Tuni Assembly Constituency
-
తునిలో మరోసారి సైకిల్‌కు పంక్చర్..!
ఒకప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా పిలిచేవారు. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక అక్కడ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. దీంతో సైకిల్ అడ్రస్ గల్లంతైంది. రెండుసార్లు గెలిచిన ఫ్యాన్ మూడోసారి కూడా ఘన విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజల స్పందన ఆధారంగా ఫ్యాన్ హ్యాట్రిక్ ఖాయం అని ప్రజలే చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ లీడర్‌గా చెప్పుకునే యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోవడంతో తుని టీడీపీ కంచుకోట అని చెప్పేవారు.2009 ఎన్నికల నుంచి తునిలో యనమల ప్రాభవం తగ్గిపోయింది. అప్పటినుంచి వరుసగా సైకిల్‌కు పంక్చర్లు పడుతూనే ఉన్నాయి. 2009లో ఓడిన వెంటనే యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసినా టీడీపీకి విజయం దక్కలేదు.గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలిచి ..తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించారు. తాజా ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన తన తమ్ముడు కృష్ణుడికి ఇప్పటి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న యనమల. ఈసారి కృష్ణుడిని కాకుండా తన కుమార్తె దివ్యను దింపారు.దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు..అతని వర్గాన్ని దూరం పెట్టి అవమానించారు యనమల కుమార్తె దివ్య. దీంతో మనస్ధాపం చెందిన కృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు. దాదాపు 40 ఏళ్ల నుంచి తునిలో అన్నకు అండగా అన్ని తానై చూసిన కృష్ణుడు ఊహించని వెన్నుపోటును సహించలేకపోయారు. తునిలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం కృష్ణుడు కసిగా పని చేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్ సిపికి పడేలా రాజకీయం నడిపారు.గత ఎన్నికల్లో తునిలో 82.28% శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ ఎన్నికల్లో ఒక శాతం అదనంగా నమోదు అయ్యింది. ఇక గడిచిన ఐదేళ్ళ కాలంలో తునిలో దాదాపు రూ.1900 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి.. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, త్రాగు నీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది.యనమల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గెస్ట్ హౌజ్‌లో అనే విషయం తుని ప్రజలకు తెలుసు. అంతేకాదు...యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాదులో ఉండడం వల్ల ఆమెపై తుని నియోజకవర్గ ప్రజలకు అంతగా నమ్మకం లేదు.పైగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దివ్య కూడా ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా తరపున ఆయన సతీమణీ లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ కేడర్‌లో ఎక్కువ భాగం యనమల కృష్ణుడివైపు రావడం, కృష్ణుడు వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడి పనిచేయడం వంటి అనేక కారణాలతో మరోసారి తునిలో సైకిల్‌కి పంక్చర్ కావడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడకేనని..ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారని ప్రజాభిప్రాయం చెబుతోంది. -
టీడీపీ సీనియర్ నేతకు ఇంటిపోరు.. చంద్రబాబు చలవే!
తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. పార్టీలో నెంబర్ టూ అని కూడా ప్రచారం చేస్తుంటారు. అంతటి ముఖ్యమైన నేత ఇంటి పోరు రచ్చకెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. చివరికి రెండు వర్గాలు బాహాబాహీకి కూడా దిగారు. ఆ సీనియర్ నేత అందరినీ కూర్చోబెట్టి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొంపలో కుంపటిని ఆర్పేదెలా అని ఆయన తెగ మదనపడుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇంట్లో వర్గ పోరు రోజుకూ తీవ్ర దశకు చేరుతోంది. ఇటీవల తునిలో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో యనమల తమ్ముడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య వివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి యనమల ముందే తన్నుకున్నారు. పచ్చ బ్యాచ్ మధ్య సాగిన న్యూ ఇయర్ ముష్టి యుద్దం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో సంచలనమైంది. అసలు విషయానికి వస్తే గత నలభై ఏళ్ళుగా తుని టీడీపీలో యనమల రామకృష్ణుడికి తమ్ముడు కృష్ణుడు అన్ని తానై నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యనమల కుటుంబంలో ఎవ్వర్నీ రాజకీయంగా ఎదగకుండా కృష్ణుడు తొక్కేశాడన్న విమర్శలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమిని చవి చూసిన యనమల రామకృష్ణుడు అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు కృష్ణుడుకి తుని నుండి టీడీపీ టిక్కెట్టు ఇప్పించి పోటీ చేయించినప్పటీకీ.. రెండు ఎన్నికల్లోనూ కృష్ణుడు ఓటమి చెందారు. దీంతో యనమల రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తన అన్న కుమారుడైన యనమల రాజేష్‌ను బరిలో దింపాలనుకుంటున్నారు. దీంతో, కృష్ణుడు అన్న రామకృష్ణుడిపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఒకవేళ సీటు తనకు ఇవ్వని పక్షంలో తన కుమారుడు శివరామకృష్ణన్‌కు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో ఖంగుతిన్న యనమల తన కుమార్తె దివ్యను పోటీలో నిలపాలని డిసైడ్ అయ్యారు. ముందుగా తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తమ్ముడు కృష్ణుడుని తప్పించి.. ఆ బాధ్యతలను తన కుమార్తె దివ్యకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపారు. ఈ పరిణామాన్ని కృష్ణుడు జీర్ణించుకోలేపోయారు. దీనికి అంతటికి కారణం రాజేష్ అని భావించిన కృష్ణుడి వర్గం వర్గపోరుకు తెర తీసింది. ఇదిలా ఉంటే యనమల కుమార్తె దివ్య కూడా తన సోదరుడు రాజేష్‌ను వెంట బెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్న, అన్న కుమార్తె తీరు కృష్ణుడికి.. అతని వర్గానికి రుచించలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా రాజేష్ తీరు ఉందని భావించిన కృష్ణుడు వర్గం సమయం కోసం వేచి చూసింది. దీంతో న్యూఇయర్ వేడుకల్లో సోదరి దివ్యను కలిసేందుకు వచ్చిన రాజేష్‌ను, అతని వర్గాన్ని.. కృష్ణుడు వర్గం అడ్డగించింది. ఈ క్రమంలో రాజేష్ వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో రెండు వర్గాలు యనమల.. ఆయన కుమార్తె దివ్య ముందు పిడుగుద్దులు గుద్దుకున్నారు. వేడుకలు జరుగుతున్న హాల్లోనే కొట్టుకున్నారు. ఆ తరువాత తిమ్మాపురంలోని అతిథి గృహంలో రెండు వర్గాలను పిలుపించుకుని మాట్లాడారు రామకృష్ణుడు. వివాదాన్ని సద్దమణిగేలా చేద్దామని యనమల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజేష్ ఉంటే తాను పార్టీలో ఉండేది లేదని అన్న యనమలకు తెగేసి చెప్పాడంట తమ్ముడు కృష్ణుడు. నలబై ఏళ్లు పాటు అన్న కోసం పని చేసిన వ్యక్తిని కాదని.. నిన్న కాక మొన్న వచ్చిన రాజేష్‌ను యనమల కుటుంబం దగ్గరకు తీసుకుంటున్నారని కృష్ణుడు వర్గం ఆగ్రహంతో రగిలిపోతుంది. రాజేష్ కోసం తన కుటుంబాన్ని దూరం చేశారని కృష్ణుడు ఆవేదన చెందుతున్నారు. పరిస్ధితులు ఇలానే ఉంటే వచ్చే ఎన్నికలకు అన్న యనమలకు తమ్ముడు కృష్ణుడు సహకరించడనే చర్చ టీడీపీలో జరుగుతోంది. -
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
తుని రూరల్: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుని బాహాబాహీకి దిగిన ఘటన సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశారు. వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామకృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అనుచరులతో తరలివచ్చిన యనమల రాజేష్.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన రాజేష్ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్, కృష్ణుడి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు. ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి