ఒకప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా పిలిచేవారు. కాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక అక్కడ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. దీంతో సైకిల్ అడ్రస్ గల్లంతైంది. రెండుసార్లు గెలిచిన ఫ్యాన్ మూడోసారి కూడా ఘన విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజల స్పందన ఆధారంగా ఫ్యాన్ హ్యాట్రిక్ ఖాయం అని ప్రజలే చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.
తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ లీడర్‌గా చెప్పుకునే యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోవడంతో తుని టీడీపీ కంచుకోట అని చెప్పేవారు.
2009 ఎన్నికల నుంచి తునిలో యనమల ప్రాభవం తగ్గిపోయింది. అప్పటినుంచి వరుసగా సైకిల్‌కు పంక్చర్లు పడుతూనే ఉన్నాయి. 2009లో ఓడిన వెంటనే యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసినా టీడీపీకి విజయం దక్కలేదు.
గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలిచి ..తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించారు. తాజా ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన తన తమ్ముడు కృష్ణుడికి ఇప్పటి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న యనమల. ఈసారి కృష్ణుడిని కాకుండా తన కుమార్తె దివ్యను దింపారు.
దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు..అతని వర్గాన్ని దూరం పెట్టి అవమానించారు యనమల కుమార్తె దివ్య. దీంతో మనస్ధాపం చెందిన కృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు. దాదాపు 40 ఏళ్ల నుంచి తునిలో అన్నకు అండగా అన్ని తానై చూసిన కృష్ణుడు ఊహించని వెన్నుపోటును సహించలేకపోయారు. తునిలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం కృష్ణుడు కసిగా పని చేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్ సిపికి పడేలా రాజకీయం నడిపారు.
గత ఎన్నికల్లో తునిలో 82.28% శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ ఎన్నికల్లో ఒక శాతం అదనంగా నమోదు అయ్యింది. ఇక గడిచిన ఐదేళ్ళ కాలంలో తునిలో దాదాపు రూ.1900 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి.. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, త్రాగు నీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది.
యనమల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గెస్ట్ హౌజ్‌లో అనే విషయం తుని ప్రజలకు తెలుసు. అంతేకాదు...యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాదులో ఉండడం వల్ల ఆమెపై తుని నియోజకవర్గ ప్రజలకు అంతగా నమ్మకం లేదు.
పైగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దివ్య కూడా ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా తరపున ఆయన సతీమణీ లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.
పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ కేడర్‌లో ఎక్కువ భాగం యనమల కృష్ణుడివైపు రావడం, కృష్ణుడు వైఎస్‌ఆర్‌సీపీ కోసం కష్టపడి పనిచేయడం వంటి అనేక కారణాలతో మరోసారి తునిలో సైకిల్‌కి పంక్చర్ కావడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడకేనని..ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారని ప్రజాభిప్రాయం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment