సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాంకేతిక విద్యలో కాకినాడ జేఎన్‌టీయూ రాష్ట్రానికే మణిహారంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న పలు వర్సిటీల సరసన జేఎన్‌టీయూకేకు సముచిత స్థానం దక్కింది. యూనివర్సిటీ ఏర్పాటైన 12 ఏళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.
బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు జేఎన్‌టీయూకేలో పర్యటించింది. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనం, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, సాంకేతిక అంశాల్లో ప్రగతిని సమీక్షించిన అనంతరం న్యాక్ ఏ ప్లస్ హోదా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది.
ఇవీ ప్రయోజనాలు
►న్యాక్ ఏ ప్లస్ హోదాతో యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది.
►కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. వర్సిటీలో ల్యాబ్‌ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, పరిశోధనల కోసం రూ.100 కోట్లు వస్తాయని అంచనా.
►ఈ వర్సిటీలో విద్యనభ్యసించేందుకు విదేశీ వర్సిటీల నుంచి విద్యార్థులు క్యూ కట్టనున్నారు. స్విట్జర్లాండ్, స్వీడన్ దేశాల యూనివర్సిటీలు ఇప్పటికే జేఎన్‌టీయుకేతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల ఒక అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం కూడా వచ్చి పరిశీలించి వెళ్లింది.
►ఇక్కడ చదువుకునే విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి.
►వర్సిటీలో పరిశోధనల కోసం కేంద్ర సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ, డీఎస్‌టీ సైన్స్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు లభిస్తాయి.
వైఎస్సార్ చొరవతో యూనివర్సిటీగా..
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా 1946లో కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1972లో కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలోకి వచ్చాయి. ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలకు 2008, ఆగస్టు 20న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికతతో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని జేఎన్‌టీయూకేగా మార్పు చేశారు. కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని కూడా ఈ వర్సిటీతో అనుసంధానించారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 162 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసరావుపేట ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఉన్నాయి.
చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
యూనివర్సిటీకి ఒక మైలురాయి
న్యాక్ 3.4 స్కోర్‌తో ఏ ప్లస్ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో విద్య, పరిశోధనలు, ఉపాధి నిమిత్తం ఒప్పందాలు పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు యూనివర్సిటీకి ఒక మైలు రాయి. ఇప్పటికే సాంకేతిక వర్సిటీగా రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉన్న జేఎన్‌టీయూకే స్థాయిని ఈ హోదా మరింత పెంచింది.
– డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వైస్ చాన్సలర్, జేఎన్‌టీయూకే
Comments
Please login to add a commentAdd a comment