గీతాంజలి ఘటనపై సర్వత్రా ఆందోళన
ఆ పసిపిల్లల జీవితాలు ఏం కావాలంటూ ప్రశ్న
తీవ్రవాదుల కంటే ప్రమాదంగా ఐటీడీపీ
రాక్షస మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎస్వీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
బెంగళూరులోనూ నిరసనలు
టీడీపీ సోషల్ మీడియా పశువులను శిక్షించాలని సర్వత్రా డిమాండ్
తణుకు అర్బన్/ భీమవరం/ కాకినాడ క్రైం/ విజయవాడస్పోర్ట్స్/ కడప/ సాక్షి,నెట్‌వర్క్:గీతాంజలి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు తగ్గడం లేదు. బుధవారం నాడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు టీడీపీ రాక్షస మూకలు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియా హంతకులు ఇద్దరు పిల్లల తల్లిని నిర్థాక్షిణ్యంగా చంపేశారని ధ్వజమెత్తారు. కక్షగట్టి ఆమె ప్రాణాలను బలిగొన్నారని, రాజకీయ లబ్ధే పరమావధిగా క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదొంగలే పొట్టన పెట్టుకున్నారు.
గీతాంజలిని టీడీపీ పచ్చ దొంగలే పొట్టనపెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తణుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీపీ దొంగలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు.
మహిళలు, బాలికలను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో వే«ధించే వారికి కఠిన శిక్షలు తప్పవని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన న్యాయవాది ఎం.చిత్రభాను స్పష్టంచేశారు. మహిళలు మానసికంగా ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపుల పట్ల ధైర్యంగా 111పోలీసులకు ఫిర్యాదు చేయాలని భీమవరానికి చెందిన వైద్యురాలు మాదిరెడ్డి స్వరాజ్యలక్ష్మి అన్నారు.
టీడీపీలో మహిళలకు గౌరవం ఎన్టీఆర్‌తోనే పోయింది
టీడీపీపి స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు హయాంలోనే ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఉండేదని డాక్టర్ నూరి పరి అన్నారు. ఆయన్ని వెన్ను పోటు పొడిచి ఈ లోకం నుంచి పంపించేసిన వ్యక్తులే ప్రస్తుతం ఆ పార్టీకి ఆధిపత్యం చెలాయిస్తూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. పదో తరగతి విద్యార్ధిని మేఘనని, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడుతున్న మరో విద్యార్ధినిని ఇదే విధంగా ట్రోల్ చేసి మానసిక హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గీతాంజలికేసులో అజయ్ సత్య అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తపై రాష్ట్రప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ముంబయి) కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని శిక్షించాలని అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి శిల్పా నాగినిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా కోరారు. వందలాది మంది మహిళలతో కలిసి ఆమె బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థినులతో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాక్షసుల వేధింపులకు బలైపోయిన ఆడబిడ్డ
గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా రాక్షసుల వేధింపులకు బలైపోయిన విశ్వబ్రాహ్మణ జాతి ఆడ బిడ్డ గీతాంజలిని బలి తీసుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
గీతాంజలికి పట్టిన దుర్గతి భవిష్యత్‌లో మరొకరికి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు లబ్ది జరిగిన సంతోషాన్ని పంచుకుంటేనే టీడీపీ జనసేన నేతలు ఓర్వలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మదనపల్లెలో కొవ్వొత్తుల ప్రదర్శన
టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాలకు, ఆయా పార్టీల సోషల్ మీడియా రాబందుల వికృతచేష్టలకు నిండుప్రాణం బలికావడం విచారకరమని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. వుయ్ స్టాండ్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బెంగళూరు బస్టాండులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
తెనాలిలో స్వర్ణకార దుకాణాల బంద్
గీతాంజలి మృతికి సంతాపంగా బుధవారం తెనాలిలో స్వర్ణకారులు బంద్ పాటించారు. పట్టణ నడిబొడ్డులోని వెయ్యికి పైగా స్వర్ణకార దుకాణాలను మూసివేశారు. శ్రీకామాక్షీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వందలాది కార్మికులు మాజేటి నాగేశ్వరరావు వీధిలోని అసోసియేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా దౌర్జన్యానికి బలైన గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించటంపై హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment