ఉన్నత విద్యకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు | Integrated courses to higher education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు

Published Thu, Jul 3 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

Integrated courses to higher education

మంచిర్యాల సిటీ : ఇంటర్ చదివాక డిగ్రీ. ఆ తర్వాత పీజీ చదవాలంటే ప్రవేశ పరీక్ష రాయాలి. ర్యాంకు రాకుంటే.. సీటు రాక ఏడాది వృథానే. అయితే ఇలాంటి కష్టాలేవీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరేవారికి ఉండవు. ఇంటర్ పూర్తయ్యాక ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరితే పీజీ అర్హత పరీక్ష ఇబ్బంది ఉండదు.

 అంతేకాకుండా కాలమూ కలిసొస్తుంది. ఏడాది ఖర్చులూ మిగులుతాయి. ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాతో రెండు కోర్సులు పూర్తి చేసుకొని యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. అంటే ఒక్కసారి చేరితే డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు రావడమే. ఇక వెతుక్కోవాల్సింది ఉద్యోగమే. కొత్తగా పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులుగా ఇంజినీరింగ్, ఎం.ఏ., ఎంబీఏ, ఎమ్మెస్సీ అందిస్తున్నాయి. ఇంటర్ విద్యార్హతతో డిగ్రీ, పీజీ కోర్సులను ఒకేచోట యూనివర్సిటీలు అందిస్తుండడంతో విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు ఆసక్తి చూపుతున్నారు.
 
 ఐఐటీ..
 దేశంలోనే ఇంజినీరింగ్ పరిశోధనల్లో పేరున్న సంస్థ ఐఐటీ. ఎంతో విశిష్టత కలిగిన ఈ సంస్థ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తోంది. ఎన్నో కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌తోపాటు ఎం.టెక్ కోర్సు అందిస్తోంది. దీనిద్వారా విద్యార్థులకు ఒక ఏడాది కాలం కలిసివస్తుంది. ఇంటిగ్రేటెడ్‌లో సీఎస్‌ఈ, కెమికల్, బయోటెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తోంది.

 ‘యోగి వేమన’..
 యోగి వేమన యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్‌లో ఐదేళ్ల కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

 ‘కాకతీయ’..
 కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులున్నాయి.  ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీలో ఉత్తీర్ణులైనవారు అర్హులు.

 ‘డీ మ్డ్’..
 దేశంలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్  కోర్సులు అందిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ విద్యార్థి ఇంజినీరింగ్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదవాలి. ఎంటెక్ కోర్సుకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ర్యాంకు రాని ఎడల ఒక సంవత్సర ం వృథా అవుతుంది. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలైన ఎస్‌ఆర్‌ఎం, విట్, విజ్ఞాన్, కేఎల్, హిందుస్థాన్, అన్నమలై ఇంటిగ్రేటెడ్ కోర్సుల వైపు మన విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.

 ‘నాగార్జున’..
 గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తోంది. దీంతోపాటు ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సు ఆఫర్ చేస్తోంది. ఈ రెండు కోర్సులకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

 ‘ఉస్మానియా’..
 ఉస్మానియా యూనివర్సిటీలో ఐదే ళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), ఎంఏ(ఎకనామిక్స్), ఎంబీఏ ఉన్నాయి. ఇంటర్‌లో సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

 ‘హైదరాబాద్ సెంట్రల్’..
 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఏ, లాంగ్వేజ్ కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు.

 జేఎన్టీయూ (కాకినాడ)
 జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ.. ఇంజినీరింగ్ విభాగంలో ఐదేళ్ల కోర్సులను అందిస్తోంది. ఐదేళ్ల కాలంలో మూడున్నరేళ్లు యూనివర్సిటీలో, మిగిలిన ఏడాదిన్నర కాలం కోర్సు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విదేశీ యూనివర్సిటీలో విద్యార్థి చదవాల్సి ఉంటుంది.  ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసినవారికి బీటెక్‌తోపాటు ఎంటెక్ సర్టిఫికెట్ యూనివర్సిటీ అందజేస్తుంది. ఈఈఈ, సివిల్, ఈసీఈ, సీఎస్‌ఈ, ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement