విదేశీ వర్సిటీల్లో కోర్సులపై సమావేశమైన జేఎన్‌టీయూకే ప్రతినిధులు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాలర్ల డ్రీమ్ ఇప్పటి యువత కల. అందుకోసం విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలని యువత భావిస్తోంది. ఈ కలను సాకారం చేసుకోవాలంటే.. పొరుగు దేశం వెళ్లి ఏ కోర్సు చేయాలన్నా ఆ దేశం నుంచి వీసా పొందటం, విదేశీ యూనివర్సిటీలలో సీటు పొందడం ఇలా ఎన్నింటినో దాటాలి.
ఇలాంటి వ్యయప్రయాసలకు చెక్ పెట్టి విదేశాల్లో ఎంఎస్ చేయాలన్న కలను సాకారం చేస్తోంది కాకినాడలోని జేఎన్‌టీయూ. ఇప్పటికే స్వీడన్‌లో బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ, యూఎస్‌లో నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని పలు కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ, ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది.
45 దేశాల యూనివర్సిటీలతో..
ఇటీవల నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ హోదాను సాధించిన జేఎన్‌టీయూకే (కాకినాడ) విదేశీ విద్య కోసం 45 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో సేవలందించిన డాక్టర్ షేక్ సులేమాన్, విదేశీ సేవల కోసం ఫారిన్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శివనాగరాజును నియమించుకుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వీసా నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వరకు అంతా జేఎన్‌టీయూకే చూసుకుంటోంది.
జేఎన్‌టీయూకే అందిస్తున్న కోర్సులు
స్వీడన్ బ్లేకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ విభాగాల్లో 20 సీట్ల చొప్పున 60 సీట్లతో జేఎన్‌టీయూకే ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సు వ్యవధి నాలుగు లేదా ఆరు సంవత్సరాలు. నాలుగు సంవత్సరాల కోర్సులో చేరితే మూడేళ్లు జేఎన్‌టీయూ (కాకినాడ)లోను, ఒక ఏడాది స్వీడన్‌లో అభ్యసిస్తే డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది. అదే మూడేళ్లు ఇక్కడ మరో మూడేళ్లు స్వీడన్‌లో అభ్యసిస్తే డ్యూయల్ డిగ్రీ అంటే ఎంఎస్ అర్హత గల సర్టిఫికెట్ అందజేస్తారు.
ఫీజు జేఎన్‌టీయూకేలో ఏడాదికి రూ.1.50 లక్షలు, స్వీడన్‌లో ఏడాదికి సుమారు రూ.7 లక్షలు వరకు చెల్లించాలి. యూఎస్‌లోని నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో నాలుగు సంవత్సరాల కోర్సుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సును మూడేళ్లపాటు జేఎన్టీయూకేలోను, ఒక ఏడాది యూఎస్‌లోను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది.
జర్మనీలో స్టెబిన్సీ యూనివర్సిటీలో ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ మాస్టర్ ప్రోగ్రాం రెండేళ్ల కాల వ్యవధితో అందించేందుకు జేఎన్‌టీయూకే ఒప్పందం చేసుకుంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. స్టెబిన్సీ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతతో సీటు సాధిస్తే ఉచిత విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
ప్రవేశాలు ఇలా..
ఈఏపీ సెట్ లేదా జేఈఈ, టీఎస్ ఎంసెట్‌లో అర్హత సాధించాలి. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ ఉత్తీర్ణులై కనీసం 60 శాతం మార్కులు పొందాలి. వివరాలకు జేఎన్‌టీయూకే ఫారిన్ వర్సిటీ రిలేషన్స్ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
విదేశీ ఒప్పందాలకు ప్రణాళిక
ఇప్పటికే అందిస్తున్న కోర్సులకు స్పందన బాగుంది. ఇటీవల న్యాక్ ఏ ప్లస్ హోదా రావడంతో 45 దేశాల్లో పేరొందిన యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జేఎన్‌టీయూకేలో మూడేళ్లు అభ్యసించి నాలుగో ఏడాది విదేశీ కోర్సు చదవచ్చు. ఒప్పందం ప్రకారం విదేశీ యూనివర్సిటీలే మన విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తాయి.
– జీవీఆర్ ప్రసాదరాజు, వీసీ, జేఎన్‌టీయూకే
Comments
Please login to add a commentAdd a comment