సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం.
బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు
రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది.
వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు
రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు.
మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ
సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా
పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.
బత్తులపై బాబు ఆగ్రహం
చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment