‘ఇదెక్కడి న్యాయం.. బాబుగారూ?’ | Pawan Kalyan Dinner Meet Chandrababu Amid Seat Sharing | Sakshi
Sakshi News home page

‘ఇదెక్కడి న్యాయం బాబుగారూ?’.. టీడీపీ అధినేత ఇంటికి జనసేనాని

Published Sat, Jan 13 2024 5:07 PM | Last Updated on Sun, Feb 4 2024 2:57 PM

Pawan Kalyan Dinner Meet Chandrababu Amid Seat Sharing - Sakshi

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ముందు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ విలవిలలాడిపోతున్నాడా?.. ఒకవైపు పొత్తు అంటూనే.. మరోవైపు జనసేన స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్నే నిలబెట్టేందుకు దొడ్డిదారి యత్నాలు చేస్తున్నాడు యెల్లో బాస్‌. ఇప్పుడు సీట్‌ షేరింగ్‌ విషయంలోనూ జనసేనను పూర్తిగా ముంచేందుకు పావులు కదుపుతున్నాడు. అయితే తన సొంత పార్టీ నుంచే పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సీట్ల పంపకంపై తాడే పేడో తేల్చుకునేందుకు పవన్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.    

కీలక చర్చల కోసం శనివారం రాత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నాడు. డిన్నర్ మీట్లో కలుసుకోనున్న ఈ ఇరువురు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు 40లోపు ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లను జనసేన ఆశిస్తోంది. కానీ, తెలుగు దేశం మాత్రం 20 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లను మాత్రమే ఆఫర్‌ చేస్తున్నట్లు భోగట్టా. అయితే దీనిపై జనసేన అభ్యంతరాలకు టీడీపీ సమాధానం కూడా ఇస్తోందట. తెలంగాణలో బీజేపీ కేవలం 8 సీట్లే ఇచ్చిన విషయాన్ని టీడీపీ ప్రస్తావించగా.. ఏపీ కథ వేరంటూ జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక మావల్ల కాదు
టీడీపీ పొత్తు విషయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా భావిస్తామంటూ జనసేన నేతలకు ఓ హెచ్చరిక చేశాడు పవన్‌. దీంతో నొచ్చుకున్న కొందరు జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు. కానీ, గత పదేళ్లుగా పార్టీ వెంట తిరిగితే టికెట్లు దక్కకపోవడాన్ని మాత్రం వాళ్లు భరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు వాళ్లు. దీంతో..  మాకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు? వెంటనే తేల్చేయాలనే డిమాండ్‌తో పవన్‌.. బాబుతో భేటీ అవుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: గందరగోళంలో తెలుగు దేశం!

మావైపు రావొద్దు..!
మరో వైపు పవన్‌ కల్యాణ్‌ను కొందరు టీడీపీ నేతలు కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పూల బోకేలు ఇస్తూ.. శాలువాలు కప్పుతూ చిరునవ్వులు చిందిస్తూనే.. మరోవైపు మా నియోజకవర్గాల వైపు చూడొద్దంటూ అల్టిమేటం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఉన్నాం.. ఇప్పుడు పొత్తుల పేరిట మావైపు రావొద్దని వాళ్లు పవన్‌ను కోరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల విషయంలోనూ పవన్‌కు అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపకంపై ఇంకా నాచ్చితే పూర్తిగా నష్టపోతామని భావిస్తున్న పవన్‌.. డిన్నర్‌ భేటీలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత అడగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. 

ఆ లేఖ నేపథ్యంలో ఆసక్తి
రెండు రోజుల కిందట కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు ఆ భేటీ సారాంశాన్ని ఇవాళ లేఖ రూపంలో విడుదల చేశారాయన. ఈ భేటీలో పవన్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలిపిన హరిరామ జోగయ్య.. పవన్ ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారని, రెండున్నరేళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని, పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి వెళ్తే ఓటు బదిలీ అవుతుంది చెప్పారు. అయితే.. పొత్తులో భాగంగా సీట్ల దాకా అడగాలని తాను పవన్‌కు సూచిస్తే.. పవన్‌ 40 సీట్ల దాకా ఆశిస్తున్నట్లు తనతో చెప్పారని లేఖలో హరిరామ జోగయ్య వెల్లడించారు. అంతేకాదు.. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించినట్లు చెప్పారాయన. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుతో డిన్నర్‌ భేటీలో కాపు నేత సూచనలను పవన్‌ ప్రస్తావించే అవకాశమూ లేకపోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement