యనమల ఇంట్లో టికెట్‌ లొల్లి | clash between tdp leaders in Kakinada | Sakshi
Sakshi News home page

యనమల ఇంట్లో టికెట్‌ లొల్లి

Published Tue, Jan 9 2024 5:10 AM | Last Updated on Fri, Feb 2 2024 1:52 PM

clash between tdp leaders in Kakinada - Sakshi

యనమల సమక్షంలో కృష్ణుడు, రాజేష్‌ వర్గీయులు కుమ్ములాట (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గో­దా­వ­రి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తల­నొప్పిలా మా­­రింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత ని­యో­జక­వర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పా­రు.

ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్న­టి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్‌చార్జిగా యన­మ­ల కృష్ణుడే అన్నీ తానై చూసు­కున్నారు. కష్టకాలంలో పా­ర్టీ­ని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వార­స­త్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచ­ర­వర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చి­న్నా­న్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్‌ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యా­రు. 

పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల
యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజక­వర్గ ఇన్‌చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. 

దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణా­మాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నా­మని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగి­లి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. 

రాజేష్‌ రాకతో కాక
రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్‌చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్‌ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్‌ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పు­తున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది.

తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం
రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దా­లుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది.

ఉంటే రాజేష్‌ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడు­తున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement