రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఉమ్మడి ఎన్‌టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట కూడా ఉంది. పోలింగ్ పెరుగుదల అంతా తమ కోసమే అంటూ తెలుగుతమ్ముళ్లు ఆ రోజున తెగ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏవిధంగా పోలింగ్ జరిగిందో..ఏ వర్గం ఎవరికి అనుకూలంగా ఉందో ఒక అంచనాకు వచ్చారు. దీంతో పచ్చ పార్టీనేతలకు నోట మాట పడిపోయింది. జగ్గయ్యపేటలో చేతులెత్తేయడం ఖాయం అంటూ టీడీపీలో టాక్ నడుస్తోంది. జగ్గయ్యపేట పోలింగ్ సరళి ఎలా ఉందో చూద్దాం.
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలనుకున్న నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట ఒకటి. అందుకు ప్రధాన కారణం జగ్గయ్యపేటలో మూడుసార్ల నుంచి గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వల్ల పచ్చ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని భావించడమే. ఇప్పటికి మూడుసార్లు గెలిచిన ఉదయభాను...నాలుగోసారి కూడా బరిలో నిలిచారు. ఈసారి కూడా ఉదయభాను గెలిస్తే జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన నాయకుడిగా రికార్డ్ సాధించడం ఒక భాగం అయితే ... జగ్గయ్యపేటలో టీడీపీ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం ఖాయం అని భయపడుతున్నారట. ఈ కారణంగానే ఎలాగైనా గెలవాల్సిందేనని టీడీపీ గట్టి పట్టుదల చూపించింది. అందుకే చంద్రబాబు మొదటి విడతలోనే జగ్గయ్యపేట అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ ఉరఫ్ తాతయ్య పేరు ప్రకటించేశారు.
శ్రీరాం రాజగోపాల్ పేరు ప్రకటించినప్పటినుంచీ వైఎస్‌ఆర్‌సీపీ ఓట్లకు గండి కొట్టడం ఎలా అనే ఆలోచించడం ప్రారంభించారు. సామినేని ఉదయభానును ఓడించి తాను గెలవడం ఎలా అంటూ రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రచారం కూడా బాగానే చేశారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. పోలంగ్ కేంద్రాలు తెరవకముందే వచ్చి క్యూల్లో నిలుచున్నారు. రాత్రి వరకు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ భారీ నుంచి అతి భారీ స్థాయికి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన టాప్ త్రీ నియోజకవర్గాల సరసన జగ్గయ్య పేట కూడా చేరింది.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 2,05,364 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,84,575 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 7,237 మంది మహిళలు అధికంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలిరావడాన్ని చూసిన తెలుగు తమ్ముళ్లు ఈసారి తమదే విజయం పక్కా..అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని సంబరాలు చేసుకున్నారు. కుప్పంతో సమానంగా 89.88 శాతం పోలింగ్ నమోదు కావడంతో టీడీపీ క్యాడర్‌లో సంతోషం అంతా ఇంతా కాదు..శ్రీరాం రాజగోపాల్ విజయం ఖాయం అని ఒకరికొకరు చెప్పుకున్నారు. కట్ చేస్తే...తెల్లారాక అసలు విషయాలు తెలిసి కళ్లు తేలేస్తున్నారు.
నియోజకవర్గంలో జరిగిన అత్యంత భారీ పోలింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని..అదంతా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలమని లెక్కలు తేలడంతో టీడీపీ వారికి నోట మాట రావడంలేదు. జగ్గయ్యపేట టౌన్ మినహా ఇతర అన్ని మండలాల్లోనూ 90 శాతానికి పైగా నమోదైన పోలింగ్ టీడీపీకి అనుకూలంగా లేదని వారికి అర్థమైపోయింది. ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపించారో అర్థం అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏమి మాట్లాడాలో అర్థం కావడంలేదట. అందుకే ఎన్నికల ముందు గెలుస్తాం అంటూ నానా హడావుడి చేసినవారంతా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment