సాక్షి, కాకినాడ: సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో వేధింపుల పర్వం సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ అండతో ఉన్నతాధికారులు ప్రొఫెసర్లపై వేధింపులకు దిగారు. తమ మాట వింటే.. తాము చెప్పినట్టు నడుచుకుంటే ఓకే.. లేదంటే అనవసర ఆరోపణలు అంటగడుతూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ తంతు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై అత్యధికంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కొందరు ప్రొఫెసర్లు ఎన్‌సీఎస్టీ, ఎన్‌సీఎస్సీలను ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన కమిషన్ వీసీ డాక్టర్ రామలింగరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ వైవీ సుబ్బారావులకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఎన్‌సీఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం.
ఏం జరిగిందంటే..!
జేఎన్‌టీయూకేలో సివిల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ కోటేశ్వరరావును సదరు వీసీ, రిజిస్ట్రార్‌లు వేధించారన్న ఆరోపణ ఉంది. తాను చేయని తప్పులకు తనను బాధ్యుడి చేస్తూ.. అనవసర ఆరోపణలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించారని ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎన్‌సీఎస్టీ (నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్)కు తన గోడు వెళ్లబోసుకున్నారు. ప్రొఫెసర్ విన్నపాన్ని స్వీకరించిన కమిషన్ వేధింపులపై వివరణ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్‌లో దక్షిణ రాష్ట్రాల జాతీయ కమిషన్ మెంబర్ శ్రీమతి మాయ చింతమన్ గిన్వటే సమక్షంలో ఆరోపణలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్లపై కమిషన్ తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు వర్సిటీలో మంచివి కాదని, పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది.
గతంలోనూ ఇంతే..
గతంలో సైతం ఇలాంటి సంఘటనలు వర్సిటీలో అనేకం చోటు చేసుకున్నాయన్న విమర్శలున్నాయి. అప్పట్లో ముగ్గురు ప్రొఫెసర్లు కమిషన్‌ను ఆశ్రయించగా వీసీ, రిజిస్ట్రార్లకు మందలింపులు తప్పలేదు. అయినా పద్ధతిలో ఏ మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు అండగా ఉన్నారన్న ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్ప డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరో ఇద్దరు ప్రొఫెసర్లదీ అదే బాట..
వేధింపుల పర్వం కేవలం కాకినాడ జేఎన్‌టీయూకేకే పరిమితం కాలేదు. విజయనగరం కళాశాలకు సైతం పాకింది. తాజాగా జేఎన్‌టీయూ విజయనగరం కళాశాలలో తమను ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఇద్దరు ప్రొఫెసర్లు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యుల్ క్యాస్ట్ (ఎన్‌సీఎస్సీ)ను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని క్లుప్తంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని గత ఎనిమిది మాసాలుగా వీసీ, రిజిస్ట్రార్‌ల దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఈ అంశంలో తమకు న్యాయం చేయకపోతే ఉద్యోగాల్లో కొనసాగడం కష్టమవుతుందని ఆవేదన చెందారు. ఈ విషయమై సైతం వీసీ, రిజిస్ట్రార్‌లు మరోసారి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది.
దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట
సాంకేతిక విశ్వ విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉన్నత పౌరులను తీర్చి దిద్దే ఇలాంటి దేవాలయంలో రాజకీయాలు, రాగద్వేషాలకు ఆస్కారం లేకుండా ఉం డాలి. కానీ కొందరు కీలక అధికారులు చేస్తున్న చేష్టలకు వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తుతుతోంది. ఇప్పటికే వీసీల నియామకం కోర్టులో ఉన్న విషయం తెలి సిందే. ఆ విషయం మరవకముందే వేధిం పుల పర్వం తెరపైకి రావడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment