‘ప్రైవేట్‌’ నోట.. ‘డీమ్డ్‌’ పాట! | Medical colleges moves to achieve autonomy | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’ నోట.. ‘డీమ్డ్‌’ పాట!

Published Mon, Mar 10 2025 5:47 AM | Last Updated on Mon, Mar 10 2025 5:47 AM

Medical colleges moves to achieve autonomy

స్వయం ప్రతిపత్తి సాధించాలని మెడికల్‌ కాలేజీల ఎత్తులు

ఇదే సరైన సమయమని యాజమాన్యాల భావన

ఇప్పటికే ఎన్‌ఓసీ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు 

డీమ్డ్‌ హోదాతో కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు పాతర

పేద, మధ్యతరగతి మెరిట్‌ విద్యార్థులఆశలకు గండికొట్టేలా ప్రైవేట్‌ వైద్య కళాశాలల ఎత్తులు

కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఇప్పటికే పెద్దసంఖ్యలో ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోయిన విద్యార్థులు 

సాక్షి, అమరావతి: ప్రతిభ ఆధారంగా నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్‌ పీజీ, ఎండీఎస్‌ సీట్లకు గండికొడుతూ ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్‌ (స్వయం ప్రతిపత్తి) బాట పట్టడానికి పోటీపడుతున్నాయి. ప్రైవేట్‌ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. 

గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్‌ వర్సిటీ హోదా పొందడానికి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ (ఎన్‌ఓసీ) మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తుల తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జీఎస్‌ఎల్, జెమ్స్, మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్‌ఓసీ కోరినట్లు తెలుస్తోంది. విశాఖలోని హోమి బాబా క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మెడికల్‌ పీజీ సీట్లున్నాయి. ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్‌ నుంచి బయటపడి, వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్‌ కింద పనిచేయడానికి ఎన్‌ఓసీ కోరింది.

ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజుల్లో వ్యత్యాసం ఇలా..
ప్రస్తుతం ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ఫీజులు 
కన్వీనర్‌ 16,500
బీ కేటగిరి 13,20,000

ప్రస్తుతం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మెడికల్‌ పీజీ ఫీజులు
కన్వీనర్‌4,96,800
బీ కేటగిరి 9,93,600

ఎన్‌ఓసీ ఇవ్వాలంటే చట్ట సవరణ చేయాల్సిందే
డీమ్డ్‌ బాట పట్టేందుకు కళాశాలలు పెట్టుకున్న ఎన్‌ఓసీ దరఖాస్తులపై సీఎం చంద్రబాబు స్థాయిలో కొద్ది రోజుల క్రితం చర్చలు నడిచినట్టు తెలిసింది. ఎన్‌ఓసీ ఇవ్వడానికి సా«ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్టం 1986లోని సెక్షన్‌6 ప్రకారం రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ఇతర యూనివర్సిటీల కింద పనిచేయడానికి వీల్లేదు. 

రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలన్నీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. ఎన్‌ఓసీ మంజూరు అంశంపై ప్రభుత్వం న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరగా.. ఏ ఒక్కరికి ఎన్‌ఓసీ ఇవ్వాలన్నా వర్సిటీ చట్టానికి సవరణ తప్పనిసరని సూచించినట్టు తెలిసింది. కాగా, 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేశ్‌ తోడల్లుడైన విశాఖ ఎంపీ భరత్‌ కుటుంబానికి చెందిన ‘గీతం’ సంస్థ డీమ్డ్‌ హోదా దక్కించుకుంది. 

అధికారం అండతో అడ్డదారుల్లో వైద్య కళాశాలలకు డీమ్డ్‌ హోదా సాధించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అదే తరహాలోనే ఇప్పుడు కూడా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దల అస్మదీయ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.

చెప్పిందే ఫీజు.. పెట్టిందే నిబంధన
రాష్ట్రంలోని గీతం మినహా మిగిలిన ప్రైవేట్‌ వైద్య కళాశాలలన్నీ హెల్త్‌ వర్సిటీ చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 50 శాతం ఎంబీబీఎస్‌ సీట్లు కన్వీనర్, 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. సీట్లన్నింటినీ ఆరోగ్య విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తోంది. మొత్తం సీట్లలో 50 శాతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తింపజేస్తున్నారు. 

అదేవిధంగా కన్వీనర్‌ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కళాశాలల్లో ఫీజులు ఉంటున్నాయి. అడ్మిషన్‌లతో పాటు, పరీక్షలను వర్సిటీయే నిర్వహిస్తోంది. అదే డీమ్డ్‌ హోదా వస్తే ఆయా కళాశాలలపై హెల్త్‌ వర్సిటీ అజమాయిషీ ఉండదు. వారు చెప్పిందే ఫీజు, పెట్టిందే నిబంధనగా మారిపోతుంది. 

ఎంబీబీఎస్, పీజీ సీట్లన్నీ యాజమాన్య కోటాగా మారిపోతాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలన్నింటినీ జాతీయ ర్యాంకుల ఆధారంగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, డీజీహెచ్‌ఎస్, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాయి. స్థానిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో మన విద్యార్థులు పెద్దఎత్తున సీట్లను నష్టపోతారు.  

మన విద్యార్థులకు తీరని నష్టం..
నిజానికి.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంతో డాక్టర్‌ కావాలన్న మన విద్యార్థుల కలలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కళాశాలల్లో ఐదింటిని 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్‌ సీట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమకూర్చింది. 

మిగిలిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న పక్కా వ్యూహంతో రెండు, మూడు దశల్లోని పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్‌ కళాశాలల నిర్మాణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వాస్తవానికి.. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతులిచ్చినా ప్రభుత్వం వద్దని లేఖ రాసి విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. 

ఇలా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు.. ప్రస్తుతమున్న ప్రైవేట్‌ వైద్య కళాశాలలు డీమ్డ్‌ హోదా సాధించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement