
నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
రాస్తారోకో.. అరెస్టులతోఅట్టుడికిన వర్సిటీ క్యాంపస్
ప్రభుత్వ దిష్టిబొమ్మ, బడ్జెట్ ప్రతుల దహనాలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
ఎమ్మెల్సీ కోదండరామ్‌ను కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనికి పీహెచ్‌డీ స్కాలర్స్ వినతిపత్రం
నేడు ఓయూ బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఆందోళనలు.. రాస్తారోకోలు.. దిష్టి»ొమ్మ, బడ్జెట్ ప్రతుల దహనాలు.. సంతకాల సేకరణ.. విద్యార్థి నాయకుల అరెస్టులతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బుధవారం అట్టుడికింది. క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ జారీచేసిన సర్క్యులర్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, వైస్‌చాన్స్‌లర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
సర్క్యులర్‌ను వెనక్కు తీసుకునేలా వర్సిటీ యాజమాన్యాన్ని ఒప్పించాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్‌ను కలసి విద్యార్థి జేఏసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇదే డిమాండ్‌తో ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యారంగానికి బడ్జెట్‌లో తక్కువ శాతం నిధులు కేటాయించారని బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
ఓయూలో 2018లో ప్రవేశం పొందిన పీహెచ్‌డీ స్కాలర్స్‌కు మరో ఏడాదిపాటు గడువు పొడింగించేలా వీసీతో మాట్లాడాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం సమర్పింపంచారు. ఆందోళన చేపట్టిన 23 మంది విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ఓయూ, అంబర్‌పేట, లాలాగూడ పోలీసు స్టేషన్లకు తరలించినట్లు సీఐ రాజేందర్ తెలిపారు. కాగా, నిషేధాజ్ఞల సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి సంఘాలు గురువారం ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఐదు రోజులుగా వీసీ ఆఫీస్ గేటు మూసివేత
క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనతో వీసీ కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని గత ఐదు రోజులుగా మూసివేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో వివిధ పనులపై వీసీ, రిజి్రస్టార్, ఇతర అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
పట్టు వీడని విద్యార్థులు.. బెట్టు వీడని అధికారులు
ఓయూలో ఆందోళనలపై విధించిన నిషేధాజ్ఞలను వ్యతిరేకిస్తూ వర్సిటీ క్యాంపస్‌లో ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తుండగా, అధికారులు ససేమిరా అంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సాధారణ విద్యార్థులు కోరుతున్నారు. ఓయూలో జరుగుతున్న పరిణామాలపై వీసీ ప్రొ.కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment