్ట్రాల్లో 75 శాతం ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ  

సాక్షి, ఎడ్యుకేషన్‌
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీపడే ఉద్యోగ నియామక పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా? వాటిని సరిగానే దిద్దుతున్నారా?అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. పలు పోటీ పరీక్షల మూల్యాంకనంపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదివి పరీక్ష రాస్తే, ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత, అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను బలపర్చేలా ఇటీవల గ్రూప్‌–1 పరీక్షలో వచ్చిన ఫలితాలు ఉన్నాయని సబ్జెక్ట్‌ నిపుణులు అంటున్నారు. 

‘కీ’ పాయింట్లకే పరిమితమై...
పోటీ పరీక్షల్లో లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించేది మూల్యాంకనమే. ఇంతటి కీలకమైన మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించే అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుబాటులో ఉన్నవారితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దేవారికి అధికారులు నాలుగైదు ‘కీ’పాయింట్లు ఇస్తారు. అయితే, అభ్యర్థి అంతకంటే మంచి పాయింట్లతో సమాధానం రాసినా, ఫ్యాకల్టీ ఆ కీ పాయింట్ల అన్వేషణకే పరిమితమై తగిన మార్కులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతోపాటు వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్‌ను ఒక్కరితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతోంది అని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్‌ పోస్ట్‌లు రెండు రాష్ట్రాల్లో భారీగా ఖాళీగా ఉండటమే సమస్యకు మూలకారణమని అభ్యర్థులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య నెలకొందని చెబుతున్నారు. 

ఇవీ కొన్ని సమస్యలు.. 
గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఉండే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. పాలిటీ వరకు మాత్రమే అకడమిక్స్‌లో ఉంటుంది. మూల్యాంకనం చేసే అధ్యాపకులకు ఇండియన్‌ సొసైటీ, గవర్నెన్స్‌ గురించి అంతగా అవగాహన ఉండదు. దీంతో వారు కీ షీట్‌పైనే ఆధారపడి మూల్యాంకనం చేస్తున్నారు.  

⇒  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌లో బయాలజీ, ఫిజిక్స్, సమకాలీన సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాల ఉంటాయి. కానీ, డిగ్రీ స్థాయిలో కోర్‌ సైన్స్‌ సబ్జెక్టులే ఉంటాయి. కరెంట్‌ టాపిక్స్‌ ఉండవు. దీంతో ఎవాల్యుయేటర్స్‌ కరెంట్‌ టాపిక్స్‌పై అవగాహన లేకుండానే మూల్యాంకనం చేస్తున్నారు.  

⇒  జనరల్‌ ఎస్సే పేపర్‌లో హిస్టరీ, కల్చర్, ఎకనమీ, పాలిటీ, కరెంట్‌ టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూల్యాంకన చేయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ను నియమించాలి. కానీ.. అలా జరట్లేదని అభ్యర్థులు అంటున్నారు. 

⇒  వేర్వేరు సబ్జెక్టులు కలిపి ఉండే పేపర్ల విషయంలో సెక్షన్‌ వారీగా వేర్వేరు సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.  

⇒  రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పోస్టులు 75 శాతం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 4,330 ఉంటే.. 1,048 మంది మాత్రమే ఉన్నారు. వీరిలోనూ గత నెలలో దాదాపు 150 మంది పదవీ విరమణ చేశారని సమాచారం. తెలంగాణలో 2,825 పోస్టులకు గాను 873 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.  

⇒ డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు కూడా దాదాపు 40 శాతం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరతతో బోధన ప్రమాణాలు తగ్గడమే కాకుండా.. పరీక్షల నిర్వహణలో ప్రొఫెసర్ల భాగస్వామ్యం లేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి. 

అనువాదం కూడా సమస్యే  
పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నల అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రశ్న పత్రాన్ని ముందుగా ఇంగ్లిష్లో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఇందుకోసం అఫీషియల్‌ ట్రాన్స్‌లేటర్స్‌ను నియమిస్తున్నారు. వారు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోకుండా మక్కీకి మక్కీ (ట్రూ ట్రాన్స్‌లేషన్‌) అనువాదం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. సివిల్‌ డిసోబీడియన్స్‌ మూవ్‌మెంట్‌ను (శాసన ఉల్లంఘన ఉద్యమం) పౌర అవిధేయత ఉద్యమం అని అనువాదం చేస్తుండటంతో అదేమిటో తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమే కావటంలేదు. ప్రశ్న పత్రం అనువాద ప్రక్రియలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి కనీసం ఏడెనిమిది మందిని భాగస్వాములను చేస్తే సమస్య పరిష్కారమవుతందని నిపుణులు చెబుతున్నారు. 

సమయాభావం 
పోటీ పరీక్షల్లో ఎదురవుతున్న మరో సమస్య సమయాభావం. అభ్యర్థులకు మొత్తం ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కూడా కొన్ని సందర్భాల్లో సమయం సరిపోవడం లేదు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్న పత్రం రూపొందించిన వారికి సైతం 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో చదవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థులు కనీసం 30 నుంచి 40 ప్రశ్నలు చదవకుండానే సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లోని సీశాట్‌లో 80 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తారు.  

మెయిన్స్‌ను కూడా ఆబ్జెక్టివ్‌ చేయాలా? 
గ్రూప్‌–1 మెయిన్స్‌ ప్రశ్న పత్రం రూపకల్పన, మూల్యాంకన సమస్యల నేపథ్యంలో మెయిన్స్‌ను కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సంబంధిత సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ప్రశ్న పత్రం రూపొందించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి 
గ్రూప్‌–1లో కచ్చితంగా ఇద్దరు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. మొదటి, రెండో మూల్యాంకనాల్లో మార్కుల మధ్య 5 శాతం వ్యత్యాసం ఉంటే మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి. అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో ఇదే విధానం అమలవుతోంది. రెండు, మూడు సబ్జెక్టుల సమ్మిళితంగా ఉన్న పేపర్ల విషయంలో.. సెక్షన్‌ వారీగా సంబంధిత సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నపత్రం అనువాదం ఉండాలి.  – ప్రొఫెసర్‌. వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌  

యూపీఎస్సీ తరహాలో చేయాలి
గ్రూప్‌–1 మెయిన్స్‌ మూల్యాంకనం కూడా యూపీఎస్సీ సివిల్స్‌ మూల్యాంకనం మాదిరిగా ఒక నిర్దిష్ట విధానంలో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మెయిన్స్‌కు 1:13 (ఒక్కో పోస్టుకు 13 మంది చొప్పున) ఎంపిక చేస్తారు. మూల్యాంకనానికి దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఎంపికచేస్తారు. వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ల మూల్యాంకనానికి సెక్షన్‌ వారీగా వేర్వేరు నిపుణులను నియమిస్తారు. యూపీఎస్సీ మూల్యాంకనంలో కీ పాయింట్లను కేటాయించినప్పటికీ.. సమాధానంలో అదనపు సమాచారం ఉంటే.. వాటికీ మార్కులు ఇస్తారు. రాష్ట్రాల స్థాయిలో ఈ విధానం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement