తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. పార్టీలో నెంబర్ టూ అని కూడా ప్రచారం చేస్తుంటారు. అంతటి ముఖ్యమైన నేత ఇంటి పోరు రచ్చకెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. చివరికి రెండు వర్గాలు బాహాబాహీకి కూడా దిగారు. ఆ సీనియర్ నేత అందరినీ కూర్చోబెట్టి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొంపలో కుంపటిని ఆర్పేదెలా అని ఆయన తెగ మదనపడుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే..
టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇంట్లో వర్గ పోరు రోజుకూ తీవ్ర దశకు చేరుతోంది. ఇటీవల తునిలో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో యనమల తమ్ముడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య వివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి యనమల ముందే తన్నుకున్నారు. పచ్చ బ్యాచ్ మధ్య సాగిన న్యూ ఇయర్ ముష్టి యుద్దం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో సంచలనమైంది. అసలు విషయానికి వస్తే గత నలభై ఏళ్ళుగా తుని టీడీపీలో యనమల రామకృష్ణుడికి తమ్ముడు కృష్ణుడు అన్ని తానై నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యనమల కుటుంబంలో ఎవ్వర్నీ రాజకీయంగా ఎదగకుండా కృష్ణుడు తొక్కేశాడన్న విమర్శలు ఉన్నాయి.
2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమిని చవి చూసిన యనమల రామకృష్ణుడు అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు కృష్ణుడుకి తుని నుండి టీడీపీ టిక్కెట్టు ఇప్పించి పోటీ చేయించినప్పటీకీ.. రెండు ఎన్నికల్లోనూ కృష్ణుడు ఓటమి చెందారు. దీంతో యనమల రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తన అన్న కుమారుడైన యనమల రాజేష్‌ను బరిలో దింపాలనుకుంటున్నారు. దీంతో, కృష్ణుడు అన్న రామకృష్ణుడిపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఒకవేళ సీటు తనకు ఇవ్వని పక్షంలో తన కుమారుడు శివరామకృష్ణన్‌కు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో ఖంగుతిన్న యనమల తన కుమార్తె దివ్యను పోటీలో నిలపాలని డిసైడ్ అయ్యారు.
ముందుగా తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తమ్ముడు కృష్ణుడుని తప్పించి.. ఆ బాధ్యతలను తన కుమార్తె దివ్యకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపారు. ఈ పరిణామాన్ని కృష్ణుడు జీర్ణించుకోలేపోయారు. దీనికి అంతటికి కారణం రాజేష్ అని భావించిన కృష్ణుడి వర్గం వర్గపోరుకు తెర తీసింది. ఇదిలా ఉంటే యనమల కుమార్తె దివ్య కూడా తన సోదరుడు రాజేష్‌ను వెంట బెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
అన్న, అన్న కుమార్తె తీరు కృష్ణుడికి.. అతని వర్గానికి రుచించలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా రాజేష్ తీరు ఉందని భావించిన కృష్ణుడు వర్గం సమయం కోసం వేచి చూసింది. దీంతో న్యూఇయర్ వేడుకల్లో సోదరి దివ్యను కలిసేందుకు వచ్చిన రాజేష్‌ను, అతని వర్గాన్ని.. కృష్ణుడు వర్గం అడ్డగించింది. ఈ క్రమంలో రాజేష్ వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో రెండు వర్గాలు యనమల.. ఆయన కుమార్తె దివ్య ముందు పిడుగుద్దులు గుద్దుకున్నారు. వేడుకలు జరుగుతున్న హాల్‌లోనే కొట్టుకున్నారు.
ఆ తరువాత తిమ్మాపురంలోని అతిథి గృహంలో రెండు వర్గాలను పిలుపించుకుని మాట్లాడారు రామకృష్ణుడు. వివాదాన్ని సద్దమణిగేలా చేద్దామని యనమల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజేష్ ఉంటే తాను పార్టీలో ఉండేది లేదని అన్న యనమలకు తెగేసి చెప్పాడంట తమ్ముడు కృష్ణుడు. నలబై ఏళ్లు పాటు అన్న కోసం పని చేసిన వ్యక్తిని కాదని.. నిన్న కాక మొన్న వచ్చిన రాజేష్‌ను యనమల కుటుంబం దగ్గరకు తీసుకుంటున్నారని కృష్ణుడు వర్గం ఆగ్రహంతో రగిలిపోతుంది. రాజేష్ కోసం తన కుటుంబాన్ని దూరం చేశారని కృష్ణుడు ఆవేదన చెందుతున్నారు. పరిస్ధితులు ఇలానే ఉంటే వచ్చే ఎన్నికలకు అన్న యనమలకు తమ్ముడు కృష్ణుడు సహకరించడనే చర్చ టీడీపీలో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment