Kakinada Assembly Constituencies
-
ఆ సీటు టీడీపీకా.. జనసేనకా?
ఏపీలో కలిసి పోటీచేస్తామని ప్రకటించుకున్న టీడీపీ, జనసేన మధ్య అప్పుడే వివాదాలు, తగాదాలు మొదలయ్యాయి. రెండు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేస్తాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాని ఇరు పార్టీల నాయకుల మధ్య రచ్చ అయితే స్టార్ట్ అయింది. అనేక జిల్లాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు అభ్యర్ధులే కనిపించడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారే పోటీలో ఉన్నామంటూ ప్రకటనలు చేసుకుంటున్నారు. టిక్కెట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సైకిల్, గ్లాస్ పార్టీల టిక్కెట్ల లొల్లి ఏ రేంజ్లో ఉందో చూద్దాం. రానున్న ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య టిక్కెట్లు ప్రకటించకముందే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాలలో తెలుగుదేశం, జనసేన నేతలు టిక్కెట్లు తమకే ఇస్తున్నారంటూ చేసుకుంటున్న ప్రచారం ఆయా రెండు పార్టీల మధ్య కుంపట్లు రగులుతున్నాయి. విశాఖ నుంచి కృష్ణా వరకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఈ రచ్చ మరీ ఎక్కువైంది. విశాఖ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించుకోగా...ఇదే స్ధానంపై ఆశలు పెట్టుకుని వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్కి ఇపుడు టిక్కెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్ధితి ఏర్పడింది. విశాఖ తూర్పులో కాకపోయినా భీమిలి నుంచైనా వస్తుందనుకుంటే..అక్కడ టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగుతున్నట్లు తన అనుచరులకి చెప్పారంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం లేదా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారట. కానీ అక్కడ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవడంతో భీమిలి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్సీ వంశీ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అలాగే పెందుర్తి సీటు విషయంలోనూ రెండు పార్టీల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరాయి. పెందుర్తి సీటు తనదేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చెప్పుకుంటుండగా... పెందుర్తి హామీపైనే జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు సైతం టిక్కెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు. ఇద్దరి మధ్య టిక్కెట్ వార్ రోజురోజుకి పెరుగుతోంది. ఇక గాజువాకలోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీను గాజువాక సీటు తనదేనని ప్రచారం చేసుకుంటుండగా...జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కోన తాతారావు సైతం తాను పోటీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పాయకరావుపేటలో అయితే రెండు పార్టీల మధ్య యుద్దమే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాయకరావుపేట టీడీపీ సీటు తనదేనని చెప్పుకుంటుండగా...అనితకి సీటు ఇస్తే తామెవ్వరమూ మద్దతివ్వబోమని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. జనసేనకే పాయకరావుపేట సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికి అనకాపల్లి టిక్కెట్ ఆశిస్తూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ ల పరిస్ధితి కూడా ఇలాగే ఉంది. అనకాపల్లి టిక్కెట్ కన్ ఫర్మ్ అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయన రాజకీయ శత్రువు కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కొణతాలకి అనకాపల్లి టిక్కెట్ ఇస్తామని చెప్పిన తర్వాతే ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారంటున్నారు. ఈ సీటు జనసేనకి కేటాయిస్తే టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఏం చేస్తారనే చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఇపుడు ఈ అనకాపల్లి సీటు టీడీపీకా.. జనసేనకా అన్న మీమాంసలో అధినేతలు ఉన్నారట. కాకినాడ సీటుపై జనసేన నేత ముత్తా శశిధర్ గట్టిగానే పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకి హామీ ఇచ్చారని...కాకినాడ సీటు తనదేనని ముత్తా శశిధర్ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా కాకినాడ సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. ఇక పిఠాపురం సీటు తనదేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించుకుంటుండగా...ఆ సీటు కోసం జనసేన తరపున టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ సీటు కోసం కూడా టీడీపీ-జనసేన మధ్య బహిరంగంగానే మాటల యుద్దం నడుస్తోంది. ఇక్కడ నుంచి మరోసారి పోటీకోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్దపడుతుండగా ..జనసేన నుంచి పోటీకి కందుల దుర్గేష్ ప్రయత్నిస్తున్నారు. కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పట్టుబడుతున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నుంచి టీడీపీ తరపున మరోసారి పోటీకి మాజీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప చూస్తుండగా...ఇదే సీటు కోసం జనసేన నేత తుమ్ముల రామస్వామి అలియాస్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సీటు కోసం టీడీపీ, జనసేనల మధ్య వార్ కొనసాగుతోంది... ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నట్లుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్తుండగా... జనసేన తరపున ఇదే టిక్కెట్ ను బొంతు రాజేశ్వరరావు ఆశిస్తున్నారు. ఇక ముమ్మిడివరంలో దాట్ల బుచ్చిబాబు టీడీపీ టిక్కెట్ రేసులో ఉంటే జనసేన తరపున పితాని బాలకృష్ణ ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో అయితే సీటు కోసం అన్నదమ్ములే సవాళ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టిక్కెట్ రేసులో ఉంటే ఆయన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ జనసేన టిక్కెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇద్దరూ ఆయా పార్టీల తరపున పోటీ చేశారు. సోదరులిద్దరి మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరుకోవడంతో ఇపుడు టిక్కెట్ ఏ పార్టీకి ఇచ్చినా అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఇరు పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు ఎవరంటూ వెతుక్కుంటున్న టీడీపీ, జనసేన పార్టీలకు...కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల కోసం రెండు పార్టీల మధ్య రచ్చ ఆసక్తికరంగా సాగుతోంది. -
పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో టీడీపీలో వర్గవిభేదాలు, అంతర్గత వివాదాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం తమ్ముళ్లు బహిరంగానే కుమ్ములాటకు దిగుతున్నారు. తాజాగా కాకినాడు జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం జరిగింది. ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన దిగారు. ఇలా ఎందుకు జరిగిందని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నాయకులు నిలదీశారు. దీంతో ఇది టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పాడు. వర్మ సమాధానంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెగేసి చెప్పారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయిందని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, అవే ప్రకటించారని అన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని అన్నారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. చదవండి: మాకు చెప్పకుండానే రెండు సీట్లు ప్రకటించారు -
నారా భువనేశ్వరి సమక్షంలో టీడీపీలో వర్గ విభేదాలు
సాక్షి, కోనసీమ జిల్లా: నారా భువనేశ్వరి సమక్షంలో రాజోలు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నారా భువనేశ్వరి పర్యటనలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది.రాజోలు మండలం శివకోడులో నారా భువనేశ్వరిని కలవడానికి తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల రాగా, ఆమెను లోపలికి రానివ్వకుండా గొల్లపల్లి సూర్యారావు వర్గీయులు తోసేశారు. ఇటీవల రాజోలులో జరిగిన లోకేష్ పాదయాత్ర లో సర్పంచ్ రత్నమాల ప్లెక్సీలను గొల్లపల్లి వర్గం చించేశారు. అప్పట్లో టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
‘ఇదెక్కడి న్యాయం.. బాబుగారూ?’
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ముందు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ విలవిలలాడిపోతున్నాడా?.. ఒకవైపు పొత్తు అంటూనే.. మరోవైపు జనసేన స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్నే నిలబెట్టేందుకు దొడ్డిదారి యత్నాలు చేస్తున్నాడు యెల్లో బాస్. ఇప్పుడు సీట్ షేరింగ్ విషయంలోనూ జనసేనను పూర్తిగా ముంచేందుకు పావులు కదుపుతున్నాడు. అయితే తన సొంత పార్టీ నుంచే పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సీట్ల పంపకంపై తాడే పేడో తేల్చుకునేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కీలక చర్చల కోసం శనివారం రాత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నాడు. డిన్నర్ మీట్లో కలుసుకోనున్న ఈ ఇరువురు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు 40లోపు ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లను జనసేన ఆశిస్తోంది. కానీ, తెలుగు దేశం మాత్రం 20 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు భోగట్టా. అయితే దీనిపై జనసేన అభ్యంతరాలకు టీడీపీ సమాధానం కూడా ఇస్తోందట. తెలంగాణలో బీజేపీ కేవలం 8 సీట్లే ఇచ్చిన విషయాన్ని టీడీపీ ప్రస్తావించగా.. ఏపీ కథ వేరంటూ జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మావల్ల కాదు టీడీపీ పొత్తు విషయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను వైఎస్సార్సీపీ కోవర్టులుగా భావిస్తామంటూ జనసేన నేతలకు ఓ హెచ్చరిక చేశాడు పవన్. దీంతో నొచ్చుకున్న కొందరు జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు. కానీ, గత పదేళ్లుగా పార్టీ వెంట తిరిగితే టికెట్లు దక్కకపోవడాన్ని మాత్రం వాళ్లు భరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు వాళ్లు. దీంతో.. మాకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు? వెంటనే తేల్చేయాలనే డిమాండ్‌తో పవన్.. బాబుతో భేటీ అవుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: గందరగోళంలో తెలుగు దేశం! మావైపు రావొద్దు..! మరో వైపు పవన్ కల్యాణ్‌ను కొందరు టీడీపీ నేతలు కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పూల బోకేలు ఇస్తూ.. శాలువాలు కప్పుతూ చిరునవ్వులు చిందిస్తూనే.. మరోవైపు మా నియోజకవర్గాల వైపు చూడొద్దంటూ అల్టిమేటం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఉన్నాం.. ఇప్పుడు పొత్తుల పేరిట మావైపు రావొద్దని వాళ్లు పవన్‌ను కోరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల విషయంలోనూ పవన్‌కు అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపకంపై ఇంకా నాచ్చితే పూర్తిగా నష్టపోతామని భావిస్తున్న పవన్.. డిన్నర్ భేటీలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత అడగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ లేఖ నేపథ్యంలో ఆసక్తి రెండు రోజుల కిందట కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు ఆ భేటీ సారాంశాన్ని ఇవాళ లేఖ రూపంలో విడుదల చేశారాయన. ఈ భేటీలో పవన్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలిపిన హరిరామ జోగయ్య.. పవన్ ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారని, రెండున్నరేళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని, పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి వెళ్తే ఓటు బదిలీ అవుతుంది చెప్పారు. అయితే.. పొత్తులో భాగంగా సీట్ల దాకా అడగాలని తాను పవన్‌కు సూచిస్తే.. పవన్ 40 సీట్ల దాకా ఆశిస్తున్నట్లు తనతో చెప్పారని లేఖలో హరిరామ జోగయ్య వెల్లడించారు. అంతేకాదు.. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించినట్లు చెప్పారాయన. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుతో డిన్నర్ భేటీలో కాపు నేత సూచనలను పవన్ ప్రస్తావించే అవకాశమూ లేకపోలేదు. -
‘పార్టీ మారను.. సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’
సాక్షి, కాకినాడ జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘‘పార్టీ మారను.. రాజీనామా చేయను.. వైఎస్సార్సీపీ, సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’’ అని దొరబాబు స్పష్టం చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులతో పిఠాపురం ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇస్తారని సీఎం జగన్‌పై నమ్మకం ఉందన్నారు. తాను ఏ పార్టీని కలవలేదని దొరబాబు అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు -
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
పెద్దాపురంలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజల సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మేలును ప్రతిబింబిస్తూ శనివారం పెద్దాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన ప్రభంజనమే అయ్యింది. పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సెంటర్ వరకూ సాగింది. బస్సు యాత్ర ముందు భారీ బైక్ ర్యాలీలో యువత కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. దళితుడినైన తానే జగనన్న ప్రభుత్వంలో రాజకీయ సమానత్వనికి చిహ్నమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 17 మందిని మంత్రులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని అన్నారు. రాజకీయ, సామాజిక, ధన ప్రభావాలు చూడకుండా బడుగులకు పెద్ద పదవులు ఇచ్చిన నేత జగన్ ఒక్కరేనని చెప్పారు. సీఎం జగన్ పాలనలో అన్నింటా బడుగులకు అగ్రస్థానం: ఎంపీ సురేష్ సీఎం వైఎస్ జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సంక్షేమ పథకాల్లో, రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పేదలు మరింతగా బాగు పడాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని, అందు కోసం ఆయనకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రేమ, దయ కలిస్తే జగనన్న: జూపూడి ప్రేమ, దయ కలిస్తే సీఎం వైఎస్ జగనన్న అని, ఆయన సమానత్వం చూపించే వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అందుకే నేడు సామాజిక సాధికార యాత్ర చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి సీఎం వైఎస్ జగన్ పరిపాలనే కారణమని చెప్పారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రుణమాఫీ, పింఛన్లు వంటి కార్యక్రమాలతో సంక్షేమాన్ని ప్రతి గుమ్మం వద్దకు చేర్చారని తెలిపారు. ప్రజలందరూ బాగుండాలనే తపనతో పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తూ విద్య, వైద్య రంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పేదవారిని గౌరవించి, పథకాలను వారి ఇంటి వద్దకే పంపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అయ్యరక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ ఛాయిస్ కాకినాడ.?
కాకినాడ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షనర్ల ప్యారడైజ్ అని. రాష్ట్రంలో ఎక్కడ రిటైరయినా.. కాకినాడకు వచ్చి సెటిల్ కావాలని కలలు కనే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ప్రశాంత వాతావరణం, అందమైన నగరం, సముద్రం నుంచి వచ్చే వెచ్చటి గాలులు.. వెరసి కాకినాడకు విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. ఇప్పుడు కాకినాడ గురించి ఈ చర్చ అంతా ఎందుకంటే.. ఈ నగరంపై పవన్ కన్నుపడింది. కాకినాడలో పవన్ క్యాంపు పవన్ కళ్యాణ్.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థంకాక తెగ సతమతమవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలను పరిశీలించినప్పటికీ కాస్త బెటర్ ఆప్షన్‌ను ఎంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కాకినాడపై పవన్ దృష్టి పడింది. అసలు కాకినాడలో తనకు అనుకూలమేంటీ? ప్రతికూలమేంటీ? అన్న సమీకరణాలతో కాకినాడపై దృష్టి సారించారు పవన్‌కళ్యాణ్. మకాం కోసం ఇల్లు కావలెను కాకినాడలో సొంత ఇంటి కోసం సన్నాహాలు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. తన నివాసం కోసం అనువైన ప్రాంతాల పరిశీలన చేస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడి ఓ విశాలమైన ఇల్లు కావాలని, ఎన్నికల వరకు ఉండేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నారు. మీటింగ్‌లతో పాటు, కార్యకర్తలను కలిసేందుకు వీలుండేలా ఓ భారీ భవంతి మంచి సెంటర్లో తీసుకోవాలన్న యోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది. పోటీ చేస్తే.. ఫలితమెలా ఉండవచ్చు? మరొకవైపు వార్డుల వారీగా సామాజిక వర్గాలతో భేటీలకు కూడా శ్రీకారం చుట్టారు పవన్. ఇప్పటికే కాకినాడ 28 వార్డు పెద్దలతో మంతనాలు జరిపిన పవన్.. మరో రెండు మూడు రోజుల్లో అక్కడే పర్యటించనున్నారు. కాకినాడ నుంచే పోటీ చేస్తే.. గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై మంతనాలు చేస్తున్నారు. కులాల వారీగా సమీకరణాలెలా ఉన్నాయి? ఏ వర్గం జనసేనను గుర్తిస్తుంది? ఎవరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు అవకాశాలుంటాయి? అన్న వాటిపై చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో గ్లాసు బోల్తా.! గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్ ఓటమి భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి గతంలో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు పవన్. పార్టీ అధ్యక్షుడిగా బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడానికి ఏడు-ఎనిమిది నియోజకవర్గాలు పరిశీలన చేసినా చివరకు కాకినాడనే చాయిస్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి -
పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. ►22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి ►ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ►ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు ►కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు ►ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే ►అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు ►ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు ►అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు ►చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు ►గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర ►అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది ►ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు ►ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి ►అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ ►కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు ►అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు? ►అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు ►గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ►అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది ►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది ►చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు ►ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు ►గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు ►ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ►గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు ►45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం ►వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం ►వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం. ►ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం ►అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం ►ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది ►ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు ►రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది ►అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ►ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది. ►గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్ పీ క్లాసు రూములు కనిపిస్తాయి ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి ►వైఎస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి ►1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం ►రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ►కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి ►ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్.. ట్యాబులంటే మీ జగన్ ►గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్ ►గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్ ►ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి ►ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది ►ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు ►కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ►రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ►అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా ►మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు ►మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు ►మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు ►మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు ►అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా. -
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
తుని రూరల్: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుని బాహాబాహీకి దిగిన ఘటన సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశారు. వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామకృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అనుచరులతో తరలివచ్చిన యనమల రాజేష్.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన రాజేష్ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్, కృష్ణుడి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు. ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి