ఏపీ ఎంసెట్‌ కోడ్‌ విడుదల | Andhra Pradesh EAMCET 2019 Code Released | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌ కోడ్‌ విడుదల

Published Sat, Apr 20 2019 8:58 AM | Last Updated on Sat, Apr 20 2019 9:05 AM

Andhra Pradesh EAMCET 2019 Code Released - Sakshi

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్‌–2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయరాజు ఈ ఉదయం పరీక్షాపత్రం కోడ్‌ విడుదల చేశారు. మార్నింగ్ సెషన్‌కు ఈజీ-02, రెండవ సెషన్‌కు ఈజీ-18 కోడ్‌ తీశారు. ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. 7 సెషన్లలో ఇంజనీరింగ్, 3 సెషన్లలో మెడికల్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 109, హైదరాబాద్‌లో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

హాల్‌టికెట్‌ వెనుక విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని రూట్‌ మ్యాప్‌ ద్వారా పొందుపర్చారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లో కేటాయించిన తేదీ, సమయము కంటే గంట ముందుగానే హాజరు కావాలి. నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ప్రతిరోజూ అదనపు బస్సులను ఏర్పాటుచేసి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884–2340535, 0884–2356255 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

అభ్యర్థులకు సూచనలు.. 
విద్యార్థికి హాల్‌టికెట్లో ఏ తేదీన ఏ స్లాట్‌ కేటాయించారో ఆ రోజునే పరీక్షకు హాజరు కావాలి. 
పరీక్షకు ముందు బయోమెట్రిక్‌ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్రను, ఫొటోను స్వీకరిస్తారు.  
విద్యార్థులు కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకురాకూడదు. అలాగే మెహందీ, గోరింటాకు, టాటూలు వేసుకోకూడదు.  
పరీక్షా కేంద్రంలోకి ఎంసెట్‌ హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్‌ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి, ఇంటర్మీడియట్‌ హాల్‌ టికెట్, పెన్నులు, ప్రిన్సిపాల్‌ లేదా గెజిటెడ్‌ అధికారిచే అటెస్టేషన్తో కూడిన ఆన్‌లైన్‌ ధరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే) వంటివి మాత్రమే లోపలకు అనుమతిస్తారు.  
‘విద్యార్థి తనకు కేటాయించిన కంప్యూటర్‌ ముందునే కూర్చోవాలి. ఆ కంప్యూటర్లో విద్యార్థి పేరు, ఫొటో, యూజర్‌ నేమ్‌ (హాల్‌టికెట్‌ నంబర్‌) కనిపిస్తాయి.  
విద్యార్థి పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇవ్వబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తారు.  
పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందు మాత్రమే పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. విద్యార్థి రఫ్‌ వర్క్‌ చేసుకోవడానికి తెల్ల కాగితాలను సిబ్బంది ఇస్తారు. పరీక్ష అనంతరం వీటిని పరీక్షా హాల్‌లోనే తిరిగి ఇచ్చివేయాలి.  
ప్రశ్నలు, ఆప్షన్లను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలలో ఉంటాయి. 
 
23న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ 
ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ’కీ’ ని ఈ నెల 23న, అగ్రికల్చర్, మెడికల్‌ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ’కీ’ని ఈ నెల 24న ఎంసెట్‌ వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. ‘కీ’ పై ఏమైనా సందేహాలుంటే ఇంజనీరింగ్‌కు సంబంధించి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5గంటలలోగా, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 27వ తేదీ సాయంత్రం 5గంటలలోగా నిర్దేశించిన ఫార్మాట్లో ఎంసెట్‌ వెబ్‌సైట్లో పేర్కొన్న మొయిల్‌ ఐడీకి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఫలితాలను మే రెండవ వారంలో విడుదల చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement