
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్:‘ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేశాను. నేను చాలా నీతిమంతుడిని. నాకన్నా గొప్ప నాయకుడు ఎవరూ లేరని తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుని సొంత మీడియా బలంతో పేట్రేగిపోతున్న చంద్రబాబు పాపం పండింది. అయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేరు. చట్టాలు చంద్రబాబు చుట్టాలు కాదని చంద్రబాబు అరెస్ట్‌తో రుజువైంది’ అని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నాటి పరిణామాలను చూసినప్పుడు 2014–19 మధ్య ఎంత దుర్మార్గమైన అవినీతి జరిగిందో, చంద్రబాబు తన సొంత మనుషులకు ఏ విధంగా దోచుపెట్టారో అర్థమైందన్నారు. గాలిలో విభూది సృష్టించినట్టు స్కిల్ స్కామ్‌లో రూ.371 కోట్లు లాగేశారన్నారు. 15 రోజులుగా చంద్రబాబు, లోకేశ్ కలిసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వాడుతున్న భాషను చూస్తే ఎంతగా ఫ్రస్టేషన్‌లో ఉన్నారో అర్థమయ్యిందన్నారు.
ఢిల్లీ లూథ్రాను రప్పించి.. పవన్ సీన్ క్రియేట్ చేసినా..
‘నన్ను ఎవరూ ఏమీ పీకలేరు. మీ నాన్నే ఏమీ చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావ్’ అని సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారని కన్నబాబు గుర్తు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రా అనే లాయర్‌ను తీసుకొచ్చి సినిమా తరహాలో సీన్ క్రియేట్ చేశారన్నారు.
ఆయన సరిపోలేదని మరో సినీ వకీల్ సాబ్ వచ్చి రోడ్డుపై పడుకున్నారన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌తో పాటు రాజధానిలో భవన నిర్మాణాల పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు తినేశారన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ.118 కోట్లు లాగేసిన కేసుతోపాటు ఈఎస్‌ఐ కుంభకోణం ద్వారా రూ.150 కోట్లతో మందుకు బదులుగా కొబ్బరి నూనెలు, ఫేస్ క్రీమ్‌లు కొన్నారన్నారు. ఫైబర్ గ్రిడ్, పండుగలకు చంద్రన్న కానుక పేరిట బెల్లం స్కామ్, హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు పేరిట భారీ స్కామ్‌లు చేశారన్నారు.
ఉపాధి హామీ కూలీలకు వేసవిలో మజ్జగ సరఫరా పేరిట హెరిటేజ్ సంస్థకు నిధులు మళ్లించారన్నారు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా అవినీతి పారిందని, అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లోమీడియా చంద్రబాబు అన్నాహజరే అన్నట్టుగా.. దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరిగా రాశాయన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయనతో ఫెవికాల్ బంధం ఉన్న పవన్ కల్యాణ్ ఎంత బాధపడ్డారో రోడ్డుపై పడుకోవడంతో తెలిసిందన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడంతో ఆయన అరెస్ట్‌ను ఆక్రమం అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని మోడల్‌గా పాలిస్తుంటే ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment