మంగళగిరిలో నెగ్గితే సరేసరి
లేదంటే రాజకీయంగా అధోగతేనా?
కంగారుపడుతున్న టీడీపీ క్యాడర్
పోల్ మేనేజ్‌మెంట్ లెక్కలు తప్పాయా..
వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైఎస్సార్ సీపీ
మురుగుడు లావణ్యకు కలిసొచ్చే కాలమంటున్న పరిశీలకులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గట్టెక్కగలిగితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే అనుమానాలు స్వపక్షీయుల్లోని సీనియర్లు, శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తొలి అడుగులే తడబాటుతో.. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు తగురీతినే బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలైన లోకేష్ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అదీ లేదు.
టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 1985 ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు. 1994లో సీపీఎం నుంచి రామ్మోహన్‌రావు గెలుపొందారు. బీసీ సామాజికవర్గం నుంచి గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల విజయం సాధించారు. ఆళ్ల రామకష్ణారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందడానికి పెదకాకాని వాస్తవ్యుడు కావడం, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉండటం, అన్నిటికన్నా మించి వై.ఎస్. కుటుంబానికి సన్నిహితులు కావడం. బీసీలకు చెందిన నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయడమంటే సాహసించినట్లేనని లోకేష్ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దష్టి సారించిన దాఖలాలు లేవు.
వైఎస్సార్ సీపీ వ్యూహాత్మక అడుగులు.. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు, విద్యావంతురాలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్సార్ సీపీ విజయానికి తొలిమెట్టుగా పరిశీలకుల అభిప్రాయం. నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజికవర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మామ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. వీటికితోడు ఆ సామాజికవర్గానికి చెందిన స్థానిక సీనియర్ నాయకులైన చిల్లపల్లి మోహన్‌రావు, గంజి చిరంజీవి తదితరులకు వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టింది. కార్పొరేషన్ల డైరెక్టర్లుగా, దుర్గగుడి పాలకమండలి సభ్యులుగాను నియమించింది. ఎమ్మెల్యే ఆళ్ల ముందుచూపుతో దుగ్గిరాల (పసుపు) మార్కెట్ యార్డు చైర్మెన్ పదవిని ఎస్సీ, మైనార్టీలకు, మంగళగిరి ఏఎంసీని యాదవ, పద్మశాలి వర్గీయులకు అప్పగించారు. ఇక పార్టీ నాయకత్వం సోషల్ ఇంజినీరింగ్‌లో ఆచితూచి అడుగులేసింది. ఈ విషయంలో టీడీపీ ఎక్కడా సరితూగలేదు.
అభివృద్ధికి దిక్సూచిగా.. మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి కార్పొరేషన్‌గా చేయడం, ప్రత్యేక గ్రాంటుగా రూ.130 కోట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించడం, ఎవరూ ఊహించని రీతిలో గౌతమబుద్ధ రోడ్డును అభివద్ధి చేయడం, తొమ్మిది అర్బన్ హెల్త్ సెంటర్లు, సర్వ హంగులతో వై.ఎస్.ఆర్ క్రీడాప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, అంతర్గత రహదారుల విస్తరణ, అభివద్ధి, విభిన్న సామాజికవర్గాల వారికి భవనాలు, కల్యాణ మండపాలను నిర్మించడం, ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లి అభినందనలు అందుకునేలా పద్మశాలీయులకు మగ్గంలో శిక్షణ ఏర్పాట్లు నెలకొల్పడం తదితరాలు నియోజకవర్గ అభివద్ధికి దిక్సూచిగా నిలిచాయి. పల్లెల్లో డొంకరోడ్లు, సిమెంటు రోడ్లు, అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావుపూలే, సర్ధార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖుల విగ్రహాల ఏర్పాట్లు నియోజకవర్గానికి అదనపు హంగులుగా మారాయి. ఆర్కే సొంతంగా నిధులు సమకూర్చడం, అవినీతికి తావు లేకుండా పనులు చేయడం, తరతమ భేదం లేకుండా అన్ని సామాజికవర్గాలకు చేరువగా ఉండటం పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చింది.
కార్పొరేట్ తరహాలో లోకేష్ బృందం.. మంగళగిరి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్న లోకేష్ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేదని స్వపక్షీయులే అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాని, ఆ తరువాతైనా వ్యూహం కొరవడిందంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా రావడం, అతితక్కువ మందిని కలవడం, స్థానికేతరుడు కావడం, ఆయన బందం కార్పొరేట్ తరహాలో వ్యవహారాలు నడపడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు తొలి నుంచే ఉన్నాయి. తోపుడుబండ్లు, బడ్డీ కొట్లు ఇవ్వడం, పెళ్లికానుక పేరుతో రూ.5,000, సుమారు ఓ ఏడాదిపాటు రెండు చోట్ల అన్న క్యాంటీన్లను నడపడం వలన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండటాన్ని, లోకేష్ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు బేరీజు వేసుకునే స్థితి.
కూటమి నేతలతో అంటీముట్టనట్లు.. ఎన్నికలకు కూటమి కట్టినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీలతో అంటీముట్టనట్లే పార్టీ వ్యవహరించిందని టీడీపీ ముఖ్యులే అభిప్రాయపడుతూ వచ్చారు. సమన్వయ సమావేశం కూడా జరగకపోవడం గమనార్హం. ముస్లిం, క్రిస్టియ¯Œ ఓటర్లు దూరమవుతారనే భయంతో బీజేపీ వారిని దరిజేరనిచ్చిన దాఖలాలు దాదాపు లేవు. బీజేపీ, జనసేనలకు చెందిన యడ్లపాటి రఘునాథబాబు, పాతూరి నాగభూషణం, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాదరావు, పూర్ణచంద్రరావు, శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు తదితర నాయకులు నియోజకవర్గం వారైనప్పటికీ వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తక్కువే. వీరిలో జనసేనకు చెందిన ఒకరిద్దరికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారే తప్ప బీజేపీని పట్టించుకోలేదు.
సీనియర్ నాయకులకే లోకేష్ అందుబాటులో ఉండరని, సెక్యూరిటీ వారిని దాటుకుని వెళ్లలేమని, కార్పొరేట్ తరహా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు తమలాంటి వారి సంగతి ఏంటనే ప్రశ్న సామాన్య ఓటర్ల మధ్య చర్చకు దారితీయడం నష్టదాయకంగా మారిందని అంచనా వేస్తున్నారు. లోకేష్ చుట్టూ ఆయన సామాజికవర్గం నేతలు చేరడం, తమ వాడైనందున ఓట్లు వేయండని హెచ్చరిక ధోరణిలో చెప్పడం, పెత్తందారీ పోకడలతో వ్యవహరించడం, మా మాట వినకపోతే మీకు ఉపాధి ఉండదని, కౌలుకు భూములు కూడా ఇచ్చేది లేదని కొందరు భయపెట్టే రీతిలో మాట్లాడటం కూడా ఓట్లకు చేటు తెచ్చేవే అనే వ్యాఖ్యానాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.
:::సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment