ప్రసంగిస్తున్న ఎంపీ నందిగం సురేశ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజల సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మేలును ప్రతిబింబిస్తూ శనివారం పెద్దాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన ప్రభంజనమే అయ్యింది.
పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సెంటర్ వరకూ సాగింది. బస్సు యాత్ర ముందు భారీ బైక్ ర్యాలీలో యువత కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్ రాజు
శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. దళితుడినైన తానే జగనన్న ప్రభుత్వంలో రాజకీయ సమానత్వనికి చిహ్నమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 17 మందిని మంత్రులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని అన్నారు. రాజకీయ, సామాజిక, ధన ప్రభావాలు చూడకుండా బడుగులకు పెద్ద పదవులు ఇచ్చిన నేత జగన్ ఒక్కరేనని చెప్పారు.
సీఎం జగన్ పాలనలో అన్నింటా బడుగులకు అగ్రస్థానం: ఎంపీ సురేష్
సీఎం వైఎస్ జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సంక్షేమ పథకాల్లో, రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పేదలు మరింతగా బాగు పడాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని, అందు కోసం ఆయనకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.
ప్రేమ, దయ కలిస్తే జగనన్న: జూపూడి
ప్రేమ, దయ కలిస్తే సీఎం వైఎస్ జగనన్న అని, ఆయన సమానత్వం చూపించే వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అందుకే నేడు సామాజిక సాధికార యాత్ర చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి సీఎం వైఎస్ జగన్ పరిపాలనే కారణమని చెప్పారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రుణమాఫీ, పింఛన్లు వంటి కార్యక్రమాలతో సంక్షేమాన్ని ప్రతి గుమ్మం వద్దకు చేర్చారని తెలిపారు.
ప్రజలందరూ బాగుండాలనే తపనతో పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తూ విద్య, వైద్య రంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పేదవారిని గౌరవించి, పథకాలను వారి ఇంటి వద్దకే పంపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అయ్యరక కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఆవాల రాజేశ్వరి, పెద్దాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment