Professors
-
ప్రొఫెసర్లకు ఇండస్ట్రీ ఫెలోషిప్
సాక్షి, అమరావతి: పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి... పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి... సాంకేతిక విద్య అధ్యాపకుల్లో బోధన సామర్థ్యాలను మరింత పెంచడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్య ప్రొఫెసర్లను ఫెలోషిప్ పేరుతో ఏడాదిపాటు పరిశ్రమల్లో పని చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా ప్రొఫెసర్లు తమ పరిశ్రమ అనుభవాన్ని బోధనలో వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సిద్ధం చేసింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన ప్రొఫెసర్లకు యథావిధిగా జీతంతోపాటు రూ.లక్ష వరకు స్టైఫండ్ అందించనుంది. ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులను పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా ప్రొఫెసర్లు సిద్ధం చేయగలరని ఏఐసీటీఈ భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 300 ఫెలోషిప్‌లు.. » ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏఐసీటీఈ గుర్తించిన లిస్టెడ్ కంపెనీల్లో సాంకేతిక విద్య ప్రొఫెసర్లు పని చేయాలి. » తొలుత పైలట్ ప్రాజెక్టుగా 2025–26 విద్యా సంవత్సరానికి 300 ఫెలోషిప్‌లు ఇచ్చేలా త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఇందులో 200 మంది ప్రొఫెసర్లు సంవత్సరంపాటు పరిశ్రమల్లో పని చేసేందుకు అనుమతిస్తుంది. మరో 100 మంది ఆరు నెలలు చొప్పున నియామకాలను ఎంపిక చేసుకోవచ్చు. » 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఈ ఫెలోషిప్‌నకు అర్హులు. వారు వృత్తి జీవితంలో గరిష్టంగా రెండుసార్లు ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. » కంపెనీల విశ్వసనీయతను నిర్ధారించడానికి స్టాక్ మార్కెట్లో లిస్టెడ్(జాబితా చేసిన)వాటిలో మాత్రమే ఫెలోషిప్‌లకు ఏఐసీఈటీ అవకాశం కల్పిస్తుంది. కంపెనీ బహుళజాతి సంస్థ అయినప్పటికీ భారతదేశంలోని పోస్టింగ్‌లకు మాత్రమే ఫెలోషిప్ వర్తిస్తుంది. » అదేవిధంగా ప్రొఫెసర్లను ఇండస్ట్రీ ఫెలోషిప్‌నకు పంపడంపై నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫెలోషిప్ తర్వాత అధ్యాపకులను నిలుపుకోవడం వంటి సవాళ్లు విద్యాసంస్థలకు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ప్రొఫెసర్లు ఏడాదిపాటు కళాశాలలకు దూరంగా ఉండటం వల్ల వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
ఓయూలో ‘పదోన్నతుల’ రగడ!
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో పదోన్నతుల రగడ కొనసాగుతోంది. అధిక వేతనం కోసం కొంతమంది ప్రొఫెసర్లు (Professors) అడ్డదారిలో ప్రమోషన్లు పొందారనే అంశం ఓయూ అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో కలకలం రేపుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 50 మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందినట్లు ‘ఔటా’ ఫిర్యాదు చేయగా, మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్ పదోన్నతులను రద్దు చేస్తూ యూజీసీ (UGC) ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా సీనియర్ ప్రొఫెసర్ హోదా.. యూనివర్సిటీల్లో బోధన, పరిశోధనలకుగాను ప్రొఫెసర్లను నియమిస్తారు. ప్రొఫెసర్ కంటే ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లేదా రీడర్ హోదాలు ఉంటాయి. అయితే బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక సీనియర్ ప్రొఫెసర్ అనే మరో హోదాను సృష్టించింది. సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌గా 10 ఏళ్ల సరీ్వస్, 10 పరిశోధనా పత్రాలు(పబ్లికేషన్స్), ఇద్దరు విద్యార్థులకు పీహెచ్డీ పర్యవేక్షకులు(గైడ్షిప్)గా ఉండాలి. సీనియర్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.3.40 లక్షల వరకు వేతనంతోపాటు పింఛను, ఇతర అలవెన్సులు ఉంటాయి.తొలిసారి 51 మందికి అవకాశంఓయూ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.రవీందర్ హయాంలో మూడుసార్లు జరిగిన కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్(సీఎస్ఎస్) పదోన్నతుల్లో 51 మంది సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కానీ, అందులో కొందరికి యూజీసీ నిబంధనల ప్రకారం పరిశోధనా పత్రాలు 10 కంటే తక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఔటా) నాయకులు ఫిర్యాదు చేశారు. ఔటా ఫిర్యాదు మేరకు ఓయూ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారించిన అంశాలను బహిర్గతం చేయాలని ఔటా నాయకులు కోరినా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ‘గతం గతః భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి’అని కమిటీ విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇద్దరి పదోన్నతులు చెల్లవు: యూజీసీ ఓయూలో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. మాజీ వీసీ ప్రొ.రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొ.బాలకిషన్‌కు యూజీసీ నిబంధనల ప్రకారం 10 పరిశోధనాపత్రాలు లేవని తేలడంతో వారి పదోన్నతులు రద్దు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరో 40 మందికి కూడా 10 పరిశోధన పత్రాలు లేవని ఔటా, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారికి ఇంతకాలం చెల్లించిన వేతనం, పింఛన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.చదవండి: పాతబస్తీ మెట్రో పనులు.. చకచకా!నిబంధన మేరకే..: ప్రొ.రవీందర్ ఓయూలో తొలిసారిగా చేపట్టిన సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరణ ఇచ్చారు. ప్రొఫెసర్ బాలకిషన్‌పై వచ్చిన ఆరోపణలను విచారించి ఆయనకు ఇచ్చిన పదోన్నతిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తనకు 10 పబ్లికేషన్స్ ఉన్నాయని, తప్పుడు తడకగా సమాచారాన్ని ఆర్టీఏ ద్వారా సేకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా, అక్రమ పదోన్నతులను రద్దు చేసి, ఇంతవరకు పొందిన వేతనం, పింఛన్‌ను రికవరీ చేయాలని ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్, ఏఐఎస్ఎఫ్ నేత నెలి సత్య డిమాండ్ చేశారు. -
పీజీ మెడికల్ సీట్లపై కత్తి!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీలు తేవాలన్న తాపత్రయంతో ఉన్న కాలేజీల్లోని ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేయడంతో కథ అడ్డం తిరిగింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయం నిర్వాకంతో రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్లకు గండిపడే ప్రమాదం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇష్టారాజ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి అనేక ప్రముఖ మెడికల్ కాలేజీల నుంచి అత్యంత సీనియర్లను బదిలీ చేశారు. కానీ వారి స్థానాలను భర్తీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. వెనుకా ముందు చూడకుండా బదిలీలు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీలు భర్తీ చేసే చాన్సూ లేదు ఉస్మానియా, గాందీ, కాకతీయ వంటి ఎంబీబీఎస్, పీజీ సీట్లతో కూడిన వైద్య కళాశాలలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే, ఈ ఏడాది 40 శాతం సాధారణ బదిలీల నెపంతో 8 కొత్త మెడికల్ కాలేజీలను సాధించేందుకు ప్రొఫె సర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో ప్రస్తుతం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు లేరు. కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ లోని ఓబీజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జన రల్ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పదోన్నతులకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని వైద్య నిపుణులు అంటున్నారు. బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఎన్ఎంసీ సమీక్ష రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,148 పీజీ సీట్లు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ మెడికల్ సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లు బోధనానుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు తగ్గితే ఆ ప్రకారం జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పీజీ సీట్లకు కోత పెడుతుంది. ప్రతి నెలా, రెండు నెలలకోసారి ఫ్యాకల్టీని ఎన్ఎంసీ సమీక్షిస్తుంది. అంతేకాదు బయోమెట్రిక్ హాజరు విధానంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే టీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్యపై అంచనా వేస్తుంది. కాబట్టి పీజీ సీట్లకు గండం తప్పేలా లేదు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 481 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 188 ప్రొఫెసర్ పోస్టుల మంజూరు ఉండగా, ఇటీవల బదిలీల కారణంగా ప్రస్తుతం కేవలం 86 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. అంటే 102 ప్రొ ఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 178 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను కేవలం 26 మంది మాత్రమే ఉన్నారు. అంటే అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు 152 ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 284 పీజీ సీట్లకు సరిపోను మాత్రమే ఉన్నారు. కాగా బదిలీల కారణంగా ఉస్మానియాలోని 197 పీజీ సీట్లకు కత్తెర పడే ప్రమాదం నెలకొంది. ఇక గాంధీ మెడికల్ కాలేజీలో 213 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. అయితే బదిలీల కారణంగా అక్కడ 60 మంది ప్రొఫెసర్లకు గాను 35 మందే మిగిలారు. 73 మందిఅసోసియేట్ ప్రొఫెసర్లకుగాను 40 మందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు 145 పీజీ సీట్లకు మాత్రమే సరిపోతారు. అంటే మిగిలిన 68 పీజీ సీట్లపై కత్తి వేలాడుతోందన్న మాట. ఇలా ఒక్క ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఏకంగా 265 పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం నెలకొంది. ఇలాగే కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలు, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వంటి చోట్ల కూడా పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం నెలకొంది.సీట్లు కోల్పోయే అవకాశం లేదు పీజీ సీట్లు కోల్పోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లు అలాగే ఉంటాయి. అవసరమైన ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన, పదోన్నతులపై నియమించాం. – డాక్టర్ వాణి, డీఎంఈ -
నిలోఫర్‌లో ‘కుర్చీ’ కుస్తీ !
నాంపల్లి: ప్రముఖ నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య కొట్లాట జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియతో ఈ వైరం మొదలైంది. సూపరింటెండెంట్ పోస్ట్ నీదా... నాదా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్‌కు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఏడాది కూడా పూర్తికాక ముందే తనపై బదిలీ వేటు వేశారని, అక్రమ బదిలీని నిలుపుదల చేయాలంటూ డాక్టర్ ఉషారాణి నిజామాబాద్‌కు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, న్యాయస్థానంలో డాక్టర్ ఉషారాణికి అనుకూలంగా తీర్పు వచి్చంది. కోర్టు ఆదేశాలతో డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. అయితే అక్కడ ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్ రవికుమార్ ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించారు. చెక్కుబుక్స్, సెల్‌ఫోన్‌ను తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రొఫెసర్ పోస్టులో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఉడుంపట్టు... అన్యాయంగా, అక్రమంగా తన పోస్టులో కొనసాగుతున్నారని డాక్టర్ ఉషారాణి ఆరోపిస్తుండగా, కాదు తనకే బాధ్యతలు ఇచ్చారంటూ డాక్టర్ రవి కుమార్ అంటున్నారు. ఇద్దరూ ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. డాక్టర్ రవికుమార్ పూర్తిస్థాయి బాధ్యతల కోసం కోఠిలోని డీఎంఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాను దళితుడినని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దళితుడేనని, ఎలాగైనా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అయితే ఈ వివాదాన్ని డీఎంఈ కార్యాలయం కూడా ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పడేసింది. మరోవైపు నిలోఫర్‌లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. వైరల్ జ్వరాలు సోకి బాధితులతో కిక్కిరిసిపోతోంది. నిలోఫర్‌లో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌తో కలిపి మొత్తం 1,300 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఈ పడకలు ఎటూ సరిపోవడం లేదు. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేనికారణంగా నెల రోజులుగా పాలనంతా అస్తవ్యస్తమైంది. ఇప్పటికైనా నిలోఫర్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని రోగులు, రోగి సహాయకులు, ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. -
హేరామ్.. ‘గాంధీ’ ఖాళీ
గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయిని, కోవిడ్ సంక్షోభ వేళ వేలాది మంది ప్రాణాలు కాపాడిన కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి బదిలీల విఘాతం తగిలింది. సుమారు 2 వేల మంది ఇన్‌పేషెంట్లు, మరో మూడు వేల మంది అవుట్‌పేòÙంట్లకు వైద్యసేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. లాంగ్‌స్టాండింగ్ పేరిట బోధనాసుపత్రి నిర్వహణలో ఉన్న కీలకమైన ప్రొఫెసర్లను మూకుమ్మడిగా బదిలీ చేయడంతో గాంధీ ఆస్పత్రి నిర్వహణపై పెనుప్రభావం పడనుంది. ఆస్పత్రి సూçపరింటెండెంట్తోపాటు ఆయా విభాగాలకు చెందిన సుమారు 40 మంది ప్రొఫెసర్లను ఒకేసారి బదిలీ చేయడంతో మేజర్ సర్జరీల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులకు గైడ్లుగా వ్యవహరించే ప్రొఫెసర్లకూ బదిలీ కావడంతో పీజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. సీనియర్, జూనియర్ నిష్పత్తిలో కాకుండా నిష్ణాతులైన వైద్యులందరినీ ఇష్టారాజ్యంగా శుక్రవారం బదిలీ చేయడంపై వైద్యవర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకు.... కీలకమైన గాంధీ జనరల్ సర్జరీ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లను ఒకేమారు బదిలీ చేయడంతో సర్జరీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. నూతనంగా బదిలీపై వచ్చే ప్రొఫెసర్లకు ఇక్కడి పరిస్థితులు ఆకళింపు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అరకొరగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ వైద్యులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. జనరల్ మెడిసిన్ విభాగంలో ఆరుగురు ప్రొఫెసర్లకుగాను ఐదుగురు బదిలీ అయ్యారు. అత్యంత కీలకమైన అనస్తీషియా విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్లు బదిలీ కావడంతో ఆపరేషన్లలో జాప్యం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్థోపెడిక్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీకాగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. గైనకాలజీ విభాగంలో నలుగురు ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.ఒక్కో ప్రొఫెసర్ ఉన్న విభాగంలో కూడా యూరాలజీ, సీటీ సర్జరీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఉన్న ఒకే ఒక్క ప్రొఫెసర్‌ను కూడా బదిలీ చేయడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రభావం పడనుంది. -
విద్యకు సహకారం అందించండి
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్య క్రమాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకబృందం గురువారం సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్íÙప్ (పీఎస్‌ఐఎల్–24) కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ బృందం రాష్ట్రానికి వచి్చంది. ఈ బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లో 10–12 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులతోపాటు 33 జిల్లాల ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాశ్, డాక్టర్ ఎండీ రైట్ పాల్గొన్నారు. -
వర్సిటీ అధ్యాపకుల వయోపరిమితి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. కానీ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. రాష్ట్రంలో త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెపుతున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రిటైర్మెంట్ల కారణంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. మరో పక్క రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల వైఎస్ చాన్స్లర్ల పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. దీంతో కొత్త వీసీల నియామకం చేపడితే తప్ప యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టే వీల్లేదు. ఈ సమయంలో బోధన సిబ్బంది కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. 2024లోనే ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ అసెస్మెంట్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాక్‌లో మంచి గ్రేడ్ వస్తే తప్ప రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ యూనివర్సిటీకి వచ్చే అవకాశం లేదు. ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి
ఏయూ క్యాంపస్: కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్ కార్నర్ ఉందన్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ఠాగూర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్.విజయమోహన్, డాక్టర్ జి.రవికుమార్, రెక్టార్ కె.సమత, ప్రిన్సిపాల్స్ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్లు ఆచార్య ఎన్.సత్యనారాయణ, టి.షారోన్ రాజు, పాల్ తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఏరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీల ఉనికికే ప్రమాదం... రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ఇదీ దుస్థితి... ►శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. ►రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ►జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లే. -
ప్రొఫెసర్లుగా 80 మంది వైద్యులు
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వైద్యుల కల ఎట్టకేలకు ఫలించింది. ఒకే దఫాలో 80మందికి పైగా అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులకు ప్రొఫెసర్లు కావడమనేది అత్యున్నత పోస్టు. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తుంటారు. గత ప్రభుత్వాల హయాంలో అర్హత ఉన్నా.. సకాలంలో పదోన్నతులు ఇవ్వలేదు. తాజాగా క్లినికల్ విభాగంలో 80 మందికి పైగా వైద్యులు ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారు. వీరికి నేడో రేపో జూమ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. వీరితో పాటు నాన్క్లినికల్ అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ ఇలా రకరకాల విభాగాల్లో పనిచేసే వారి పదోన్నతుల జాబితా రెడీ చేశారు. ఈ వారంలో వీళ్లకూ ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే ఏడుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతులిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2006 తర్వాత టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులందరికీ 2020లోనే పీఆర్సీ వచ్చింది. 2016లోనే అప్పటి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వేతన సవరణ చేయడంతో ఎంతోమంది వైద్యులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. ప్రధానంగా సర్వీసు 10 ఏళ్లు దాటిన వైద్యులకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పెరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సైతం భారీగా వేతనాలు పెరిగాయి. -
వైరల్ వీడియో: ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు
-
ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు, వైరల్ వీడియో
ఖరగ్‌పూర్: కరోనా సంక్షోభ సమయంలో ఆన్లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్‌లో తప్పనిసరిగా మారిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థుల కష్టాలు అన్నీ కావు. తాజాగా ఒక ఐఐటీ ప్రొఫెసర్ విద్యార్థులపై విరుచుకు పడింది. ఐఐటీ ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సీమా సింగ్ ఆన్లైన్క్లాస్లో విద్యార్ధులతోపాటు, వారి తల్లిదండ్రులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్క్లాస్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తూ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించింది. విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా దూషణలకు దిగింది. ‘మీరు నా పై కంప్లయిట్ ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. వీలైతే సెంట్రల్ మినిష్టర్స్‌కు కూడా కంప్లయిట్ ఇచ్చుకోండి’ అంటూ ఆమె విద్యార్ధులపై చిందులు వేసింది. అంతేకాదు పరీక్షలో ఫెయిల్ చేస్తానని విద్యార్థులను బెదిరించిన వైనంప పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరొక వీడియోలో విద్యార్థి తాతా చనిపోయినందుకు పరీక్ష నుంచి మినహాయింపు కోరగా, ప్రొఫెసర్ ఆ విద్యార్థిని దూషించింది. ‘నేను కూడా హిందువునే నాకు మన సంప్రదాయాలు, కట్టుబాట్లు నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఎవరూ చేయడం లేదంటూ’ ప్రొఫెసర్ సీమాసింగ్ విద్యార్థిపై మండిపడింది. మరో వీడియోలో క్లాస్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు భారత్ మాతా కీ జై అనగా, వారిపై ‘మీరు దేశానికి ఇది తప్ప ఇంకొటి చేయాలేరా’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యార్థుల మార్కులు నా చేతిలో ఉన్నాయంటూ వారిని బెదిరించింది. కాగా ఈ తతంగాన్ని ఐఐటీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. కాగా ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. చదవండి: మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ -
ఆ నలుగురు ఔట్..!
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేస్తూ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో గురువారం రాత్రి ఇన్చార్జి రిజిస్ట్రార్ వైకే సుందరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నలుగురు ప్రొఫెసర్లు ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఉత్తర్వులను వారి వ్యక్తిగత మెయిల్‌కు పంపడంతో పాటు శుక్రవారం వాటిని సొంత ఊరు అడ్రస్‌కు పోస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ పాలక మండలి నియామక నోటిఫికేషన్ రద్దు చేసిందన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు పోయినట్లే. అయితే వాటిని కాపాడుకునేందుకు సదరు ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతపురం జేఎన్టీయూ మాదిరే తమకు కూడా హైకోర్టు ధర్మాసనం సానుకూలమైన తీర్పు ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సుందరకృష్ణ కృష్ణా యూనివర్సిటీ నుంచి సాగనంపే నలుగురు ప్రొఫెసర్లలో ఒకరైన టి. హైమావతి ప్రస్తుతం ఇక్కడ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకం, తొలగింపు... రిజిస్ట్రార్ సంతకంతోనే జరగాల్సి ఉంది. ఇది చిక్కు తెచ్చిపెట్టింది. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ దీనిపై తీవ్ర తర్జన భర్జన అనంతరం వైకే సుందరకృష్ణను ఇన్చార్ట్ రిజిస్ట్రార్‌గా నియమించి, అతనితో ఆ నలుగురు ప్రొఫెసర్లకు తొలగింపు ఉత్తర్వులు ఇప్పించారు. తొలగించిన వారు వీరే.. ♦డాక్టర్ తాళ్ల హైమావతి, అప్లైడ్ మాథమెటిక్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు) ♦డాక్టర్ వి. వెంకట్రాము, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, అసిస్టెంట్ ప్రొఫెసర్, యోగి వేమన యూనివర్సిటీ (నూజివీడు పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్‌గా, వర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ బాధ్యతలు చూస్తున్నారు.) ♦డాక్టర్ ఈదర దిలీప్, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ద్రవిడన్ యూనివర్సిటీ (ఇంగ్లిష్ డిపార్ట్ట్మెంట్ హెచ్ఓడీగా, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా ఉన్నారు.) ♦డాక్టర్ వైఏవీఏఎస్‌ఎన్ మారుతి బయోసైన్స్ అండ్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్, గీతం యూనివర్సిటీ ( కాలేజీ అభివృద్ధి కమిటీ (సీడీసీ) డీన్‌తో పాటు క్యాంపస్‌లో ఉన్న ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు). ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే కృష్ణా యూనివర్సిటీ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నాము. నిపుణుల సలహాలు తీసుకొనే ఆ నలుగురు ప్రొఫెసర్లును రిలీవ్ చేశాము. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ నియామకం తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. – కేబీ చంద్రశేఖర్, వైస్ చాన్సలర్, కృష్ణా యూనివర్సిటీ చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
-
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా ఉత్కంఠ నడుమ సాగిన మండలి పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపులో ఇద్దరు ప్రొఫెసర్లు ఓటమి చెందగా, టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన విద్యా సంస్థల యజమానులు ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వారిపై పోటీ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పైగా వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించడం గమనార్హం. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 53,610 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నాగేశ్వర్.. లెక్కింపు ప్రక్రియలో చివరి వరకు కొనసాగినా ఎలిమినేషన్ ప్రక్రియలో తగినన్ని ఓట్లు సాధించలేకపోయారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానంలో తొలిసారిగా బరిలోకి దిగిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 70,072 ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రొఫెసర్లు ఓటమి చెందడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు నేతలు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి చెందారు. ‘నల్లగొండ’స్థానం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమలు గణనీయంగా ఓట్లు సాధించినా.. గెలుపు తీరాలకు చేరలేకపోయారు. చదవండి: MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే.. -
‘అతన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆరేటి ఉమ మహేశ్వరరావుకు ఎటువంటి సంబంధం లేదని ఏయూ దళిత ప్రొఫెసర్లు షరోన్‌రాజ్, ఏన్ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ యాక్టివ్ రోల్స్‌లో కూడా లేని మహేష్ ఏయూ ప్రతిష్టను మసక బార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి పారదర్శక పాలన అందిస్తూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాచారహక్కు చట్టం పేరుతో అనేక మంది ప్రొఫెసర్ల, నాన్ టీచింగ్ సిబ్బంది బ్లాక్ మెయిలింగ్‌కు గురవుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆరేటి ఉమా మహేశ్వరరావుపై గవర్నర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరేటి మహేష్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహేష్‌పై పోలీసులు అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
కరోనా వైరస్‌పై నిట్ ప్రొఫెసర్ల పరిశోధన
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్19) తీరుతెన్నులను కనుగొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలకు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సౌమ్యలిప్సా రాత్, డాక్టర్ కిషాంత్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సౌమ్య, కిషాంత్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కరోనాపై పరిశోధనలు చేపట్టేందుకు వారం క్రితం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థకు మా ఆలోచనలపై పరిశోధనా పత్రం సమర్పించాం. ఆ సంస్థ మా పత్రాలను ఎంపిక చేసింది’అని తెలిపారు. అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసేందుకు అనువుగా ల్యాబ్‌లు ఉన్న నాసా, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ మేరకు ఆన్లైన్లోనే పరిశోధనలు చేయాల్సి ఉండగా నిట్ ప్రొఫెసర్లు శనివారం తమ ప్రాజెక్టును ప్రారంభించారు. వివిధ ఉష్ణోగ్రతల్లో వైరస్ ప్రభావం, దానిని అంతం చేసే అవకాశాలపై పరిశోధనలు చేశాక వ్యాక్సిన్ రూపొందించేందుకు అవకాశాలు సులువవుతాయి. ఏడాది పాటు ఈ పరిశోధనలు కొనసాగుతాయి. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారిలో కొందరు ఇప్పటికే వివరణ ఇవ్వగా, ఇంకొందరు స్పందించలేదు. దీంతో వారిపై వేటు వేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం రంగం సిద్ధం చేసింది. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తెప్పించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా వారిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీవ్ర సంచలనంగా మారింది. అనుభవం ఉండి, సీనియర్ అధ్యాపకులుగా కొనసాగుతున్న వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏడాదికిపైగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వారికి ఉద్వాసన పలకక తప్పట్లేదని డీఎంఈ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వ విద్యాలయంలో కీలక పదవులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదు. వర్సిటీలోని పరిస్థితులకు భయపడి పదవులు వదులుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్సిటీ హాస్టల్స్ ఛీఫ్ వార్డెన్, వార్డెన్, దూర విద్య విభాగం డైరెక్టర్, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తదితర కీలక పోస్టులకు ప్రొఫెసర్లు కరువయ్యారు. పరీక్షల విభాగం డీన్‌గా ఒక ప్రొఫెసర్ ఉన్నప్పటికీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కీలక పదవులు ఖాళీగా ఉండడంతో వర్సిటీలో పాలన గాడి తప్పుతోంది. ఆర్యూ హాస్టల్స్ వార్డెన్ ఎవరో..? రాయలసీమ విశ్వవిద్యాలయంలో రెండు మెన్స్, రెండు ఉమెన్స్ హాస్టళ్లు ఉన్నాయి. అందులో సుమారు 700 మంది విద్యార్థులు ఉంటారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమవుతుంది. వారికి రెండు హాస్టళ్లను ప్రారంభించనున్నారు. అయితే హాస్టళ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఛీఫ్ వార్డెన్‌గా ఎవరున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతమున్న ప్రొఫెసర్ వై.నరసింహులు సంవత్సరం కిత్రమే ఆ పదవికి రిజైన్ చేశారు. రిలీవ్ చేయాలని వందల సార్లు వీసీ, రిజిస్ట్రార్లకు మొరపెట్టుకున్నా చేయలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వర్సిటీలో ఆరŠట్ప్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, తెలుగు శాఖ విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని పనిభారం ఉందని విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు. ఆయన స్థానంలో ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్ వెంకట శేషయ్యకు వార్డెన్‌గా, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయన మొదట అంగీకరించినప్పటికీ తరువాత నాకు ఏపదవి వద్దని చెప్పినట్లు సమాచారం. మెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఒక డిప్యూటీ వార్డెన్, ఉమెన్స్ హాస్టల్స్‌కు సంబంధించి ఇద్దరు డిప్యూటీ వార్డెన్లు హాస్టళ్ల వ్యవహారాలు చూస్తున్నారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆర్థిక పరమైన అంశాల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. అలాగే దూర విద్య విభాగం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు పదవి రాజీనామా చేశారు. అయితే ఉన్నతాధికారులు రిలీవ్ చేయలేదు. ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. అంటీముట్టనట్లుగా పరీక్షల విభాగం డీన్ ఆర్యూ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి విధులకు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నరని సమాచారం. పరీక్షల విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో బా«ధ్యతలు నిర్వర్తించడం లేదు. విభాగంలో అవకతవకల కారణంగా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విశ్వవిద్యాలయం -
జేఎన్టీయూకేలో.. వేధింపుల పర్వం
సాక్షి, కాకినాడ: సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో వేధింపుల పర్వం సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ అండతో ఉన్నతాధికారులు ప్రొఫెసర్లపై వేధింపులకు దిగారు. తమ మాట వింటే.. తాము చెప్పినట్టు నడుచుకుంటే ఓకే.. లేదంటే అనవసర ఆరోపణలు అంటగడుతూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ తంతు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై అత్యధికంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కొందరు ప్రొఫెసర్లు ఎన్సీఎస్టీ, ఎన్‌సీఎస్సీలను ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన కమిషన్ వీసీ డాక్టర్ రామలింగరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ వైవీ సుబ్బారావులకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఎన్సీఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. ఏం జరిగిందంటే..! జేఎన్టీయూకేలో సివిల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ కోటేశ్వరరావును సదరు వీసీ, రిజిస్ట్రార్లు వేధించారన్న ఆరోపణ ఉంది. తాను చేయని తప్పులకు తనను బాధ్యుడి చేస్తూ.. అనవసర ఆరోపణలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించారని ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎన్సీఎస్టీ (నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్)కు తన గోడు వెళ్లబోసుకున్నారు. ప్రొఫెసర్ విన్నపాన్ని స్వీకరించిన కమిషన్ వేధింపులపై వివరణ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్‌లో దక్షిణ రాష్ట్రాల జాతీయ కమిషన్ మెంబర్ శ్రీమతి మాయ చింతమన్ గిన్వటే సమక్షంలో ఆరోపణలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్లపై కమిషన్ తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు వర్సిటీలో మంచివి కాదని, పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. గతంలోనూ ఇంతే.. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు వర్సిటీలో అనేకం చోటు చేసుకున్నాయన్న విమర్శలున్నాయి. అప్పట్లో ముగ్గురు ప్రొఫెసర్లు కమిషన్‌ను ఆశ్రయించగా వీసీ, రిజిస్ట్రార్లకు మందలింపులు తప్పలేదు. అయినా పద్ధతిలో ఏ మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు అండగా ఉన్నారన్న ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్ప డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు ప్రొఫెసర్లదీ అదే బాట.. వేధింపుల పర్వం కేవలం కాకినాడ జేఎన్‌టీయూకేకే పరిమితం కాలేదు. విజయనగరం కళాశాలకు సైతం పాకింది. తాజాగా జేఎన్టీయూ విజయనగరం కళాశాలలో తమను ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఇద్దరు ప్రొఫెసర్లు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యుల్ క్యాస్ట్ (ఎన్సీఎస్సీ)ను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని క్లుప్తంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని గత ఎనిమిది మాసాలుగా వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఈ అంశంలో తమకు న్యాయం చేయకపోతే ఉద్యోగాల్లో కొనసాగడం కష్టమవుతుందని ఆవేదన చెందారు. ఈ విషయమై సైతం వీసీ, రిజిస్ట్రార్లు మరోసారి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట సాంకేతిక విశ్వ విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉన్నత పౌరులను తీర్చి దిద్దే ఇలాంటి దేవాలయంలో రాజకీయాలు, రాగద్వేషాలకు ఆస్కారం లేకుండా ఉం డాలి. కానీ కొందరు కీలక అధికారులు చేస్తున్న చేష్టలకు వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తుతుతోంది. ఇప్పటికే వీసీల నియామకం కోర్టులో ఉన్న విషయం తెలి సిందే. ఆ విషయం మరవకముందే వేధిం పుల పర్వం తెరపైకి రావడం దారుణం. -
బోధన వైద్యులకు ‘నిర్ణీతకాల పదోన్నతులు’
సాక్షి, హైదరాబాద్: ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. పైరవీలకు ఆస్కారం లేకుండా పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీతకాల వ్యవధిలో పదోన్నతులు లభించనున్నాయి. 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. సీఎం ఆమోదం అనంతరం తగిన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వద్దకు పంపిన ఫైలు ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక వారికి స్కేల్లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు. 3 వేలమంది వైద్యులకు ప్రయోజనం... ప్రస్తుతం పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైరై ఖాళీలు ఏర్పడ్డాకే పదోన్నతులు లభిస్తున్నాయి. దీనివల్ల ఖాళీలు కొన్నే ఉంటే కొందరికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. మరికొందరికి పదోన్నతులు లభించడంలేదు. దీంతో పదోన్నతులు అనేది ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం పైరవీలు జరుగుతుంటాయి. పైరవీల సందర్భంగా లక్షలకు లక్షలు సమర్పించుకోవాల్సిన సందర్భాలూ ఉన్నాయని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చినవారూ ఉన్నారు. మరికొందరికైతే 20 ఏళ్లకుగాని పదోన్నతి లభించే పరిస్థితి లేదు. ఇది వైద్యుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలు చేస్తున్నాయి. సీఎంకు పంపిన ఫైలు ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వెద్యులకు ప్రయోజనం కలుగనుందని సమాచారం. వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి కూడా వేతనాల్లోనూ మార్పులుంటాయి. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా మధ్య మధ్యలో స్కేల్స్‌లోనూ నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీతకాలంలో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు భౌతికంగా ఇతర పోస్టులకు మారుతారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. వీలైనంత త్వరగా సీఎం ఆమోదం వస్తుంద ని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
యవ్వనంలో అతిగా తాగితే మెదడుకు చేటు!
వాషింగ్టన్: యవ్వనంలో విపరీతంగా మద్యం తాగితే అది మెదడుపై శాశ్వత ప్రభావం చూపుతుందని, తద్వారా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అమెరికాలోని ఇలియన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మెదడు శాశ్వత మార్పుల వలన నాడీవ్యవస్థ దెబ్బతిని భావవ్యక్తీకరణ సమస్యలతోపాటు ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని వారు తెలిపారు. కౌమార దశలోనే అతిగా మద్యం తాగిన వారి మెదడులో శాశ్వత మార్పులు సంభవించడాన్ని గమనించామని భారత సంతతి శాస్త్రవేత్త, ఇలియన్స్ వర్సిటీ ప్రొఫెసర్ సుభాశ్ పాండే తెలిపారు. -
విశ్వపతి పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంస...
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత టి.వి.ఆర్.కే.మూర్తి ( విశ్వపతి ) రచించిన ‘శ్రీవారి దర్శన్’ పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంసలు లభిస్తున్నాయి. ‘శ్రీవారి దర్శన్’ వలన తమకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు. తమ విద్యార్థులకు ఈ విశేషాలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విశ్వపతిని ప్రశంసించారు. విశ్వపతిని ప్రశంసించిన వారిలో హార్వర్డ్ యునివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ క్లోని, కొలంబియా యునివర్సిటీకి చెందిన జాన్ స్ట్రాటన్ హాలే, యేల్ యూనివర్సిటీ అలెగ్జాండర్ కోస్కోకోవ్ , ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ మదన్ లాల్ గోయల్, కొలరాడో ప్రొఫెసర్ లోరిలియా బీరేసిం, ప్రొఫెసర్ బ్రియాన్ట్ ఎడ్విన్కి ఉన్నారు. రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నాం.. విశ్వపతి రచించిన శ్రీవారి దర్శన్ , అమృతపథం , సిన్సియర్లీ యువర్స్ పుస్తకాలను ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం వారి ప్రధాన లైబ్రరీ లోనూ , వారి ఆసియా కేంద్రం లైబ్రరీ లోనూ ఉంచుతున్నట్లు విశ్వవిద్యాలయ లైబ్రేరియన్ మిసెస్ లాండా నుంచి వర్తమానం వచ్చింది. గతంలోనూ విశ్వపతి పుస్తకాలు హార్వర్డ్ , కార్నెల్ ఆక్స్ఫర్డ్ , కేంబ్రిడ్జి , కొపెన్హెగ్లోని డెన్మార్క్ రాయల్ లైబ్రరీలోనూ ఉంచారు. విశ్వపతి శ్రీ వేంకటేశ్వర స్వామిపై రాసిన పుస్తకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్టూడెంట్స్ రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నారు. తాను రాసిన పుస్తకాలను ఇంతమందికి చేరడం ఆ శ్రీనివాసుని అనుగ్రహం గా భావిస్తున్నానని విశ్వపతి పేర్కొన్నారు. -
ప్రొఫెసర్లకు భరోసా కల్పించిన వైఎస్ జగన్
-
బోధనా వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు లభించనున్నాయి. అందుకు సంబంధించిన సీఏఎస్ ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం. తాజా నిర్ణయాల ప్రకారం బోధనాస్పత్రుల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆటోమేటిక్‌గా పదోన్నతి లభించనుంది. అలాగే ఆరేళ్లు సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేలులో మార్పు తీసుకొస్తారు. ఎన్నేళ్ల ఎదురుచూపులో! ప్రస్తుతం బోధనా వైద్యుల పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలామందికి నిరాశే మిగులుతుంది. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వస్తుండటంతో వైద్యుల్లో నిరాశ నెలకొంది. కొందరికైతే 20 ఏళ్లకు కూడా పదోన్నతి కల్పించిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితి మార్చాలని వైద్యులు ఎన్నేళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. సీఏఎస్ అమలైతే రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలుగుతుంది. వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి వేతనంలో మార్పులు చేస్తారు. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి వేతనంలో మార్పులు చేస్తారు. ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం సీఏఎస్ విధానానికి సీఎం ఆమోదం తెలపడంపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కేంద్ర విభాగం నేతలు డాక్టర్ నరహరి, డాక్టర్ ప్రవీణ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
శాతవాహన రిజిస్ట్రార్ ఎవరో..?
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీకి కొత్త రిజిస్ట్రార్ ఎవరు వస్తారనే చర్చ యూనివర్సిటీతోపాటు పరిధిలోని వివిధ కళాశాలల్లో ప్రారంభమైంది. ఈనెల 31తో ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఎం.కోమల్‌డ్డి ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్చార్జి పాలనలో కొనసాగుతున్న యూనివర్సిటీకి కీలకంగా రిజిస్ట్రార్ స్థానమే బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇన్చార్జి వీసీలు ఇక్కడ పెద్దగా సమయం కేటాయించకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. సమస్యలొస్తే పరిష్కరించడానికి రిజిస్ట్రార్ అందుబాటులో ఉండి పర్యవేక్షించారు. అలాంటి రిజిస్ట్రార్ పోస్టు ఇప్పుడు ఖాళీ అయితే ఎలా..? అనేది అందరి ఆలోచన. నాలుగేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించకుండానే ప్రభుత్వం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో రెగ్యులర్ రిజిస్ట్రార్ నియామకం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు పోస్టు ఖాళీ అయిన వెంటనే రిజిస్ట్రార్ పోస్టును భర్తీ చేయాలని విద్యారంగనిపుణులు, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు శాతవాహన యూనివర్సిటీకి కోమల్‌రెడ్డితోపాటు ఇప్పటివరకు నలుగరు బాధ్యతలు చేపట్టారు. వర్సిటీ ప్రారంభమయ్యాక మొద టి రిజిస్ట్రార్‌గా ఏ.వినాయక్‌రెడ్డి (28 ఆగస్టు 2008 నుంచి 27 ఆగస్టు 2009 వరకు), ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ (31 ఆగస్టు 2009 నుంచి 27మే 2012), ప్రొఫెసర్ బి.భద్రయ్య (28 మే 2012 నుంచి 27 మే 2014) తర్వాత 28 మే 2014 నుంచి ఎం.కోమల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనుండడంతో పోస్టు ఖాళీ కానుంది. యూనివర్సిటీలో కీలకమైనస్థానం ఖాళీ అవుతుండడంతో తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో నుండే వస్తారా..? వర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్లున్నారు. వీరిలో ఒకరు కోమల్‌రెడ్డి, ఇంకొకరు గతంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా పనిచేసిన టి.భరత్. అనుభవం ప్రకారం చూస్తే వర్సిటీలో మొదటి అవకాశం ఇతనికే ఉంటుందన్న చర్చ వర్సిటీవర్గాల్లో జరుగుతోంది. వివిధ యూనివర్సిటీ ల రిజిస్ట్రార్ల నియామకాలు పరిశీలిస్తే ఎవరినైనా పోస్టు వరించవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తుదకు రిజిస్ట్రార్ ఎవరనేది నిర్ణయించేది వీసీ చేతులో ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి వచ్చే అవకాశం ప్రస్తుతం యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా టి.చిరంజీవులు కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించాలనే ఆలోచనతో ఉంది. దీనికోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 10న ఉండగా.. అనుకోకుండా వాయిదాపడింది. త్వరలోనే వీసీ నియామకం కూడా చేపట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రార్‌ను నియమించాలంటే వీసీ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీసీతోపాటు రిజిస్ట్రార్‌ను కొత్తవారినే నియమించే అవకాశాలూ ఉన్నట్లు విద్యారంగ నిపుణుల్లో చర్చ సాగుతోంది. మొదట వీసీని నియమించి.. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ను నియమిస్తారా..? ప్రస్తుతం ఖాళీ అవనున్న రిజిస్ట్రార్ కుర్చీ భర్తీ చేసి ఆ తర్వాత వీసీని నియమిస్తారా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని విద్యారంగ నిపుణులు ఎదురుచూస్తున్నారు. -
‘గుర్తింపు’ తంటాలు
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య ప్రదాయిని రిమ్స్ మెడికల్ కళాశాలకు నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏజెన్సీ మరణాలు, ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)ను 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కాగా మొదటి నుంచి రిమ్స్ సిబ్బంది కొరతతో సతమతం అవుతుంది. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల మెడికోలు వైద్య శిక్షణను పూర్తి చేసుకొని బయటకు వెళ్లారు. గతేడాది సూపర్ స్పెషాలిటీ కోసం కూడా కేంద్రం కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తాజాగా రిమ్స్ వైద్య కళాశాలను రెన్యువల్ సమస్య వెంటాడుతోంది. జూన్ 5న ఎంసీఐ(భారతీయ వైద్య మండలి) బృందం తనిఖీ చేసిన విషయం విదితమే. బృందం నివేదిక ప్రకారం వైద్య కళాశాలకు గుర్తింపు రాలేదు. మరోసారి రిమ్స్‌ను ఆ బృందం ఈ నెలాఖరులో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆలోగా రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటే గుర్తింపును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే క్రమంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోధన సిబ్బంది కొరతే ప్రధాన కారణం రిమ్స్‌లో వైద్య సేవలను పక్కనబెడితే భావి వైద్యులైన మెడికోలకు నాణ్యమైన విద్య అందడం లేదనే చెప్పుకోవచ్చు. బోధనకు సంబంధించి 150 పోస్టులకు గాను 90 మంది బోధన సిబ్బంది పనిచేస్తుండగా, 60 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో మెడికోలకు సరైన రీతిలో బోధన సాగడం లేదని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల కోర్సు కాగా ఒక సంవత్సరం శిక్షణ వైద్యులుగా అనుభవంతో వైద్య వృత్తిలో కొనసాగనున్నారు. 16 ప్రొఫెసర్ పోస్టులు, 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 15 అసిస్టెంట్ ప్రొఫెసర్, 19 ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు కీలకమైన రిమ్స్ డైరెక్టర్ పోస్టు ఇన్‌చార్జీతోనే కొనసాగుతోంది. రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంటే డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచీ సమస్యల నడుమే వైద్య శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. 2008 సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు బోధన విషయమే ప్రధాన సమస్యగా ఉంది. ఎంసీఐ బృందం మొదటి నాలుగు సంవత్సరాలు తనిఖీలు చేసింది. పలుసార్లు కూడా రెన్యువల్ సమస్యనే ఉంది. ఎలాగో నెట్టుకుంటూ నాలుగు బ్యాచ్‌ల తర్వాత గుర్తింపు లభించింది. ఎంసీఐ బృందం తనిఖీ చేసే సమయంలో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను ఇక్కడ పనిచేస్తున్నట్లు చూపించి గట్టెక్కించారు. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండడంతో ప్రతిసారి సమస్యే ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం బోధిస్తున్న వారిలో కూడా రెగ్యులర్ లేకపోవడం గమనార్హం. ఈ కళాశాలలో సీటు సాధించిన విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో విద్యాబోధన జరగకపోవడంతో భవిష్యత్తులో చేసే వైద్య వృత్తిలో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా రిమ్స్‌కు వచ్చే రోగులకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. చిన్నపాటి వైద్య చికిత్సలు చేస్తూ మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం పరిపాటిగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత నాలుగైదు నెలల క్రితం జిల్లా అటవీ శాఖాధికారి గుండెపోటుతో రిమ్స్‌లో చేరగా, వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, సరైన వైద్యం అందకపోవడంతో తుదిశ్వాస వదిలారు. ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో జూనియర్ వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. దీంతో వారికి అనుభవం లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. అయోమయంలో మెడికోలు రిమ్స్ వైద్య కళాశాలకు గుర్తింపు వస్తుందో లేదోనని మెడికోలు అయోమయంలో పడ్డారు. ఇటీవల ఎంసీఐ బృందం పర్యటించినప్పుడు విద్యార్థులను బోధనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ రిమ్స్‌కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) గుర్తింపు నిరాకరిస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. వారి శిక్షణకు కూడా అడ్డంకులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే తమకు నాణ్యమైన విద్యతో పాటు కళాశాలకు గుర్తింపు లభిస్తుందని, రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం కోసం పాకులాట.. ప్రతిసారి ఎంసీఐ బృందం రిమ్స్‌ను తనిఖీ చేసినప్పుడు ఏవిధంగా గట్టెక్కిద్దామనే ఆలోచనే తప్పా సమస్యను పూర్తిగా ఎలా పరిష్కరిద్దామనేది అధికారులకు అంతుచిక్కడంలేదు. అద్దె వైద్యులు, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను బృందం తనిఖీ సమయంలో చూపించి చేదులు దులిపేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంసీఐ బృందం 10 శాతం ఖాళీలు ఉంటే రెన్యువల్ చేయడం నిరాకరించకుండా అనుమతులను జారీ చేస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్ పరిస్థితిని చూస్తే ప్రస్తుతం 18 శాతం ఖాళీగా ఉన్నాయి. రిమ్స్ మెడికల్ కళాశాలలో బోధించేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవనే ఆలోచనతోనే ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదని సమాచారం. వేతనాలు పెంచినా సరైన మౌళిక వసతులు కల్పించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పెరిగిన వేతనాలతోనైనా భర్తీకి నోచుకునేనా.. ఖాళీల కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రొఫెసర్ల వేతనాలను పెంచుతూ జీఓ నెం.482 ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బోధకుల నియామక ప్రక్రియ జరగనుంది. ఈసారైనా బోధకులు వస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఖాళీలు భర్తీ అయితే మెడికోలకు లబ్ధి చేకూరడంతోపాటు రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి. ఆందోళన అవసరం లేదు మెడికోలు రెన్యువల్‌కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత నెలలో పర్యటించిన ఎంసీఐ బృందం నివేదిక ఇంకా అందలేదు. ఆస్పత్రిలో అన్ని సేవలు అందుతున్నాయి. కళాశాలలో మాత్రమే సిబ్బంది కొరత ఉంది. అయినప్పటికీ మెడికోలకు బోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బోధన సిబ్బంది కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వేతనాలు కూడా గతంలో కంటే ఎక్కువగా పెంచింది. దీంతో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంసీఐ బృందం నివేదికలో లోటుపాట్లు ఉంటే వాటిని సవరించి అనుమతులు పొందేలా చర్యలు చేపడతాం. – అశోక్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ హోదా ప్రస్తుత వేతనం పెరిగిన వేతనం ప్రొఫెసర్ రూ.1లక్ష రూ.1.90 లక్షలు అసోసియేట్ ప్రొఫెసర్ రూ.90వేలు రూ.1.60 లక్షలు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.75వేలు రూ.1.20 లక్షలు ట్యూటర్ రూ.40వేలు రూ.53వేలు -
కొత్త సీసాలో పాత సారానా?
ఏ విశ్వవిద్యాలయమైనా రాజకీయ ఒత్తిడుల నుంచి బయటపడి స్వేచ్ఛగా, స్వయం ప్రతిపత్తితో మనుగడ సాగించినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగ లదు. ఒకప్పుడు భారతీయ చరిత్రలో పేరు మోసిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలుగా వెలుగొందాయంటే ఆర్థికంగా వాటికి కావలసిన నిధులను ఆ కాలంలోని రాజులు సమకూర్చడం, వాటి పరిపాలనా వ్యవహారాల్లో ఏనాడూ వారు వేలుపెట్టకపోవడమే. కానీ నేటి ఆధునిక విశ్వవిద్యాలయాలు పేరుకు స్వయం ప్రతిపత్తి కలవే గానీ ప్రతివిషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. అధ్యాపకుల నియామకాల దగ్గర్నుంచి, నిధుల కేటాయింపు వరకు అన్నిటిలోనూ అవినీతి, అక్రమాలకు తెరలేపుతూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు వీటిని అయినవారి ఆవాసులుగా మార్చుతున్నారు. ఇలాంటి దుష్పరిణామాలను అడ్డుకోవడానికే యూజీసీ వంటి స్వతంత్ర సంస్థలు వెలిశాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేసి కొత్తగా భారతీయ ఉన్నత విద్యా కమిషన్ అనే సంస్థను దాని స్థానంలో ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సంస్థ పేరు మార్చినంత మాత్రాన దాని అవలక్షణాలు చెరిగిపోవు. మన దేశంలో ఉన్నత విద్య కష్టాల బారినపడటానికి కారణం సరైన నియంత్రణా సంస్థలను రూపొందించకపోవడం కాదు. ప్రస్తుత సంస్థల ఆశ్రిత పక్షపాతంతోపాటు, పాలక మండలుల ఆలోచనాధోరణి కూడా కారణమే. ఏ ఉన్నత విద్యాసంస్థనైనా రాజకీయ ప్రయోజనాలకోసం పనిముట్టుగా వాడుకోవాలని చూసినప్పుడే దాని పతనం ప్రారంభం అవుతుందని యూజీసీ ఉదంతం చెబుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటికనుగుణంగా దాన్ని తోలుబొమ్మను చేసి ఆడించారు కాబట్టే యూజీసీ ఇప్పుడు పాలకులకు ఖాయిలా పడ్డ పరిశ్రమలా, నిర్వీర్యమైన వ్యవస్థలా కనిపిస్తోంది. అంతమాత్రాన యూజీసీని నిర్వహించిన పాత్రను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఇప్పుడు యూజీసీ స్థానంలో కొత్తగా హెచ్.ఇ.సి.ఐ. ఏర్పాటు కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. ఇప్పుడు యూజీసీ స్థానంలో హెచ్.ఇ.సి.ఐ.ని తీసుకురావటంలో కూడా ముఖ్యోద్దేశం విధులను నియంత్రణ నుండి వేరు చెయ్యటమే. అసలు నిజం.. వర్సిటీలపై ఆర్థిక ఆంక్షలు విధించటమే. హెచ్.ఇ.సి.ఐ.ని స్థాపించటానికి రూపొందిం చిన చట్టంలో, విద్యా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిలపటానికి, విద్యా బోధనలో నాణ్యతను తీసుకురావటానికి ఈ కొత్త నియంత్రణా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నా, నాణ్యత అనే దానికి నిర్వచనాన్ని మాత్రం ఇవ్వలేకపోతోంది. ఎన్ని రకాలైన ప్రమాణాలను నిర్వచించినా వాటికి నానార్థాలు చెబుతూ, వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకోవటం మన విద్యా సంస్థలకు అలవాటుగా మారింది. ప్రతి ప్రామాణికానికి నకిలీ ప్రామాణికాన్ని రూపొందించటం పరిపాటైంది. నిజానికి వాసిపరంగా విద్యా సంబంధమైన సామర్థ్యాన్ని అంచనా వెయ్యటం అంత సులభమేమీ కాదు. ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నా నాణ్యత మాత్రం వీసమెత్తు కూడా పెరగలేదు. ఇక్కడ విచిత్రం ఏమింటంటే.. వందలోపు జాతీయ ర్యాంకులు సాధించిన సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సహజంగానే దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్ఈటీలు, ఐఐ ఎమ్‌లు వందలోపు నిలబడతాయి. వీటికి ఇప్పటికే నిధులు ఇబ్బడిముబ్బడిగా అందుతున్నాయి. మళ్లీ వీటికే నిధుల వరద పారించటంలో ఆంతర్యమేమిటో ఏలినవారే చెప్పాలి. నిధులు లేక, సరైన మౌలిక వసతులు లేక, రాష్ట్ర ప్రభుత్వాల కనికరం లేక ర్యాంకుల్లో వెనుకబడిన రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఏ మాత్రం ఆర్థిక సహాయం లేక ఇంకా వెనుకబడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అంటూ ఇప్పటికే దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థలలో మొదటి 20 వాటిని ఎన్నుకుని వాటికి ఎటువంటి నిబంధనలు నియంత్రణలూ లేకుండా పూర్తి స్వేచ్ఛని చ్చారు. మిగతా వాటిని మాత్రం యూజీసీ ఉక్కు పిడికిళ్లలోనే నలగమని ఆదేశాలిచ్చారు. అదేమంటే వాటిలో ప్రమాణాలు దిగువ స్థాయిలో ఉన్నాయంటున్నారు. అసలు విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు దిగజారటానికి కారకులు రాజకీయ నాయకులు, విద్యా సంస్థల ఏలికలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలే. గ్రేడింగ్ విధానం ద్వారా పరిమిత స్వయంప్రతిపత్తి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ, మోడల్ పాఠ్యాంశ వృత్తి విద్యా కోర్సులు, ఐసీటీ వినియోగం వంటి ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాలని చూస్తున్న ఈ తరుణంలో వాటి ఫలితాలు రాకముందే, యూజీసీ స్థానంలో మరో కొత్త సంస్థ హెచ్ఇసీఐను తీసుకురావల్సిన అవసరం లేదు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులను ఓడించటానికి విద్యా సంస్థలను ఫణంగా పెట్టడం దిగజారుడుతనం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే ఈ జూద క్రీడలో క్షతగాత్రులుగా హైదరాబాద్, వారణాసి, ఢిల్లీ, పూణే, అలహాబాద్ తదితర విశ్వవిద్యాలయాలు మిగిలాయి. మరింతగా వీటిని ఫణంగా పెట్టడానికి హెచ్.ఇ.సి.ఐ.ని ఒక ఆయుధంగా తయారుచేస్తే అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం ఇంకొకటి ఉండదు. ప్రొ‘‘ ఇ. శ్రీనివాసరెడ్డి ,వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ మొబైల్ : 789361 11985 -
కొట్టుకున్న నిట్ ప్రొఫెసర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అధ్యాపకులు ఘర్షణకు దిగారు. విద్యార్థుల ఎదుటే హోదాలను మరిచి పరస్పరం చేయి చేసుకున్నారు. వసంతోత్సవ వేడుకల సాక్షిగా విద్యా ర్థుల మధ్య ఘర్షణ చెలరేగి కత్తులతో దాడులు చేసుకున్న ఘటన మరవక ముందే ఈ సారి అధ్యాపకులు దాడులు చేసుకోవడం సంచలనం రేపింది. పరీక్షల నిర్వహణ వద్ద పాఠాలు చెప్పే తీరుపై వాగ్వాదం చెలరేగి ఈ గొడవకు దారితీసింది. రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు వైవా పరీక్షలను మెకానికల్ ప్రొఫెసర్ సాయి శ్రీనాథ్ మంగళవారం నిర్వహిస్తున్నారు. ఈ వైవా టెస్ట్‌ను పరిశీలించేందుకు మెకానికల్ విభాగాధిపతి బంగారు బాబు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా వైవాకు హాజరైన విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వీటికి విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘ఇప్పటివరకు.. వీరికి నువ్వు ఏం నేర్పించావ్’అంటూ విద్యార్థుల ఎదుటæ శ్రీనాథ్‌ను బంగారుబాబు ప్రశ్నించాడు. దీనికి ప్రతిగా ‘విద్యార్ధులు సరిగానే సమాధానం ఇచ్చారు కదా’అని శ్రీనాథ్ సమాధానం ఇచ్చాడు. దీనిపై ఇరువురి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలి సింది. ఇద్దరు అధ్యాపకుల మధ్య జరుగుతున్న గొడవను చూసి అక్కడున్న పీహెచ్డీ స్కాలర్లు అవాక్కయ్యారు. కేసు.. కాంప్రమైజ్ విద్యార్థుల ఎదుటే పరస్పరం దాడులు చేసు కున్న బంగారుబాబు, సాయి శ్రీనాథ్‌లు అక్కడి నుంచే గొడవ జరిగిన విషయాన్ని కాజీపేట పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపారు. ఇంతలో విషయం బయటకు తెలియడంతో ఇతర అధ్యా పకులు అక్కడికి వచ్చారు. గొడవ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళితే నిట్ ప్రతిష్టకు మచ్చ అంటూ ఇద్దరు అధ్యాపకులకు సర్ది చెప్పారు. జరిగిన ఘటనపై నిట్‌లోనే అంతర్గత విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, నిట్‌లో మెకానిక్ హెడ్, ప్రొఫెసర్ గొడవపై తమకు సమాచారం అందించారు తప్ప.. ఫిర్యాదు చేయలేదని కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. ఇప్పుడూ అంతే.. తప్పులు దొర్లినప్పుడు అందుకు కారకులైన వారిపై క్రమశిక్షణ చర్యలు సకాలంలో తీసుకోవడంలో నిట్ యాజమాన్యం జాప్యం చేస్తుండటంతో ఒకటి వెనుక మరొకటి అన్నట్లుగా అవాంఛనీయ ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పలు అంశాల్లో విచారణ కమిటీలను వేసినా ఏ ఒక్కదాంట్లో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజా వివాదాన్ని సైతం ఇదే విధంగా తొక్కిపెడతారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులు కత్తిపోట్ల వ్యవహారం నిట్ ప్రతిష్టకు మచ్చగా మిగలగా.. తాజా ఘటన దానికి కొనసాగింపుగా ఉంది. -
కాళేశ్వరం అద్భుతం
రామగుండం/మంథని: నీళ్ల లొల్లి తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ, అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంపుహౌస్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రా జెక్టుకు ప్రపంచ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత మని, రివర్స్ పంపింగ్ ద్వారా 50 మీటర్ల లోతున్న నీటిని సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా ఉం దన్నారు. సోషియాలజీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టుల పనులు సాగుతుండడం అద్భుతమన్నారు. ఐఐటీ ఇంజినీర్ దొంగరి నిశాంత్ మాట్లాడుతూ రివర్స్‌లో నీటిని తీసుకెళ్లడమే అద్భుతమన్నారు. భూసేకరణ లేకుండానే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే ఆలోచన బాగుందన్నారు. ప్రొఫెసర్లు లింబాద్రి, సాయిలు మాట్లాడుతూ గోదావరిలో 140 కిలోమీటర్ల పొడవునా ఎల్లకాలం నీళ్లు ఉండేలా చూడడం ద్వారా ఎన్నో ఎకరా లు సాగులోకి వస్తాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డీన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవసరాల మేరకు అన్ని సమయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలుండడం దీని ప్రత్యేకత అని కొనియాడారు. ప్రొఫెసర్ చెన్న బసవయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుందని కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీ సోషల్ వర్కర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ డాక్టర్ సి.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు. వీరికి ఇరిగేషన్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండ విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘ప్రొఫెసర్ల’ బాధ్యత వర్సిటీలకే
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల బాధ్యత యూనివర్సిటీలకే అప్పగించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 1,550 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి సంబంధించి వేసిన కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో నియామకాలపై స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రూ.6.22 కోట్లతో నిర్మించిన పరీక్షల భవనానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.420 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.20 కోట్లు అంబేడ్కర్ యూనివర్సిటీకి ఇచ్చిందని గుర్తు చేశారు. వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనాలు పేంచేందుకు వీసీల కమిటీ ఆమోదం తెలిపిందని, త్వరలో పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కోర్టు తీర్పునకు లోబడే టీఆర్టీ ఎందరో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ను కోర్టు తీర్పునకు అనుగుణంగా చేపడతామని కడియం స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నామని, త్వరలో పది జిల్లాల ఆధారంగానే టీఆర్టీ నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే క్రమంలోనే 31 జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. -
ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ, స్టాఫర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న వేతనాల సవరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ సవరణతో ఉద్యోగుల వేతనాలు సగటును 15 శాతం మేర పెరుగనున్నాయి. గురుపూర్ణిమ(జూలై9) సందర్భంగా వీరికి గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను సిద్ధం చేసిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని కేబినెట్ ముందుకు తీసుకువస్తోంది. దీనిపై కేబినెట్ ఆమోదం తెలుపగానే, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన ఎనిమిది లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు 15 శాతం మేర వేతనాలు పెరుగనున్నాయని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలతో పాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్ల ఫ్యాకల్టీ, స్టాఫ్ లకు కూడా ఈ మేరకునే వేతనాలను పెంచనున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై మూడేళ్ల వరకు రూ.75వేల కోట్ల భారం పడనుందని వెల్లడైంది. ఈ విషయంపై పీఎంఓ సోమవారమే సమావేశం ఏర్పాటుచేసింది. చివరి సారిగా వీరి వేతనాలను 2006లో పెంచారు. సివిల్ సర్వెంట్ కంటే అధికంగా వీరి వేతనాలు అప్పట్లో పెంచారు. ఈ వేతనాల పెంపుతో రాష్ట్రప్రభుత్వానికి చెందిన కాలేజీలు, యూనివర్సిటీల 7.5-8లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన 30వేల మంది ఉద్యోగులకు, కేంద్రప్రభుత్వంతో నడిచే టెక్నికల్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన 30వేల మందికి ప్రయోజాలను చేకూరనున్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్ల వరకు ఈ వేతనాల పెంపు అమలు ఉంటుందని, 7వ వేతన సంఘ సిఫారసుల మేరకే వీరికి సగటున 15 శాతం ఇంక్రిమెంట్ చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే 20 శాతం వరకు పెంపు చేపట్టాలని యూజీసీ రిపోర్టు చేసింది. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో ‘వైవా’ దందా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో యథేచ్ఛగా ‘వైవా’ దందా నడుస్తోంది. అడిగినంత ఇవ్వకపోతే వైవా పరీక్షల్లో మార్కులు వెయ్యబోమని ప్రొఫెసర్లు బెదిరిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న తతంగం తాజాగా ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. మంగళవారం పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ జరిగాయి. పీడియాట్రిక్స్‌లో 40 మార్కులకు థియరీ, 30 మార్కులకు ప్రాక్టికల్స్, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్, 10 మార్కులకు వైవా జరుగుతుంది. జనరల్ సర్జరీలో 60 మార్కులకు థియరీ, 60 మార్కులకు ప్రాక్టికల్స్, మరో 60 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్, 20 మార్కులకు వైవా ఉంటుంది. వైవా మార్కులు మాత్రమే థియరీ మార్కులకు కలుపుతారు. దీంతో సాధారణంగా వైవాలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. వీరి అవసరాన్ని గమనించిన పలువురు ప్రొఫెసర్లు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. పీడియాట్రిక్స్‌లో 10కి 8 మార్కులేయాలంటే రూ. 3 వేలు, 9 మార్కులేయాలంటే రూ.4వేలు వసూలు చేశారు. జనరల్ సర్జరీలోనూ 20కి 16 మార్కుల నుంచి బేరాలు నడిచాయి. ఇందులోనూ రూ.4వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేశారు. ఈ పరిస్థితి ఒక్క రిమ్స్‌లోనే కాదు, అన్ని వైద్య కళాశాలల్లో ఉందని విద్యార్థులు వాపోయారు. కొందరికింకా ఆ జాడ్యం పోలేదు కాగా, దీనిపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్. సుబ్బారావు స్పందిస్తూ.. కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇంకా వసూళ్ల జాడ్యం పోలేదన్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆ ప్రొఫెసర్లను నరికి చంపుతాం
-
'ఆ ప్రొఫెసర్లను నరికి చంపుతాం'
-
ప్రొఫెసర్లచే రోడ్ల నాణ్యత తనిఖీలు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్), జేఎన్టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను కోరుతూ ఆయా విశ్వవిద్యాలయాలకు జీహెచ్ఎంసీ లేఖలు రాసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి నిర్ణయించారు. నగరంలో రూ. 50కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు బల్దియా నిర్ణయించగా ఇప్పటి వరకు రూ. 23కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లోగా మిగిలిన రోడ్ల టెండర్లు పూర్తి కానున్నాయి. నాణ్యత విషయంలో విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ప్రమేయంలేని ఇంజనీరింగ్ నిపుణులచే ఈ పనులను తనిఖీ చేయించాలని నిర్ణయించారు. ర్యాండమ్‌గా తనిఖీలు చేయించి, నాణ్యత ప్రమాణాలను పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పా టు పనులను పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారులపై కూ డా కఠిన చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. -
ఏపీలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఓకే
ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాలు పారద ర్శకంగా చేపడుతామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. -
వీసీలుగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు
తెలంగాణ యూనివర్సిటీకి సాంబయ్య అంబేద్కర్ ఓపెన్‌కు సీతారామారావు జిల్లా నుంచి వీసీలుగా నియామకమైన ముగ్గురు ప్రొఫెసర్లు కేయూ క్యాంపస్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కాకతీయ యూనివర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్‌హుస్సేన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ పి. సాంబయ్యను, హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సీతారామారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992లో కేయూలో సాంబయ్య నియామకం వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కాకతీయ యూనివర్సిటీలోనే పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1984లో హన్మ కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 1992లో కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు. అలాగే యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా, బీఓఎస్‌గా, కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌గా, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌గా పనిచేసి గత ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సాంబయ్య సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా కూడా మెదిలారు. ఈ క్రమంలో వీసీల నియామకాల్లో సామాజిక వర్గాల సమీకరణలో ఎస్సీ మాదిగ నుంచి ప్రభుత్వం సాంబయ్యకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయనను నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీతారామారావును వరించిన అవకాశం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సీతారామారావు నియామకమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపెల్లికి చెందిన సీతారామారావు హన్మకొండలోని గోపాలపురంలో స్థిరపడ్డారు. ఆయన కేయూలోనే ఎంఏ, ఎం ఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. 1978–1987లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1987–1995లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కేయూ లో పనిచేశారు. అనంతరం 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సీతారామారావు 2011లో కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ డైరెక్టర్‌గా, 2002లో ఎస్డీఎల్సీఈ జాయింట్ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా, కేయూ లైబ్రరీ ఇన్చార్జిగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతితోపాటు పలు పదవులు చేపట్టారు. దివంగత ప్రొఫెసర్లు కొత్తపెల్లి జయశంకర్, బియ్యాల జనార్ధన్‌రావు, బుర్ర రాములుతో కలిసి పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేయూ నుంచి కీలకపాత్ర పోషించారు. వీసీ నియామకం కోసం కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నంలో సీతారామారావు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మెుత్తంగా జిల్లా నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా బాధ్యతలు కట్టబెట్టారు. -
మెడికల్ ప్రొఫెసర్లకు 'హార్వర్డ్' శిక్షణ
హైదరాబాద్: ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వందమంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్శిటీ అయిన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాతన వైద్య చికిత్స పద్ధతులు వంటి వాటిపై గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో 100 మంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైద్య విద్యా సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. సుమారు 1900 ఎంబీబీఎస్ విద్యార్థులు, వెయ్యి మందివరకూ పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలల్లో ఇన్నొవేటివ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు, సీఎంఈ (కంటిన్యుటీ మెడికల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రాంలు నిర్వహించేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అంగీకరించింది. ఇందులో భాగంగానే ముందుగా వివిధ స్పెషాలిటీలకు చెందిన ప్రొఫెసర్లను ఎంపిక చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్నట్టు వైద్యవిద్యా వర్గాలు తెలిపాయి. -
ఆ ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోండి: ఏపీసీసీ
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ) ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం అన్యాయం, అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వ్యాఖ్యనించింది. ప్రొఫెసర్లు కేవై రత్నం, సదాగత్ సేన్ గుప్తాలపై యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఖండించింది. వీరిపై వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం బీజేపీ నియంతృత్వ ధోరణికి మరో ఉదాహరణ అని ఏపీసీసీ అధికార ప్రతినిధి జంగా గౌతమ్ అన్నారు. ఓ వైపు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలంటూనే మరో వైపు దళితులను అణివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. -
తుపాకులతో బెదిరిస్తూ తెలుగు ప్రొఫెసర్లతో పాఠాలు?
న్యూఢిల్లీ: ఇంట్లో ఆర్థిక సమస్యలు. మాతృదేశంలో ఉద్యోగాలు కరువు.. కళ్లముందు బోలెడు సమస్యలు వెరసి ఎలాగైనా ఓ ఉద్యోగం చేయాలనే తపన వారిని ప్రమాదభరిత ప్రాంతాల్లో సైతం ఉద్యోగాలకు వెళ్లేలా చేసింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండే లిబియాలో ఉద్యోగం వచ్చింది. సిర్తీ విశ్వవిద్యాలయంలో విధుల్లో చేరారు. సెలవుల్లో భాగంగా తిరుగు ప్రయాణం అయినవారిని దురదృష్టం వెంటాడింది. దాదాపు రెండు నెలలుగా వారి గురించి ఇసుమంత జాడకూడా తెలియకుండా పోయింది. ఇది లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ. బలరాం, గోపికృష్ణలు గత ఏడాది జూలై చివరి వారంలో భారత్ కు తిరిగి వచ్చేందుకు ట్యునిషియా ఎయిర్ పోర్టుకు వస్తుండగా వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి వారి జాడ కరువైంది. కానీ, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉగ్రవాదులు తమకు పాఠాలు చెప్పించుకుంటున్నారని తాజాగా తెలిసింది. వారి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా బెదిరింపులకు మాత్రమే దిగుతూ పాఠాలు చెప్పించుకుంటున్నారని, ఈ కృతజ్ఞతాభావంతోనైనా ఆ ఉగ్రవాదులు తమవారిని విడిచిపెడతారని ఆశిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వీరితోపాటు ఎంతోమందిని ఇలాగే ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాఠాలు చెప్పించుకుంటున్నారట. బలరాం భార్య శ్రీదేవీ ఈ విషయంపైనే ఓ మీడియాతో మాట్లాడుతూ 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమవారితో బలవంతంగా పాఠాలు చెప్పించుకుంటున్నారని నాకు మూడు నెలల కిందట భారత దౌత్య కార్యాలయం, స్థానికుల సమాచారం ద్వారా తెలిసింది. నేను ప్రతి రోజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పీఏకు ఫోన్ చేస్తున్నాను. వారు సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. దీంతో వారు క్షేమంగా తిరిగొస్తారన్న భరోసాతో ఉంటున్నాను. ఈ సమయంలో నా కుటుంబం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నా కొంత గుబులుగానే ఉంది' అని చెప్పింది. ఇక గోపి కృష్ణ సోదరుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. తమ సోదరుడిని సెప్టెంబర్ 2014లో చూశామని, ఫిబ్రవరి 29 తన పుట్టినరోజని ఆ నాటికైనా తాను వస్తాడని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన ఎస్ విజయ్ కుమార్, లక్ష్మీ కాంత్ రామకృష్ణ అనే ఇద్దరిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినా అనంతరం విడిచిపెట్టారు. -
ఉస్మానియాలో లైంగిక వేధింపులపై విచారణ
హైదరాబాద్ : హౌస్ సర్జన్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఉస్మానియా మెడికల్ కళాశాలలో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాబూరావు, శ్రీధర్‌లు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ నెల రోజుల క్రితం హౌస్ సర్జన్లు ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ ఫిర్యాదుదారులను విచారించింది. ఇద్దరు సభ్యుల ఈ బృందానికి డీఎంఈ రమణి నేతృత్వం వహించారు. -
'యువభేరి' ప్రొఫెసర్లపై కక్ష సాధింపు
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విద్యార్థులతో కలసి నినదించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతోంది. విశ్వవిద్యాలయం విద్యార్థులు విశాఖపట్నంలో నిర్వహించిన యువభేరీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లుగానే ఏయూ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. యువభేరీ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి(కంప్యూటర్ సైన్స్), అబ్బులు(సివిల్ ఇంజినీరింగ్)లకు ఏయూ రిజిస్ట్రార్ సోమవారం విశ్వవిద్యాలయ నిబంధనలు 3(బి) చాప్టర్ 4లోని సెక్షన్ 6 కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యువభేరీ సదస్సులో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సాయంత్రం పని వేళలు ముగిసిన తర్వాత ఆఫీసు సిబ్బంది నోటీసులతో ఆయా విభాగాలకు వెళ్లారు. అయితే ప్రసాదరెడ్డి సెలవులో ఉండగా, పనివేళలు ముగియడంతో అబ్బులు వెళ్లిపోయారు. దాంతో ఆయా విభాగాధిపతులకు ఇవ్వాల్సిన నోటీసుల కాపీలను అందించారు. విభజించి సాధిస్తున్న ప్రభుత్వం విభజించు పాలించు అన్న సూత్రం ప్రకారం ప్రభుత్వం ప్రొఫెసర్లను సాధిస్తోంది. ఏయూ విద్యార్థులు ఆహ్వానించడంతో ఐదుగురు ప్రొఫెసర్లు యువభేరీ సదస్సుకు హాజరయ్యారు. కానీ వారిలో పాండురంగారావు, శ్రీనివాసరావు, నారాయణ లను ఏయూ అధికారులు పిలిపించి బెదిరించినట్లు సమాచారం. వారికి ఎలాంటి నోటీసులు అందకుండానే స్వచ్ఛందంగా వివరణ ఇచ్చినట్లు అధికారులు కథ నడిపించారు. మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులపై కక్ష సాధింపునకు దిగారు. సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం రానున్నారు. ఆయన మెప్పు పొందేందుకే అంత హడావుడిగా పనివేళలు ముగిసిన తర్వాత నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చినట్లే: రిజిస్ట్రార్ ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులులకు నోటీసులు జారీ చేశాం. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో విభాగాధిపతులకు ఇవ్వాల్సిన నోటీసుల కాపీలు ఇచ్చాం. వారు ఇచ్చే వివరణను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. -
జీతగాళ్లు దొరకని తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీతగాళ్లు కావాలంటే దొరకని పరిస్థితి రావాలని పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆకాంక్షించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్య వంటి వాటిలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్య, ఉపాధి రంగాల్లో హామీలు- నిర్లక్ష్యం’ అంశంపై శనివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్యర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, భాగ్య నాయక్, రమేశ్ రెడ్డి, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, కె.నాగేశ్వర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చేశారు. కాషాయీకరణకు బీజేపీ కుట్ర: కంచె ఐలయ్య కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి పేదలకు విద్యను దూరం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. విద్యను కాషాయీకరణ చేసే దురాలోచనలో ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 వేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ప్రజలంతా ఇంగ్లిష్ విద్యను చదువుకుంటే కేసీఆర్‌కు, దొరలకు జీతగాళ్లు దొరకరనే భయం ఉంది. చరిత్రను వక్రీకరిస్తున్నారు: ప్రొ. భాగ్య నాయక్ చరిత్రను కేంద్రం వక్రీకరిస్తోంది. పుష్కరాలకోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం టీచర్లను నియమించలేకపోతోంది. నిర్బంధ విద్య అమలు చేయాలి: విశ్వేశ్వరరావు ప్రతీ వ్యక్తికి ఉచితంగా నిర్బంధ విద్యను అమలుచేయాలి. రాష్ట్రంలో విద్యావిధానం వల్ల పేదలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. 22 వేల పాఠశాలల్లో మంచినీటి సౌకర్యంలేదు.. 12వేల బడుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది. విద్య, ఉద్యోగాలపై శ్వేతపత్రం: కె.నాగేశ్వర్ విద్య, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలున్నా వాటిని భర్తీచేయడం లేదు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి. సమావేశంలో చేసిన తీర్మానాలు.. ⇒ కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి. ⇒ రీయింబర్సుమెంటు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. ⇒ జాతీయ విద్యావిధానాన్ని తీసుకురావాలి. ⇒ విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఆపాలి. -
'ఆ ప్రొఫెసర్లు క్షేమం: త్వరలోనే విడిపిస్తాం'
హైదరాబాద్: లిబియాలో ఉన్న తెలుగు ప్రొఫెసర్తు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అక్కడ దౌత్య కార్యాలయం లేదని.. త్వరలోనే వారిని విడిపిస్తామని ఆమె తెలిపారు. లిబియాలో ఉగ్రవాదులు ప్రొఫెసర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుంచి వారి విడుదలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నగరం అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ చిలివేరు బలరాం కిషన్, నాచారానికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను ఉగ్రవాదులు కిడ్నాప్ నకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే ఆరోజు నుంచి విడుదల కాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, వారు క్షేమంగానే ఉన్నారని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. -
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
-
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
రెండు రోజులైనా తెలియని ఆచూకీ సాక్షి, హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌నకు గురైన తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌ను శుక్రవారమే విడుదల చేశారు. అయితే బలరాం, గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబసభ్యులకు సమాచారం అందజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులకు విదేశాంగ శాఖ అధికారులు ధైర్యం చెప్పారు. కాగా, శనివారం నాచారంలోని గోపీకృష్ణ, అల్వాల్ సాయినగర్‌లోని కుటుంబసభ్యులు మీడియా సభ్యులను కలిసేందుకు ఇష్టపడలేదు. విడుదలకు కృషి చేస్తున్నాం: వెంకయ్య నాచారంలోని గోపీకృష్ణ కుటుంబసభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వారిని ఫోన్లో మాట్లాడించారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని, వారు క్షేమంగానే తిరిగొస్తారన్న నమ్మకముందని భరోసా ఇచ్చారు. కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి క్షేమంగా చేరుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. బలరాంకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కాని, లిబియాలోని సిర్త్‌యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి సమాచారం రావడం లేదని బలరాం కుటుంబసభ్యులు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తల ద్వారానే తమకు సమాచారం తెలుస్తోందని వాపోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక పోలీసులు బలరాం నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వారినీ కాపాడండి: సుష్మాకు దత్తన్న ఫోన్ సాక్షి, హైదరాబాద్: ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ చెరలో బందీలుగా ఉన్న తెలుగువారిని కాపాడాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఇప్పటికే ఇద్దరిని కాపాడిన తీరు అభినందనీయమని, మిగిలిన ఇద్దరినీ కాపాడాలని దత్తాత్రేయ శనివారం ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సుష్మ సానుకూలంగా స్పందించారని, బందీలుగా ఉన్నవారు క్షేమంగా విడుదల అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బలరాం, గోపీకృష్ణ విడుదలయ్యేలా చూడండి * కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ లిబియాలో కిడ్నాప్‌నకు గురైన రాష్ట్రానికి చెందిన బలరాం విడుదల విషయంలో చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖరాశారు. లిబియా కిడ్నాప్ ఉదంతంపై సీఎం కేసీఆర్, ఆయన కార్యాలయం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు సైతం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బలరాంతో పాటు ఏపీకి చెందిన గోపీకృష్ణ సైతం క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. -
ఉన్నత విద్యతోనే బంగారు తెలంగాణ
- వీసీలను, పాలక మండలి సభ్యులను నియమించాలి - ఓయూ ప్రొఫెసర్ల ధర్నాలో ప్రొ.కోదండరామ్ హైదరాబాద్: ఉన్నత విద్య అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజకీయ జేఏసీ చైర్మన్, ఓయూ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌ఎఫ్‌యూటీఏ) పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పాలనా భవనాల ఎదుట అధ్యాపకులు ధర్నా చేశారు. ఓయూ పాలనాభవనం ప్రవేశ ద్వారం ఎదుట ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇందులో ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో తెలంగాణ వెనుకబడి ఉందన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో ఉన్నత విద్యకు, పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. పర్యావరణ వేత్త ప్రొ.పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమానికి ఓయూలోనే బీజాలు పడ్డాయని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ముందుకు నడిపింది తొలుత వర్సిటీ అధ్యాపకులే అని అన్నారు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ (ఐపీఎస్‌ఏ) అఖిల భారత అధ్యక్షులు, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా వీసీలు లేకుండా మనుగడ సాగించడం ఓయూకే చెల్లిందని అన్నారు. ఎఫ్‌యూటీఏ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా ప్రధాన కార్యదర్శి ప్రొ.మనోహర్ మాట్లాడుతూ వర్సిటీలకు రెగ్యులర్ వైస్ చాన్స్లర్లను, పాలక మండలి సభ్యులను నియమించాలని, అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించాలని అధ్యాపకులు చేస్తున్న ఆందోళనను సీఎం కేసీఆర్ పట్టించుకోకుంటే ఆందోళనను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 24న సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఎపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.రవీంద్రనాథ్, ప్రొ.కృష్ణయ్య, ప్రొ.రాములు, ప్రొ.చెన్నకృష్ణారెడ్డి, ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొని ప్రసంగించారు. -
ప్రొఫెసర్ల తీరు మారేనా!
* వైద్య కళాశాలకు తరుచూ గైర్హాజరు * తీవ్రంగా పరిగణిస్తున్న కలెక్టర్ * నేడు వైద్యాధికారులతో సమీక్ష * సెలవులో వెళ్లిన ప్రిన్సిపల్ నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాల పనితీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యసేవలు మెరుగు పర్చేందుకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించనున్నారు. మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై నివేదికను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జిజియాబాయి రెండు రోజులపాటు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం నిర్వహించిన సమీక్షలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. సమీక్ష సమావేశానికి 12 మంది ప్రొఫెసర్లు గైర్హాజరు కావడాన్ని తీ వ్రంగా పరిగణించిన కలెక్టర్ తనను కలిసేంత వరకు విధులలో చేరవద్దని ఆదేశించారు. దీంతో గైర్హాజరయిన ప్రొఫెసర్లు కలెక్టర్ తీసుకునే చర్యల నుంచి తప్పించుకునే పనిలో పడ్డారు. యూనివర్సిటీ, డీఎంఈ కార్యాలయాలలో ప్రత్యేక పనులు ఉన్నందున కలెక్టర్ సమీక్షకు గైర్హాజరు అయినట్లు పత్రాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరి కొందరు అనారోగ్యం పేరిట మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని తెలిసింది. స్థానికంగా ఉండడానికి ఇష్టపడని కొందరు ప్రొఫెసర్లు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ వైద్య ఆరోగ్య శాఖలో 16 మంది వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, తరుచూ గైర్హాజరవుతున్నారని గత కలెక్టర్ ప్రద్యుమ్న వారి హెచ్ఆర్ఏను నిలిపి వేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ హెచ్ఆర్ఏ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఖంగుతిన్నారు. అయితే, అంతలోనే కలెక్టర్ బదిలీ కావడంతో ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. శాఖలోని ఓ అధికారి పర్సంటేజీల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తే హెచ్ఆర్ఏ విడుదల చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వైద్యులు ఒప్పుకోవడమే ఆలస్యం ఇన్చార్జి కలెక్టర్‌ను బురిడీ కొట్టించి హెచ్ ఆర్ఏ విడుదల చేయించుకున్నారు. వైద్యుల పని తీరు బాగోలేదని కలెక్టర్ హెచ్ఆర్ఏను నిలపి వేస్తే అధికారులు ఇన్చార్జి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి నిధులు మం జూరు చేయించుకోవడం గమనార్హం. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గోవింద్‌వాగ్మోరేను వివరణ కోరగా స్పందించలేదు. -
మౌనం వెనుక మర్మమేమిటో..!
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 128మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు కళాశాలకు వచ్చిన వీరిలో చాలామంది ఆ తరువాత మొహం చాటేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు వచ్చిన రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఏడాది కాలంగా వైద్యవిద్య బోధన, రోగులకు వైద్యసేవలు అందించడానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు రావడం లేదు. వాస్తవానికి ఇక్కడికి కేటాయించిన ప్రొఫెసర్లందరూ కళాశాలలోనే తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండాలి. అందుకు అనుగుణంగానే వారి కోసం అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులో సకాల సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. కానీ ఉండే వారు లేక అవి బోసిపోతున్నాయి. చాలామంది వైద్యులు జిల్లాకే రావడం లేదు. హైదరాబాద్‌కు చెందిన 32మంది ప్రొఫెసర్లు అక్కడే ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీసుల్లో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లను ఇక్కడికి కేటాయించగా వీరు రెండుసార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసర్‌ను ఇక్కడికి కేటాయించారు. ఆయన వైద్యవిద్యలో భాగమైన పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రసిద్ధి. ఈ సేవలను అందించేందుకు ఇక్కడికి కేటాయించగా ఇప్పటి వరకు ఆయన కళాశాల వైపు చూడలేదు. నలుగురు స్త్రీ వైద్యనిపుణులు ఇక్కడికి కేటాయించగా, వీరు రెండు నెలల పాటు వైద్యసేవలు అందించి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. ప్రస్తు తం ఆస్పత్రిలో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉం డాల్సింది, కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా ఉదయం ఒక గంట మాత్రమే ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల మౌనం మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చ ర్యలు తీసుకోవడంలో కళాశాల అధికారులు స్పందిం చడం లేదు. గతంలో వీరిపై చర్య తీసుకుంటే ఉన్నఫలంగా వెళ్లిపోతారని, దీంతో కళాశాలకు అనుమతికి ఇబ్బందులు వస్తాయని భావించారు. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి అనుమతి లభించింది. అయినా ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. విధులకు రాకుండా రిజిష్టరులో సంతకాలు లేకుండానే ప్రతి నెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఆయన వీరిపై కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవడం లేదు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై గత మార్చిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సుబ్రమణ్యం నివేదిక అందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కళాశాల అధికారులు సాహసించలేదు. ఇటీవల కొంతమంది ప్రొఫెసర్లు తమ యూనియన్ నాయకులను తీసుకవచ్చి ఎవరూ ఏమనకూడదన్నట్లుగా వైద్యాధికారులపై చిందులు వేయించారు. అప్పటి నుంచి ప్రొఫెసర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా త యారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన పెద్దాస్పత్రి, వైద్యకళాశాలలు సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
నీరజ్‌కు మద్దతుగా ఆప్ ఆందోళన
ముంబై: ప్రొఫెసర్ నీరజ్ హతేకర్ సస్పెన్షన్ వ్యవహరం ముంబై వర్సిటీలో మంటలు రేపుతోంది. నిజాయితీ గల నీరజ్‌ను విధులకు దూరంగా ఉంచుతూ వైస్ ఛాన్సలర్(వీసీ) రాజన్ వెలుకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం ఆందోళనకు దిగింది. దీనికి వర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి మద్దతు లభించింది. శాంతాక్రజ్‌లోని కలినా క్యాంపస్‌లో జరిగిన ఈ ఆందోళనలో ఆప్ నాయకుడు మయంక్ గాంధీ పాల్గొన్నారు. వర్సిటీ పరిపాలన వ్యవహరాల్లో జరుగుతున్న వివిధ సమస్యలపై నిలదీసినందుకే నీరజ్‌ను సస్పెండ్ చేశారని, ఇది అవినీతి అంశమేనని ఆయన ఆరోపించారు. ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా వీసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. పత్రికలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని వర్సిటీ నిర్వహణ మండలి సీరియస్‌గా తీసుకోవడాన్ని గాంధీ తప్పుబట్టారు. మంగళవారం నుంచి నీరజ్‌కు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సంతకాల సేకరణ చేసిన ఆర్థిక విభాగానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని అధికారులకు సమర్పించారు. తమకు మెరుగైన వసతులు కల్పించేందుకు పోరాడుతున్న నీరజ్‌పై చర్యలు తీసుకోవడాన్ని విద్యార్థులు ఖండించారు. అయితే నీరజ్‌ను సస్పెండ్ చేసే అధికారం తనకు ఉందని, ఇప్పటికే ఈ విషయంలో శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించానని వీసీ రాజన్ అంటున్నారు. అయితే తనను కావాలనే సస్పెండ్ చేశారని నీరాజ్ అంటున్నారు. గతేడాది డిసెంబర్ 12న మీడియా సమావేశం నిర్వహించిన నీరజ్, వీసీ తీరు బాగో లేదంటూ ఆరోపణలు చేశారు. విధుల్లో చేర్చుకోవాలి: ఆప్ ఇదిలావుండగా సస్పెండ్ చేసిన హతకరేను వెంటనే తిరిగి విధుల్లో చేర్చుకోవాలని రాష్ట్ర ఆప్ విభాగం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. అవసరమైతే విద్యార్థులు చేసే ఆందోళనల్లో తాము కూడా భాగస్వామ్యులం అవుతామని, అన్యాయం ఎక్కడా జరిగినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇదంతా చేసేది ప్రజల్లో క్రేజీ కోసం కాదని, అందరికీ న్యాయం కోసమేనని స్పష్టం చేసింది. తమ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు హతేకర్ ప్రయత్నించారని, అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారని చెప్పింది. వీసీని సస్పెండ్ చేసి, నీరజ్ చేసిన ఆరోపణలపై ఓ కమిటీని నియమించి విచారించాలని డిమాండ్ చేసింది. హైకోర్టును ఆశ్రయించిన నీరాజ్ హతేకర్ ముంబై వర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని మీడియాను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై సస్పెండ్‌కు గురైన ప్రొఫెసర్ నీరజ్ హతేకర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనను సస్పెండ్ చేసే అధికారం వైస్ ఛాన్సలర్‌కు లేదని, వర్సిటీ నిర్వాహక మండలికి ఉంటుందని అందులో వివరించారు. అలాగే తనపై చర్యలు తీసుకోవడానికి గల కారణమేంటనేది కూడా స్పష్టంగా పేర్కొనలేదన్నారు. సస్పెన్షన్ లేఖ విషయంలోనూ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని తెలిపారు. మీడియా సమావేశం నిర్వహించే 48 గంటల ముందు ప్రెస్‌నోట్ అందరి సభ్యులకు పంచానని అన్నారు. అయితే అందులో ఏమైనా తప్పిదం ఉంటే తనకు చెప్పి ఉంటే బాగుండేదని తెలిపారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తన సస్పెన్షన్ కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కళాశాలల నుంచి విద్యార్థుల వార్షిక ఫీజులు రాబట్టడం, కొందరికి అర్హత లేకున్నా ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, లెక్చరర్ హాల్లు పనికిరాకుండా ఉన్నాయని, పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతుందని, పీహెచ్డీ అడ్మిషన్లు కూడా నిబంధనల ప్రకారం నడవడం లేదని ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో నీరజ్ వర్సిటీ పాలన యంత్రాంగ లోపాలను ఎత్తిచూపిన సంగతి తెలిసిందే. -
మేం రాం..మా ఇష్టం
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్: మెడికల్ కళాశాలకు ఎంసీఐ అనుమ తి లభించాలంటే ప్రొఫెసర్లు, సిబ్బంది ని యామకమే కీలకం. ఈ నేపథ్యంలో డీఎంఈ గతేడాది జిల్లాలోని మెడికల్ కళాశాలకు 123 మంది ప్రొఫెసర్లను నియమించింది. గతేడాది మే 15, 16 తేదీల్లో ఎంసీఐ బృందం కళాశాలను సదర్శించింది. ఆ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు, సిబ్బంది కళాశాలలో ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులనుంచే ప్రొఫెసర్లు డుమ్మా కొట్టడం ప్రారంభించారు. ఏకంగా 90 మంది పత్తాలేకుండా పోయారు. దీంతో బోధించేవారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మంత్రి సుదర్శన్‌రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. దీంతో కొందరు ప్రొఫెసర్లు విధులకు హాజరవుతున్నారు. ఇంకా 48 మంది ప్రొఫెసర్లు అసలు కళాశాలకే రావడం లేదు. విధులకు డుమ్మా కొడుతున్నా వీరికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తుండడం గమనార్హం. బెదిరింపులు ఆస్పత్రికి రావాలని వైద్య విధాన పరిషత్ అధికారులు పలుమార్లు కోరినా ప్రొఫెసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రికి రాని ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని, వేతనాలు నిలిపివేయాలని అధికారులు భావించారు. అయితే వారు ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలిసింది. తమపై చర్యలు తీసుకుంటే ఆస్పత్రిలో ద్వితీయ సంవత్సరం కోర్సులకు అనుమతి రాకుండా చూస్తామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్లు లేకపోతే కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి అనుమతి ఇవ్వరని పేర్కొంటున్నట్లు సమాచారం. కాగా డుమ్మాకొడుతున్న ప్రొఫెసర్లకు ఓ అధికారి అండగా ఉంటున్నారని తెలుస్తోంది. వారి వద్దనుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వేతనాలు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ విధులకు హాజరుకాని 48 మంది ప్రొఫెసర్లు పూర్తిస్థాయి వేతనం పొందుతున్నట్లు సమాచారం. నామమాత్రంగా బోధన ప్రొఫెసర్లు డుమ్మా కొట్టడంతో మెడికల్ కళాశాల మెదటి బ్యాచ్‌కు నామమాత్రంగానే తరగతులు నిర్వహించారు. ప్రొఫెసర్లు లేకపోవడంతో థియరీతోపాటు ప్రాక్టిక ల్స్ కూడా నిర్వహించలేకపోయారు. దీంతో ఇంటర్నల్ పరీక్షలను సైతం తూతూమంత్రంగా నిర్వహించినట్లు తెలిసింది. ఆస్పత్రితో మెడికల్ కళాశాల పరిధిలోకి జిల్లా ఆస్పత్రిని మార్చకపోవడం ప్రొఫెసర్ల డుమ్మాకు కారణంగా కనిపిస్తోంది. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులం.. వైద్యవిధాన పరిషత్‌లో ఎలా పని చేస్తామంటూ వారు పేర్కొంటున్నట్లు తెలిసింది. తమకంటే తక్కువ అయిన విభాగం వారి వద్ద మేం పనిచేయలేం అని ప్రొఫెసర్లు పేర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం కళాశాలకు చెందిన 23 మంది వైద్యులు మాత్రమే ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. కాగా వైద్యకళాశాల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగింది. గతంలో రోజుకు 200లోపే వచ్చే ఔట్ పేషెంట్లు ఇప్పుడు 650 వరకు వస్తున్నారు. గతంలో 130 మందిలోపే ఇన్పేషెంట్లుగా ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 380 దాటింది. దీంతో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చర్యలు తప్పవు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. విధులకు హాజరు కావాలని ప్రొఫెసర్లందరినీ ఆదేశించాం. కళాశాలలో బోధనతోపాటు ఆస్పత్రిలో వీరి సేవలను వినియోగించుకుంటాం. ఎవరైనా రాకపోతే చర్యలు తీసుకుంటాం. -జిజియాబాయి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
మహానేతకు ఏయూ అద్యాపకుల, విద్యార్థుల నివాళులు