jntu Kakinada University
-
జేఎన్టీయూ ‘కే’క!.. ఏపీలో న్యాక్–ఏ ప్లస్ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్సిటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాంకేతిక విద్యలో కాకినాడ జేఎన్టీయూ రాష్ట్రానికే మణిహారంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న పలు వర్సిటీల సరసన జేఎన్టీయూకేకు సముచిత స్థానం దక్కింది. యూనివర్సిటీ ఏర్పాటైన 12 ఏళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు జేఎన్టీయూకేలో పర్యటించింది. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనం, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, సాంకేతిక అంశాల్లో ప్రగతిని సమీక్షించిన అనంతరం న్యాక్ ఏ ప్లస్ హోదా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఇవీ ప్రయోజనాలు ►న్యాక్ ఏ ప్లస్ హోదాతో యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ►కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. వర్సిటీలో ల్యాబ్‌ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, పరిశోధనల కోసం రూ.100 కోట్లు వస్తాయని అంచనా. ►ఈ వర్సిటీలో విద్యనభ్యసించేందుకు విదేశీ వర్సిటీల నుంచి విద్యార్థులు క్యూ కట్టనున్నారు. స్విట్జర్లాండ్, స్వీడన్ దేశాల యూనివర్సిటీలు ఇప్పటికే జేఎన్టీయుకేతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల ఒక అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం కూడా వచ్చి పరిశీలించి వెళ్లింది. ►ఇక్కడ చదువుకునే విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి. ►వర్సిటీలో పరిశోధనల కోసం కేంద్ర సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ, డీఎస్టీ సైన్స్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు లభిస్తాయి. వైఎస్సార్ చొరవతో యూనివర్సిటీగా.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా 1946లో కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1972లో కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోకి వచ్చాయి. ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలకు 2008, ఆగస్టు 20న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికతతో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని జేఎన్‌టీయూకేగా మార్పు చేశారు. కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని కూడా ఈ వర్సిటీతో అనుసంధానించారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 162 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసరావుపేట ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఉన్నాయి. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి యూనివర్సిటీకి ఒక మైలురాయి న్యాక్ 3.4 స్కోర్‌తో ఏ ప్లస్ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో విద్య, పరిశోధనలు, ఉపాధి నిమిత్తం ఒప్పందాలు పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు యూనివర్సిటీకి ఒక మైలు రాయి. ఇప్పటికే సాంకేతిక వర్సిటీగా రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉన్న జేఎన్టీయూకే స్థాయిని ఈ హోదా మరింత పెంచింది. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వైస్ చాన్సలర్, జేఎన్టీయూకే -
జేఎన్టీయూకేలో.. వేధింపుల పర్వం
సాక్షి, కాకినాడ: సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో వేధింపుల పర్వం సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ అండతో ఉన్నతాధికారులు ప్రొఫెసర్లపై వేధింపులకు దిగారు. తమ మాట వింటే.. తాము చెప్పినట్టు నడుచుకుంటే ఓకే.. లేదంటే అనవసర ఆరోపణలు అంటగడుతూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ తంతు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై అత్యధికంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కొందరు ప్రొఫెసర్లు ఎన్సీఎస్టీ, ఎన్‌సీఎస్సీలను ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన కమిషన్ వీసీ డాక్టర్ రామలింగరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ వైవీ సుబ్బారావులకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఎన్సీఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. ఏం జరిగిందంటే..! జేఎన్టీయూకేలో సివిల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ కోటేశ్వరరావును సదరు వీసీ, రిజిస్ట్రార్లు వేధించారన్న ఆరోపణ ఉంది. తాను చేయని తప్పులకు తనను బాధ్యుడి చేస్తూ.. అనవసర ఆరోపణలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించారని ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎన్సీఎస్టీ (నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్)కు తన గోడు వెళ్లబోసుకున్నారు. ప్రొఫెసర్ విన్నపాన్ని స్వీకరించిన కమిషన్ వేధింపులపై వివరణ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్‌లో దక్షిణ రాష్ట్రాల జాతీయ కమిషన్ మెంబర్ శ్రీమతి మాయ చింతమన్ గిన్వటే సమక్షంలో ఆరోపణలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్లపై కమిషన్ తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు వర్సిటీలో మంచివి కాదని, పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. గతంలోనూ ఇంతే.. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు వర్సిటీలో అనేకం చోటు చేసుకున్నాయన్న విమర్శలున్నాయి. అప్పట్లో ముగ్గురు ప్రొఫెసర్లు కమిషన్‌ను ఆశ్రయించగా వీసీ, రిజిస్ట్రార్లకు మందలింపులు తప్పలేదు. అయినా పద్ధతిలో ఏ మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు అండగా ఉన్నారన్న ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్ప డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు ప్రొఫెసర్లదీ అదే బాట.. వేధింపుల పర్వం కేవలం కాకినాడ జేఎన్‌టీయూకేకే పరిమితం కాలేదు. విజయనగరం కళాశాలకు సైతం పాకింది. తాజాగా జేఎన్టీయూ విజయనగరం కళాశాలలో తమను ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఇద్దరు ప్రొఫెసర్లు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యుల్ క్యాస్ట్ (ఎన్సీఎస్సీ)ను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని క్లుప్తంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని గత ఎనిమిది మాసాలుగా వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఈ అంశంలో తమకు న్యాయం చేయకపోతే ఉద్యోగాల్లో కొనసాగడం కష్టమవుతుందని ఆవేదన చెందారు. ఈ విషయమై సైతం వీసీ, రిజిస్ట్రార్లు మరోసారి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట సాంకేతిక విశ్వ విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉన్నత పౌరులను తీర్చి దిద్దే ఇలాంటి దేవాలయంలో రాజకీయాలు, రాగద్వేషాలకు ఆస్కారం లేకుండా ఉం డాలి. కానీ కొందరు కీలక అధికారులు చేస్తున్న చేష్టలకు వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తుతుతోంది. ఇప్పటికే వీసీల నియామకం కోర్టులో ఉన్న విషయం తెలి సిందే. ఆ విషయం మరవకముందే వేధిం పుల పర్వం తెరపైకి రావడం దారుణం. -
ఉన్నత విద్యకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు
మంచిర్యాల సిటీ : ఇంటర్ చదివాక డిగ్రీ. ఆ తర్వాత పీజీ చదవాలంటే ప్రవేశ పరీక్ష రాయాలి. ర్యాంకు రాకుంటే.. సీటు రాక ఏడాది వృథానే. అయితే ఇలాంటి కష్టాలేవీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరేవారికి ఉండవు. ఇంటర్ పూర్తయ్యాక ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరితే పీజీ అర్హత పరీక్ష ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కాలమూ కలిసొస్తుంది. ఏడాది ఖర్చులూ మిగులుతాయి. ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాతో రెండు కోర్సులు పూర్తి చేసుకొని యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. అంటే ఒక్కసారి చేరితే డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు రావడమే. ఇక వెతుక్కోవాల్సింది ఉద్యోగమే. కొత్తగా పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులుగా ఇంజినీరింగ్, ఎం.ఏ., ఎంబీఏ, ఎమ్మెస్సీ అందిస్తున్నాయి. ఇంటర్ విద్యార్హతతో డిగ్రీ, పీజీ కోర్సులను ఒకేచోట యూనివర్సిటీలు అందిస్తుండడంతో విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు ఆసక్తి చూపుతున్నారు. ఐఐటీ.. దేశంలోనే ఇంజినీరింగ్ పరిశోధనల్లో పేరున్న సంస్థ ఐఐటీ. ఎంతో విశిష్టత కలిగిన ఈ సంస్థ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తోంది. ఎన్నో కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌తోపాటు ఎం.టెక్ కోర్సు అందిస్తోంది. దీనిద్వారా విద్యార్థులకు ఒక ఏడాది కాలం కలిసివస్తుంది. ఇంటిగ్రేటెడ్‌లో సీఎస్ఈ, కెమికల్, బయోటెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తోంది. ‘యోగి వేమన’.. యోగి వేమన యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్‌లో ఐదేళ్ల కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ‘కాకతీయ’.. కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులున్నాయి. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీలో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ‘డీ మ్డ్’.. దేశంలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ విద్యార్థి ఇంజినీరింగ్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదవాలి. ఎంటెక్ కోర్సుకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ర్యాంకు రాని ఎడల ఒక సంవత్సర ం వృథా అవుతుంది. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలైన ఎస్ఆర్ఎం, విట్, విజ్ఞాన్, కేఎల్, హిందుస్థాన్, అన్నమలై ఇంటిగ్రేటెడ్ కోర్సుల వైపు మన విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. ‘నాగార్జున’.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తోంది. దీంతోపాటు ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సు ఆఫర్ చేస్తోంది. ఈ రెండు కోర్సులకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ‘ఉస్మానియా’.. ఉస్మానియా యూనివర్సిటీలో ఐదే ళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), ఎంఏ(ఎకనామిక్స్), ఎంబీఏ ఉన్నాయి. ఇంటర్లో సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ‘హైదరాబాద్ సెంట్రల్’.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఏ, లాంగ్వేజ్ కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. జేఎన్టీయూ (కాకినాడ) జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ.. ఇంజినీరింగ్ విభాగంలో ఐదేళ్ల కోర్సులను అందిస్తోంది. ఐదేళ్ల కాలంలో మూడున్నరేళ్లు యూనివర్సిటీలో, మిగిలిన ఏడాదిన్నర కాలం కోర్సు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విదేశీ యూనివర్సిటీలో విద్యార్థి చదవాల్సి ఉంటుంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసినవారికి బీటెక్‌తోపాటు ఎంటెక్ సర్టిఫికెట్ యూనివర్సిటీ అందజేస్తుంది. ఈఈఈ, సివిల్, ఈసీఈ, సీఎస్ఈ, ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.