Foreign University
-
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
ఇక్కడ సీటొస్తే.. విదేశాల్లో చదవొచ్చు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాలర్ల డ్రీమ్ ఇప్పటి యువత కల. అందుకోసం విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలని యువత భావిస్తోంది. ఈ కలను సాకారం చేసుకోవాలంటే.. పొరుగు దేశం వెళ్లి ఏ కోర్సు చేయాలన్నా ఆ దేశం నుంచి వీసా పొందటం, విదేశీ యూనివర్సిటీలలో సీటు పొందడం ఇలా ఎన్నింటినో దాటాలి. ఇలాంటి వ్యయప్రయాసలకు చెక్ పెట్టి విదేశాల్లో ఎంఎస్ చేయాలన్న కలను సాకారం చేస్తోంది కాకినాడలోని జేఎన్టీయూ. ఇప్పటికే స్వీడన్లో బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ, యూఎస్‌లో నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని పలు కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ, ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది. 45 దేశాల యూనివర్సిటీలతో.. ఇటీవల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ హోదాను సాధించిన జేఎన్టీయూకే (కాకినాడ) విదేశీ విద్య కోసం 45 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో సేవలందించిన డాక్టర్ షేక్ సులేమాన్, విదేశీ సేవల కోసం ఫారిన్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శివనాగరాజును నియమించుకుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వీసా నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వరకు అంతా జేఎన్టీయూకే చూసుకుంటోంది. జేఎన్టీయూకే అందిస్తున్న కోర్సులు స్వీడన్ బ్లేకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ విభాగాల్లో 20 సీట్ల చొప్పున 60 సీట్లతో జేఎన్టీయూకే ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సు వ్యవధి నాలుగు లేదా ఆరు సంవత్సరాలు. నాలుగు సంవత్సరాల కోర్సులో చేరితే మూడేళ్లు జేఎన్టీయూ (కాకినాడ)లోను, ఒక ఏడాది స్వీడన్లో అభ్యసిస్తే డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది. అదే మూడేళ్లు ఇక్కడ మరో మూడేళ్లు స్వీడన్లో అభ్యసిస్తే డ్యూయల్ డిగ్రీ అంటే ఎంఎస్ అర్హత గల సర్టిఫికెట్ అందజేస్తారు. ఫీజు జేఎన్టీయూకేలో ఏడాదికి రూ.1.50 లక్షలు, స్వీడన్లో ఏడాదికి సుమారు రూ.7 లక్షలు వరకు చెల్లించాలి. యూఎస్‌లోని నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో నాలుగు సంవత్సరాల కోర్సుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సును మూడేళ్లపాటు జేఎన్టీయూకేలోను, ఒక ఏడాది యూఎస్‌లోను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. జర్మనీలో స్టెబిన్సీ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ మాస్టర్ ప్రోగ్రాం రెండేళ్ల కాల వ్యవధితో అందించేందుకు జేఎన్టీయూకే ఒప్పందం చేసుకుంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. స్టెబిన్సీ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతతో సీటు సాధిస్తే ఉచిత విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రవేశాలు ఇలా.. ఈఏపీ సెట్ లేదా జేఈఈ, టీఎస్ ఎంసెట్‌లో అర్హత సాధించాలి. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ ఉత్తీర్ణులై కనీసం 60 శాతం మార్కులు పొందాలి. వివరాలకు జేఎన్టీయూకే ఫారిన్ వర్సిటీ రిలేషన్స్ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. విదేశీ ఒప్పందాలకు ప్రణాళిక ఇప్పటికే అందిస్తున్న కోర్సులకు స్పందన బాగుంది. ఇటీవల న్యాక్ ఏ ప్లస్ హోదా రావడంతో 45 దేశాల్లో పేరొందిన యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జేఎన్టీయూకేలో మూడేళ్లు అభ్యసించి నాలుగో ఏడాది విదేశీ కోర్సు చదవచ్చు. ఒప్పందం ప్రకారం విదేశీ యూనివర్సిటీలే మన విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తాయి. – జీవీఆర్ ప్రసాదరాజు, వీసీ, జేఎన్టీయూకే -
నైతిక పునాది లేని జాతీయవాదం
భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఈ క్యాంపస్‌ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాకింగ్స్లో టాప్ – 500ల్లో ఉండాలి. స్పష్టంగా వీటిలోని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్‌తో ఇంగ్లిష్‌లో నేర్పుతారు. కేంద్రం ఇంగ్లిష్‌లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యంగా లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంçస్కృతిపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ చెబుతూ వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌లో అధ్యయనం చేసేది ఎవరు? మన విద్యా వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల వల్ల దెబ్బతింటోంది. తీవ్ర జాతీయవాది సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్, విదేశీ యూనివర్సిటీ విద్య నేర్పించడాన్నే ఇష్టపడుతున్నారు. మరోవైపు సంస్కృతి, వారసత్వం, మాతృభాష అంటూ రాగం ఎత్తుకుంటారు. ఒక కుటుంబానికి డబ్బుంటే, వారి పిల్లలు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదవడానికి భారీగా ఖర్చు చేస్తారు. విదేశీ యూనివర్సిటీల్లో చదవడానికి అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పోతారు. కానీ స్వదేశంలో అత్యున్నత విజ్ఞానాన్ని మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధించాలని వీరు కోరుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం భారత్‌లో తమ క్యాంప స్లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు (యేల్, హార్వర్డ్, ప్రిన్్సటన్) తలుపులు తెరిచింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ జనవరి 5న నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్ ్సలో ఈ ప్రకటన చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ‘భారత్‌లో తన క్యాంపస్‌ను ఏర్పర్చాలనుకునే విదేశీ విశ్వవిద్యా లయం గ్లోబల్ ర్యాకింగ్స్లో టాప్– 500ల్లో ఉండాలి.’ అంటే వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి యూనివర్సిటీలు భారత్ లోని కొత్త క్యాంపస్‌లపై దృష్టి సారిస్తాయని దీనర్థం. స్పష్టంగా వీటిలోని అన్ని కోర్సులను ప్రపంచస్థాయిలో పోటీపడే సిలబస్‌తో ఇంగ్లిష్‌లో నేర్పుతారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంగ్లిష్‌లో తమ ఇచ్ఛప్రకారం కోర్సులను బోధించే విశ్వవిద్యాలయాలను అనుమతించడం ఆశ్చర్యం కలిగించడం లేదా? ఇదే ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బోధనా భాషగా చేయాలనీ, సిలబస్ భారతీయ సంస్కృతి, వార సత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉండాలనీ పదే పదే చెబుతూ వచ్చింది. యూనివర్సిటీ సిలబస్‌లో నిర్బంధంగా వేద, పురాణ అధ్యయనాలను చొప్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వివాదా స్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారతీయ విశ్వవిద్యాలయాల్లో హిందీలో చదివేవారు ఎవరు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లిష్‌లో అధ్యయనం చేసేది ఎవరు? విదేశీ విశ్వవిద్యాలయాలు వేద విజ్ఞానం, గణితం, మానవ శాస్త్రాలను ‘ప్రపంచ’ నాగరికతా ఆధారాలుగా హిందీలో బోధిస్తాయా? ‘భారతీయ క్యాంపస్‌లో విదేశీ విశ్వవిద్యాలయం అందించే విద్యా నాణ్యత, దాని సొంత దేశంలోని ప్రధాన క్యాంపస్‌లో అందించే విద్యానాణ్యతకు సమానంగా ఉంటుందని హమీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భారతీయ క్యాంపస్‌లోని విద్యార్థులకు అందించే విద్యా పరమైన అవార్డులు సొంతదేశంలోని ప్రధాన క్యాంపస్‌లోని ఉన్నత విద్యాసంస్థలు అందించే విద్యాపరమైన అవార్డులకు సరిసమానంగా ఉండటమే కాకుండా ఆ మేరకు తగిన గుర్తింపును కూడా ఇవ్వాల్సి ఉంటుంది’ అని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌లో విదేశీ విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఆయన నొక్కి చెప్పారు. క్యాంపస్‌లో విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతుల విషయంలో తప్ప, నిర్వహణాత్మక అంశంలో యూజీసీ నుంచి ఎలాంటి జోక్యం ఉండబోదని అన్నారు. జాతీయ విద్య వర్సెస్ గ్లోబల్ విద్యతో దేశాన్ని కుల, వర్గ ప్రాతిపదికన మరింతగా విభజించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లయితే, భారతీయ యూనివర్సిటీలలో విద్యా నాణ్యత, పట్టభద్రుల ఉపాధి విషయం ఏమిటి? ఇదే జరిగితే, భారత్ మరోసారి తన అంధకార గతం వైపు వెళ్లిపోతుంది. శూద్రులు, ఇతర వెనుక బడిన వర్గాలు (ఓబీసీలు), దళితులు, ఆదివాసీలు ఆధునిక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేరు. రిజర్వేషన్ ప్రయోజనాలు ఇకపై శూన్య మైపోతాయి. ఉత్పాదక వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం విద్యా భారతిని చూపిస్తుంది. ఇది ఆరెస్సెస్ నిర్వహించే పాఠశాలల నెట్వర్క్. ఇలాంటి విద్యా నమూనా ద్వారా ఘనమైన ప్రాచీన నాగరికతను భారతీయులు అనుసరించాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. అదే సమయంలో ఆధునిక ఉత్పత్తి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, వనరుల పంపిణీ, సమానత్వం వంటివాటిని భార తీయేతరమైనవిగా ఇవి చూస్తున్నాయి. వర్ణవ్యవస్థ కేంద్రకంగా ఉన్న మానవ సంబంధాలు, ఆశ్రమాల్లో నివసించడమే సమాజ ఆద ర్శాలుగా మారిపోతాయి. అదే సమయంలో విదేశీ, భారతీయ ప్రైవేట్ పాఠశాలలు, యూనివర్సిటీలు దేశంలోని కులీన వర్గాల, పాలక వర్గాల పిల్లలకు హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, యేల్ యూనివర్సిటీల సిలబస్‌తో ఇంగ్లిష్‌లో బోధనను అందిస్తాయి. దీనివల్ల వీరు పాశ్చాత్య దేశాలతో వాటికి వెలుపలి ప్రపంచంతో కూడా కనెక్ట్ అవుతారు. వీరే నిజమైన విశ్వగురువులుగా లేదా ప్రపంచ నేతలుగా మారతారు. ఈ రకమైన విభజన వల్ల మన దేశంలోని సెక్యులర్, లిబరల్ ద్విజులు పెద్దగా కోల్పోయేది ఏమీ ఉండదు. తమ పిల్లలకు హిందీ మీడియం విద్యా భారతి సిలబస్‌ను నేర్పరని వీరందరికీ స్పష్టంగా తెలుసు. బోధనా పద్ధతులపై, బోధనా శాస్త్రంపై వీరి విమర్శ అటు భాష, ఇటు విషయంపై అస్పష్టతతోనే ఉంటుంది. కానీ వీరు సమా నతా విద్య గురించి వల్లిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యావేత్తలు ఈ విద్యా నమూనాతో పోరాడరు. గతంలో పేలవమైన విద్యా విధానాలను రూపొందించింది వీరే మరి. దీనివల్లే శూద్రులు, ఓబీసీలు, దళితలు, ఆదివాసుల్లో ఇంగ్లిష్ విద్య పొందిన మేధావులు అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండిపోయారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ మేధావుల విషయానికి వస్తే ఈ విధమైన విద్యాపరమైన విభజన వారికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పలువురు ముస్లిం విద్యార్థులు మదరసాల్లో, క్రిస్టియన్ విద్యార్థులు మిషనరీ స్కూల్స్‌లో చదువుకుంటూ ఉంటారు. మదర సాలు, క్రిస్టియన్ స్కూళ్లు అంతరిస్తున్నాయనుకోండి! మరోవైపున విద్యావకాశాలకు దూరమైన శూద్రులు, ఓబీసీలు కూడా ఈ సమ స్యను పెద్దగా పట్టించుకోవడం లేదు. హిందూ సామ్రాట్ గుర్తింపుతో మొట్టమొదటి బీసీ ప్రధానిగా చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ తమను చారిత్రక బానిసత్వం నుంచి బయటపడేస్తారని వీరిలో చాలామంది భావిస్తున్నారు. భారతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజారాసులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే అది వారి సొంత భాషా దురహంకారానికి వ్యతిరేక మవుతుంది. ఇక ఓబీసీ, దళిత సంస్థల విషయానికి వస్తే విద్యా నాణ్యత కంటే రిజర్వేషన్ లో తమ వాటా గురించే ఆందోళన చెందుతున్నాయి. నిరంకుశమైన 2020 వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా వ్యవసాయ ప్రజా బాహుళ్యం చిన్న విజయం సాధించగలిగింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ విద్యా కుట్రతో తమ పిల్లలు మరింత ప్రమాదంలో పడనున్నారని వీరు గుర్తించడం లేదు. ప్రజారాసుల పిల్లలను చేర్చు కుంటామని హామీ ఇవ్వకుండానే అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకు ప్రజల భూములను కొనివేయబోతున్నాయి. రైతుల పిల్లల విద్యాపరమైన శక్తిసామర్థ్యాన్ని విచ్చిన్నపర్చడానికి పాలక వర్గాలు పథకం వేస్తున్నాయి. ఈ విధానాల ద్వారా వీరి భవిష్యత్తు అంధకారం కానుంది. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉంటున్న రిజ ర్వేషన్లు పొందుతున్నవారేమో ఒకసారి ప్రైవేటీకరణ పూర్తి శక్తితో ముందుకొచ్చాక న్యూనతతో బాధపడక తప్పదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్‌లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు. -
విదేశీ వర్సిటీల్లో చేరేలా... ‘ఉక్రెయిన్’ విద్యార్థులకు సాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇతర విదేశీ యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సాయపడండి. దేశాలవారీగా వర్సిటీల్లో ఖాళీలు, ఫీజులు తదితర పూర్తి వివరాలతో ఓ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయండి’’ అని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల వైద్య విద్యార్థుల పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు సూచనలపై కేంద్రం వైఖరి తెలపడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన సుమారు 20 వేల మంది విద్యార్థులను యుద్ధ బాధితులుగా పరిగణించాలని వారి తరఫున న్యాయవాది కోరగా విషయాన్ని అంత దూరం తీసుకెళ్లొద్దని ధర్మాసనం సూచించింది. ‘‘వాళ్లు స్వచ్ఛందంగానే ఉక్రెయిన్ వెళ్లారని గుర్తుంచుకోవాలి. పైగా వాళ్లు యుద్ధ రంగంలో లేరు కూడా’’ అని జస్టిస్ గుప్తా అన్నారు. విద్యార్థులకు సాయం చేయడానికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందని మెహతా తెలిపారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలతో భారత్ సంబంధాలు పెట్టుకుందన్నారు. విద్యార్థులు అనుకూలమైన విదేశీ వర్సిటీని ఎలా ఎంచుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. లైజనింగ్ అధికారిని నియమించామని చెప్పగా ఒక్క అధికారి ఉంటే చాలదని పేర్కొంది. వైద్య విద్య పూర్తి చేయాలనుకుంటే విద్యార్థులు ఓ దారి వెతుక్కోవాల్సిందేనని అభిప్రాయపడింది. విదేశీ వర్సిటీలు ప్రవేశాలు కల్పించగలిగితే భారత వర్సిటీలకు ఎందుకు సాధ్యం కాదని విద్యార్థుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. దేశీయ వర్సిటీలపై విద్యార్థులకు హక్కు లేదని ధర్మాసనం బదులిచ్చింది. విచారణను సెప్టెంబరు 23కు వాయిదా వేసింది. -
స్వదేశం నుంచే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: విదేశీ విశ్వవిద్యాలయాల్లోని అత్యున్నత విద్యను ఇకపై స్వదేశం నుంచే అభ్యసించే అవకాశం మన విద్యార్థులకు కలగబోతోంది. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యావిధానంలో చేసిన నిర్ణయాల ఫలితంగా ఆయా విదేశీ వర్సిటీల అనుబంధ విద్యావిభాగాలు మన దేశంలోనే కొలువుదీరనున్నాయి. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు సాధించేలా.. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యావిధానంలో కొత్త నిబంధనలు పొందుపరిచిన సంగతి తెలిసిందే. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ.. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాములతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడికి అనుగుణంగా ‘ట్విన్నింగ్’ కార్యక్రమాల కోసం పలు కొత్త నిబంధనలను కేంద్రం రూపొందించింది. వీటిని యూజీసీ 2020 ఏప్రిల్‌లోనే నోటిఫై చేసి విదేశీ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానం పలికింది. ట్విన్నింగ్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల అమలుకు, పరస్పర సహకారానికి ముందుకు రావాలని కోరింది. ఈ నిబంధనల ప్రకారం.. దేశంలోని విద్యార్థులు దేశీయ వర్సిటీలు, విదేశీ వర్సిటీలు అందించే డ్యూయెల్ డిగ్రీలను ఒకేసారి అందుకోగలుగుతారు. దీనికి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి సానుకూల స్పందన లభించినట్లు యూజీసీ వెల్లడించింది. ఇప్పటికే స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోవ్ విద్యా సంబంధిత అనుసంధానంపై సుముఖత వ్యక్తపరచగా, ఆస్ట్రేలియాలోని డాకిన్ యూనివర్సిటీ కూడా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు తోడ్పాటునందిస్తుందని తెలిపింది. ఇవే కాకుండా.. అనేక ఇతర విదేశీ వర్సిటీలు తమ శాటిలైట్ క్యాంపస్ (అనుబంధ విభాగాలు)లను భారత్‌లో ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌లాండ్ తమ శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తపరచడంతో పాటు వచ్చే నెలలో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. అంతేకాక.. జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ, ఫ్రాన్స్‌లోని మరో యూనివర్సిటీ కూడా దేశంలో శాటిలైట్ వర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. జపాన్‌లోని వివిధ వర్సిటీలు కూడా తమ ఆసక్తిని వ్యక్తపరిచినట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉన్నత విద్య అంతర్జాతీయకరణకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానంలో చేసిన కొత్త నిర్ణయాలతో విద్యా సంబంధిత వ్యవహారాలు మరింత బలోపేతమవుతాయంటూ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి అభిప్రాయపడుతూ పరస్పర మార్పిడి ప్రక్రియకు సానుకూలతను తెలిపింది. వేల్స్‌లోని బంగోర్ వర్సిటీ, సోస్ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కూడా ఉన్నత విద్యా వ్యవహారాల్లో పరస్పర మార్పిడి ప్రక్రియకు ముందుకొస్తున్నాయి. ఇక జర్మనీలోని యూనివర్సిటీ జెనా, దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు సహ దాదాపు 48 విదేశీ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యలో పరస్పర సహకారానికి ప్రతిపాదించాయి. ఎంఐటి, స్టాన్ఫోర్డ్లు కూడా సంసిద్ధత ఇక అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు కూడా తమ విభాగాల ఏర్పాటుకు ముందుకొస్తుండడంతో దేశంలోని విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రాముల ద్వారా ఆయా వర్సిటీల కోర్సులను కూడా మన విద్యార్థులు స్వదేశంలో చదువుతూనే వాటినీ అభ్యసించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇవే కోర్సులను విదేశాల్లోని ఆయా వర్సిటీలలో చదవాలంటే లక్షల్లో డబ్బు వెచ్చించడంతోపాటు అనేక వ్యయప్రయాసలకోర్చవలసి ఉంటుందని వివరిస్తున్నారు. కానీ, ఇక్కడే ఆయా డిగ్రీ కోర్సుల అధ్యయనంతో పైచదువుల కోసం విదేశీ వర్సిటీల్లో మన విద్యార్థులు సులభంగా ప్రవేశాలు పొందే అవకాశముంటుందంటున్నారు. -
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు అలెర్ట్ !
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో వైద్య విద్య అభ్యసనకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్యకు నీట్ పరీక్ష అర్హత ఆధారంగా అడ్మిషన్లు కేటాయించడం.. ఎన్ఎంసీ నిర్దేశించిన విధానంలో పరీక్షల నిర్వహణతో ముగుస్తుంది. అయితే విదేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఫీజు ఆధారంగా సీట్లు పొంది కోర్సు పూర్తి చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే భారత్‌లో కంటే అత్యంత సులువైన పద్ధతితో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసే వారికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చేందుకు జాతీయ వైద్య మండలి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. 54 నెలలు మస్ట్ ఇప్పటికే కొన్ని రకాల నిబంధనలు ఉన్నా వాటిని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ కోర్సును కనీసం 54 నెలలు పూర్తి చేయాలనే నిబంధనను కఠినతరం చేస్తోంది. అలాగే కాలేజీలో అడ్మిషన్ పొందేముందు అక్కడి మౌలిక వసతులు, అత్యాధునిక పద్ధతుల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. ఆన్‌లైన్‌కి నో వైద్య విద్యలో ఆన్లైన్ పద్ధతిలో కొనసాగే తరగతులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్ఎంసీ భావిస్తోంది. పూర్తిగా మాన్యువల్‌లో, ప్రయోగ విధానంలో తరగతులు నిర్వహించడమే మేలని అంచనాకు వచ్చింది. విదేశాల్లో వైద్య కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్ నిర్వహించినా.. తిరిగి ఇక్కడ ఎన్ఎంసీ పరీక్షలో అర్హత సాధించడంతో పాటు ఇంటర్న్‌షిప్ మనోమారు చేయాల్సిన అంశాలను కఠినంగా అమలు చేయనుంది. ఇప్పటికే ఎన్ఎంసీ మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ తాజా పరిణామాలతో వీటిని రివైజ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు.. -
విదేశీ విద్య.. ఆన్లైన్ బాట!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు విదేశీ వర్సిటీల విద్యార్థులు ఇప్పుడు ఈ–క్లాస్ బాట పట్టారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో నగరానికి చేరుకున్న వేలాదిమంది విద్యార్థులు తిరిగి ఆయా దేశాలకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో విమాన రాకపోకలకు అనుమతించకపోవడంతో ఆన్లైన్లో సెమిస్టర్ పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి విద్యార్థులకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకె దేశాల వర్సిటీలు కూడా ఈ–క్లాస్‌లు బోధించేందుకు అనుమతించడం విశేషం. ఈ వర్చువల్ క్లాసుల్లో విద్యార్థులతో ఆయా దేశాల వర్సిటీల అధ్యాపకులు ఫేస్–టు–ఫేస్ సంభాషించడం వంటి ఏర్పాట్లున్నాయి. డిగ్రీ, పీజీస్థాయి విద్యార్థులు తమ సెమిస్టర్ పాఠ్యాంశాలు మిస్‌కాకుండా ఈ బోధన ఏర్పాట్లు చేసినట్లు ఆయా వర్సిటీలు ప్రకటించాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 50 వేలమంది వరకు ఇదే తరహాలో పాఠాలు వింటున్నట్లు సమాచారం. ఆయా దేశాల్లోని సుమారు 25కు పైగా వర్సిటీలు ఈ విధానంలో విద్యార్థులకు బోధన ఏర్పాట్లు చేయడం విశేషం. భారత కాలమానం ప్రకారమే క్లాసులు.. భారత కాలమానం ప్రకారం పగటి వేళల్లోనే ఈ–క్లాసుల నిర్వహణకు ఆయా వర్సిటీలు శ్రీకారం చుట్టడం విశేషం. విద్యార్థులకు అనుకూలమైన సమయాల్లోనే వారికి పాఠాలు బోధిస్తేనే సౌకర్యవంతంగా ఉండటంతోపాటు విద్యార్థులు పాఠాలను ఆకలింపు చేసుకోవడం.. ఈ–లెర్నింగ్‌లో చురుగ్గా పాల్గొనడం చేస్తున్నట్లు ఆయా దేశాల వర్సిటీలు భావిస్తున్నాయట. ఈ తరగతుల బోధన ద్వారా విద్యార్థుల్లోనూ తాము నగరంలో చిక్కుకొని సెమిస్టర్ మిస్ అవుతున్నామనే భావన తొలగిందని.. ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్య అభ్యసిస్తున్న విక్రమ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక లండన్‌కు చెందిన రాయల్ హోలోవే యూనివర్సిటీ కూడా వర్చువల్ క్లాసుల ద్వారా పీజీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. తద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడటంతోపాటు.. విద్యార్థులు తాము పాఠాలు వినలేకపోతున్నామనే ఒత్తిడి ఉండదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆయా దేశాల్లోని ప్రైవేటు వర్సిటీలకు మన నగరానికి చెందిన విద్యార్థులు విద్యా రుణాలు తీసుకొని మరీ ఏటా కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లిస్తున్న విషయం విధితమే. ఇటు ఫీజులు కోల్పోకుండా.. అటు పాఠాలు మిస్‌కాకుండా చూసేందుకు ఈ ఏర్పాట్లు ఉపకరిస్తున్నాయంటున్నారు. అయితే మార్చి నెలలో నగరానికి చేరుకున్న పలువురు విద్యార్థులు తమ వీసా గడువు తీరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ–క్లాసులతో ఉపయోగాలివే.. ♦ ఈ–క్లాసులతోపాటు ఆన్లైన్లోనే వర్క్‌షాప్‌లు, జూమ్ మీటింగ్‌లతో తమ కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలను విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ♦ ఆగస్టు నెలాఖరు వరకు ఫేస్–టు–ఫేస్ వర్చువల్ క్లాసులు కొనసాగించాలని అమెరికా, ఆస్ట్రేలియా, యూకె దేశాలకు చెందిన వర్సిటీలు నిర్ణయించడం విశేషం. ♦ విద్యార్థులకు సెమిస్టర్ పాఠాలు మిస్ అవుతామనే ఆందోళన దూరమైంది. ♦ ఈ–లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులకు నోట్స్, స్టడీ మెటీరియల్ కూడాఅందజేస్తుండటం విశేషం. ♦ విద్యార్థులు తాము చెల్లిస్తున్న ఫీజులకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతుండటంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన తొలిగింది. -
రాష్ట్రానికి విదేశీ యూనివర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు విదేశీ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్లో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నూతన విద్యా విధానం బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణలో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు కావడం ఖాయమని చెప్పారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్‌లో జరిగిన విద్యా సదస్సులో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పేదలు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఆర్థిక సాయం చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులు యూనివర్సిటీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విదేశాల్లో చదువుకున్న తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి సొంత రాష్ట్రానికి సేవలు అందించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విదేశీ విద్యపై అవగాహన కల్పించేందుకు జిల్లాల్లో కూడా విద్యా సదస్సులు నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సదస్సులో అమెరికా కాన్సులేట్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, కాబోయే అధ్యక్షుడు భువనేశ్ భుజాల తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ పీహెచ్‌డీలకూ అసిస్టెంట్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: టాప్–500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ పూర్తిచేసిన వారు కూడా భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి అర్హులేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాకరెలి సైమండ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, షాంఘై జియావో టోంగ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా, సోషల్ సైన్సెస్, లాంగ్వెజేస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో నియామకాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని యూజీసీ తెలిపింది. ప్రస్తుతం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. నెట్, సెట్, స్లెట్ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించడం ద్వారా రాత పరీక్ష నుంచి మినహాయింపు పొందినా, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులూ ఇకపై తప్పనిసరిగా నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష)లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్థులకు సరైన సామర్థ్యాలు లేకున్నా విదేశీ వర్సిటీలు వారికి వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు భారత్‌లో వృత్తిని చేపట్టాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)లో కచ్చితంగా పాసవ్వాల్సిందే. కానీ దాదాపు 90 శాతం మంది విద్యార్థులు అందులో ఫెయిల్ అవుతున్నారు. దీంతో వారంతా దేశంలో నకిలీ వైద్యులుగా మారి పెనుముప్పుగా పరిణమిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే కూడా నీట్‌ను తప్పనిసరిచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
విదేశీ విద్యకు.. ‘అప్లై విజ్’
విద్యార్థులను, వర్సిటీలను కలిపే వేదిక • ఏ ర్యాంకుకు ఏ యూనివర్సిటీలో సీటొస్తుందో తెలుసుకోవచ్చు... • ప్రస్తుతానికి 4 దేశాల్లోని 1,000 వర్సీటీల సమాచారం • త్వరలో నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు • ‘స్టార్టప్ డైరీ’తో అప్లైవిజ్ ఫౌండర్ గాయం నర్సిరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ వర్సిటీలు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్స్, ఫీజులు వంటి వివరాలు ఒకేచోట పొందాలంటే కష్టమే. దీంతో చాలా మంది విద్యార్థులు అరకొర సమాచారంతోనే విదేశాల్లో అడుగుపెట్టడం.. కొన్ని సార్లు మోసాలకు గురికావటమూ జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారంగానే ‘అప్లైవిజ్’ను రూపొందించామన్నారు గాయం నర్సిరెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు విదేశీ యూనివర్సిటీల్లో అకడమిక్ అడ్మిషన్స్ కోలాహలం మొదలవుతుంది. జనవరి– మార్చి మధ్య మూడు నెలలు ఎక్కడ చూసినా ఇదే చర్చ. జీఆర్ఈ, టోఫెల్లో ఎంత ర్యాంకు వచ్చింది? ఏ వర్సిటీలో సీటు వస్తుందో? అసలొస్తుందో రాదో? వస్తే ఎప్పుడు చేరాలి? ఫీజెంత? ఇలా రకరకాల సందేహాలు. విద్యార్థులకు గానీ, తల్లిదండ్రులకు గానీ పూర్తి సమాచారం తెలియట్లేదు. దీనికి పరిష్కారం చూపించేందుకే అప్లైవిజ్.కామ్ ఆరంభించాం. రూ.4 లక్షల పెట్టుబడితో మరో కో–ఫౌండర్ విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి గతేడాది ఆగస్టులో ప్రారంభించాం. ప్రవేశ పరీక్షల నుంచే మొదలు.. విదేశాల్లో చదువుకునేందుకు జీఆర్ఈ, జీమ్యాట్, శాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్ వంటి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? ఏ వర్సీటీలు ఏ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి? ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? ఏ ర్యాంకు వస్తే ఏ వర్సిటీలో సీటొస్తుంది? ఫీజులెంత? వర్సిటీ మంచిదా? కాదా? దాని ర్యాంకెంత? వంటి సమాచారమంతా తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగానే. అయితే ముందుగా విద్యార్థులు తమ ప్రొఫైల్స్‌ను నమోదు చేసుకోవాలి. అలాగే విద్యార్థులు అందించే ఎస్ఓపీ/ఎస్సైలను కూడా కొనుగోలు చేయవచ్చు. 1,000 వర్సిటీల సమాచారం... ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే దేశాల్లోని 1,000 వర్సీటీల సమాచారం అందుబాటులో ఉంది. మరో నెల రోజుల్లో కెనడా, సింగపూర్, జర్మనీ దేశాల్లోని వర్సిటీ సమాచారాన్ని కూడా పొందుపరుస్తాం. ఇప్పటివరకు 100 మంది విద్యార్థులు అప్లైవిజ్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అప్లైవిజ్తో విద్యార్థులకు, వర్సిటీలకు ఇద్దరికీ లాభమే. వర్సిటీల సమాచార సేకరణకు విద్యార్థులు, విద్యార్థుల ప్రొఫైల్స్‌తో నేరుగా వారినే సంప్రదించటానికి వర్సిటీలు దీన్ని ఉపయోగిస్తున్నాయి. త్వరలోనే దరఖాస్తు కూడా.. వర్సిటీల సమాచారంతో పాటూ విదేశీ విద్య, ఉద్యోగ సంబంధమైన వార్తలు, కథనాలను బ్లాగ్స్, ఫోరమ్స్‌లో అందిస్తున్నాం. ప్రస్తుతం ఆరుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే అప్లైవిజ్ ద్వారా నేరుగా కళాశాలలు, వర్సిటీలకు దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నాం. ప్రవేశ పరీక్షల మెటీరియల్‌ను కూడా విక్రయిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
విదేశీ విద్యకు క్లిక్ దూరం!
♦ స్కాలర్షిప్ టు ఇంటర్న్‌షిప్.. అన్నీ ఒకేచోట ♦ we make scholars.com ద్వారా రూ.20 కోట్ల స్కాలర్షిప్లు ♦ 1,300 మంది క్లయింట్లు: ఇందులో 800 విదేశీ వర్సిటీలే ♦ 1,300 సంస్థలతో ఒప్పందం.. మా సైట్లో విదేశీ వర్సిటీల స్కాలర్‌షిప్‌లతో పాటూ అనిత, ఆగాఖాన్, కామన్వెల్త్ ఫౌండేషన్లు, గూగుల్, టాటా, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి కార్పొరేట్ సంస్థల సంస్థల ఉంటుంది. ఇప్పటివరకు మొత్తం 1,300 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇందులో 800 వరకు విదేశీ వర్సిటీలున్నాయి. గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు పీజీ, పరిశోధన విద్యనభ్యసించే వాళ్లూ మా సేవలను వినియోగించుకోవచ్చు. స్కాలర్‌షిప్‌ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, డేటాను అప్లోడ్ చేయడానికి ఆరుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విదేశాల్లో చదువులంటే...! చేతిలో ఉన్న సొమ్ముతోనో లేదా ఆస్తులు విక్రయించో చదివే వాళ్లుంటారు! మరి కొందరైతే బ్యాంకులిచ్చే రుణంతో విమానం ఎక్కేస్తుంటారు.! అలా కాకుండా విదేశీ యూనివర్సిటీలు, ప్రైవేటు సంస్థలు, ఫౌండేషన్లు, ట్రస్ట్‌లు అందించే స్కాలర్షిప్స్తో విద్యనభ్యసించే వాళ్ల మాటేంటి? నిజానికి అలాంటి వాళ్లు తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఏ దేశంలో... ఏ వర్సిటీ ఎలాంటి ఉపకారవేతనాలందిస్తోంది? ఏ ఇంటర్న్‌షిప్‌లో చేరితే ఎంత ప్రయోజనం? ఇలాంటి వివరాలన్నీ తెలిసేదెలా? దానికి సమాధానమే ‘ఠ్ఛీ ఝ్చజ్ఛు టఛిజిౌ్చటట.ఛిౌఝ’ తమకెదురైన అనుభవాన్నే ఓ స్టార్టప్ కంపెనీగా మలచి... ఎందరో విద్యార్థుల విదేశీ విద్య కలను నిజం చేస్తున్నారు సంస్థ వ్యవస్థాపకులు దామిని మహాజన్, అర్జున్ ఆర్ కృష్ణ. దామినిది జమ్మూకాశ్మీర్. అర్జున్ కేరళవాసి. కానీ, ఇద్దరికీ పరిచయమైంది మాత్రం ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ వర్సిటీలో. బయో టెక్నాలజీలో ఎంఎస్ చేయడానికి యూకే వెళ్లారు వీళ్లిద్దరూ. అది కూడా స్కాలర్షిప్ను అందుకుని మరీ. యార్క్‌షైర్‌లోని షెఫీల్డ్ వర్సిటీ స్కాలర్షిప్కు దామిని, క్వీన్స్ స్కాలర్షిప్కు అర్జున్ ఎంపికయ్యారు. దీనిపై వాళ్లిద్దరూ ఏమంటారంటే... ‘‘అక్కడికి వెళ్లాకే మాకు యూనివర్సిటీలోని ఇతర విద్యార్థుల నుంచి ఎదురైన మొట్టమొదటి ప్రశ్నేంటో తెలుసా? తామంతా ఇంట్లో వాళ్ల సొంత డబ్బులతో అక్కడికి వచ్చామని చెబుతూ... మాకు ఈ స్కాలర్షిప్ ఎలా అందిందని అడిగారు. అప్పుడే మాకు అర్థమైంది భారతీయులకే కాదు..! విదేశీయులకూ స్కాలర్‌షిప్‌ల గురించి అంతగా అవగాహన లేదని! అందుకే ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ‘స్కాలర్షిప్’ పేరుతో ఫేస్బుక్ ఆన్లైన్ బృందాన్ని ప్రారంభించాం. ఇందులో ఉపకార వేతనం కోసం వర్సిటీలకు ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ప్రాథమిక వివరాలను పొందుపరిచేవాళ్లం. ఆశ్చర్యకరంగా మన దేశ విద్యార్థులే కాదు పాకిస్తాన్, ఈజిప్టు, పోర్చుగల్, యూరప్ దేశాల విద్యార్థులూ సభ్యులుగా చేరారు. వాళ్ల ప్రశ్నలకు అదే పేజీ వేదికగా తీరిగ్గా సమాధానమిచ్చే వాళ్లం. చూస్తుండగానే చదువు పూర్తయింది. బయటికెళితే మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. కానీ, మా పేజీ సహాయంతో స్కాలర్షిప్ పొందిన చాలా మంది విద్యార్థుల నుంచి ఒకటే కోరిక.. ‘‘స్కాలర్షిప్ ఫేస్బుక్ పేజీని కాస్త వెబ్‌సైట్‌గా మార్చేసి ఆన్లైన్ వేదికగా ఎడ్యుకేషన్ కన్సెల్టింగ్ సేవలందించమని’’. ఇంకేముందు ఏడాది సమయంలో టెక్నాలజీని అభివృద్ధి చేసి, వర్సిటీ సమాచారాన్ని సేకరించి, ఏడాది సమయం తర్వాత ఏప్రిల్ 29న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చేతుల మీదుగా ‘వీ మేక్ స్కాలర్స్’ పేరుతో సంస్థను పారంభించాం. అవగాహన లేకపోవడమే.. సాధారణంగా ఉపకారవేతనాలను నాలుగు రకాలుగా పొందొచ్చు. 1. విశ్వవిద్యాలయాలు 2. విద్యా మంత్రిత్వ శాఖలు 3. ట్రస్ట్‌లు లేదా ఫౌండేషన్లు 4. కార్పొరేట్ సంస్థలు. అసలు ఆయా సంస్థలు ఉపకారవేతనాలను ఎందుకిస్తాయంటే.. తమ కాలేజీలను ప్రమోట్ చేసుకోవడానికి. లేదా చిన్న దేశాలైతే తమ గుర్తింపు కోసం విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకే మొదటి అవకాశం. అయితే సాధారణంగా ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగే అవకాశముంటుంది. మూడు, నాలుగు రౌండ్ల పాటు ఇంటర్వ్యూలు, మెరిట్, ఫైనాన్షియల్ లీడ్, కుటుంబ నేపథ్యం.. వంటి వివరాలు తీసుకుంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే స్కాలర్షిప్ కోసం ఆయా దేశాలకు వెళ్లాలనో.. లేదా డిగ్రీ పూర్తయ్యాకే దరఖాస్తు చేసుకోవాలనో అనుకుంటారు. దీంతో ఆయా స్కాలర్షిప్ ప్రయోజనాన్ని వృథా చేసుకుంటున్నారు. కానీ, డిగ్రీ, లేదా ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతూనే రిజిస్టర్ చేసుకొని.. వివరాలు పంపిస్తే చదువు పూర్తయ్యేలోపు స్కాలర్షిప్లను పొందొచ్చు. స్కాలర్షిప్, ఇంటర్న్‌షిప్‌లు కూడా.. విదేశాల్లో చదువు కోసం ఏటా మన విద్యార్థులు రూ.200 కోట్లు ఖర్చు చేస్తుంటే.. ఇందులో స్కాలర్‌షిప్‌ల వాటా 2-4 శాతం మాత్రమే. ఇందుకు కారణం విదేశీ స్కాలర్‌షిప్‌ల గురించి సరైన అవగాహన లేకపోవడమే. ఇదే మా బిజినెస్ మోడల్. మా సైట్లో కేవలం స్కాలర్‌షిప్‌లే కాదు ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. మా సేవలు పూర్తిగా ఉచితం. ఏ దేశంలో చదవాలనుకుంటున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు? వంటి వివరాలు ఇందులో నమోదు చేస్తే చాలు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఏ రంగమైనా సరే ఉపకారవేతనాల వివరాలు మీ ముందుంటాయి. సమగ్ర వివరాలతో దరఖాస్తును నింపి పంపించడమే తరువాయి. ఇప్పటివరకు 249 దేశాల నుంచి సుమారు 8 లక్షల మంది విద్యార్థులు మా సైట్లో రిజిస్టర్ అయ్యారు. ఇందులో నుంచి సుమారు 14 వేల మంది ఉపకారవేతనాల కోసం వివిధ వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 459 మంది విద్యార్థులకు రూ.20 కోట్లు ఉపకారవేతనాలుగా అందాయి. సమీకరణకూ సిద్ధం.. ఇటీవలే మా సంస్థలో బిట్స్‌పిలానీ, భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు సంయుక్తంగా రూ.50 లక్షలలోపు పెట్టుబడులు పెడతామన్నారు. అగ్రిమెంట్ దశలో ఉన్నాం. ఈ నిధుల సాయంతో ‘డాష్‌బోర్డ్’ సేవలను ప్రారంభిస్తాం. ఇందుకోసం ఏడాదికి 1,000 డాలర్లు చార్జీ చేస్తాం. యూకేకు చెందిన క్యూఅండ్ఎస్ సంస్థతో మా మొదటి సేవల్ని ప్రారంభిస్తున్నాం. డాష్‌బోర్డ్ అంటే.. సంబంధిత సంస్థకు సంబంధించిన స్కాలర్షిప్ విభాగాన్ని మేం నిర్వహిస్తాం. ఇందులో విద్యార్థుల దరఖాస్తుల నుంచి మొదలుపెడితే.. ఎక్కడి నుంచి అప్లయ్ చేసుకుంటున్నారు? ఎంత మంది చేస్తున్నారు? ఆయా అర్హతలను బట్టి ఎవరికి ఎంత చెల్లించాలి వంటి సమస్త సమాచారాన్ని విశ్లేషిస్తాం. త్వరలోనే దేశంలోని అన్ని విశ్వ విద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి ఉపకారవేతనాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని విద్యార్థులకు చేరవేస్తాం. హైదరాబాద్‌లోని బీవీఐఆర్టీ సంస్థ నుంచి మొదలు పెడుతున్నాం’’. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
విదేశీ విద్య..
మంచి భవిష్యత్తును వెతుక్కొనే క్రమంలో భారతీయ విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలకు వేలంవెర్రిగా ‘క్యూ’ కడుతున్నారు. నాణ్యమైన విద్య అందుతుందనే కంటే... ఆయా దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కొని, అక్కడే స్థిరపడిపోవడానికి అక్కడి విద్యాసంస్థల్లో చేరడం మొదటి మెట్టుగా మనవాళ్లు పరిగణిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు విదేశాల్లో చదువుకొంటున్నారని చెప్పుకోవడానికి... వెళ్లాల్సిందేనని ప్రోత్స హిస్తున్నారు. ఇదో స్టేటస్ సింబల్ అయింది. 2014లోనే విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. ఈ విషయంలో చైనా ముందుంది. చైనా నుంచి ఏకంగా 6.5 లక్షల మంది వివిధదేశాల్లోని యూనివర్సిటీల్లో చదువుతున్నారు. విదేశీ యూనివర్సిటీలకు విద్యార్థులను అందించే దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. విదేశాలకు వెళ్లే ప్రతి ముగ్గురు భారతీయ విద్యార్థుల్లో ఒకరు తమ కలల సౌధంగా అమెరికానే ఎంచుకుంటున్నారు. బ్రిటన్‌లో వీసా నిబంధనలు కఠినంగా కావడంతో గత సంవత్సరంతో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 10 శాతం పడిపోయింది. మరోవైపు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్... ఈ ఏడు ముఖ్యదేశాల నుంచి 2013లో భారత్‌కు 13,961 మంది విద్యార్థులు రాగా... 2014లో ఈ సంఖ్య దారుణంగా 3,737కు పడిపోయింది. అంటే 73 శాతం తగ్గుదల. అమెరికాలో గడిచిన నాలుగేళ్లుగా కొద్దిగా హెచ్చుతగ్గులున్నా... భారతీయ విద్యార్థుల సంఖ్య లక్ష దగ్గరే ఉంది. కానీ 2014-15లో మాత్రం ఏకంగా 29.4 శాతం పెరుగుదల నమోదైంది. అమెరి కాలో గత నాలుగేళ్లుగా పరిస్థితి, భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మొద టి ఐదు దేశాలు... అంకెల్లో చూద్దాం. -
'విదేశీ వర్సిటీలకు అనుమతి వద్దు'
కర్నూలు (న్యూసిటీ) : రాష్ట్రంలో విదేశీ వర్సిటీలకు అనుమతులు జారీ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా కేంద్రంలో పలువురు విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో విదేశీ వర్సిటీలకు అనుమతులు మంజూరు చేయాలని ఇటీవల ఏపీ కెబినేట్ తీర్మానించిన విషయం తెలిసిందే. దీనిని పలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
సంప్రదాయ కోర్సులకూ రుణాలు!
విదేశీ వర్సిటీల్లో చదువులకూ మంజూరు - అవాన్స్, క్రెడీలా పేర్లతో విద్యారుణాలు - కొత్త రూట్లో డీహెచ్ఎఫ్ఎల్, హెచ్డీఎఫ్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు రుణాలు అంత తేలికేమీ కాదు. అందులోనూ విద్యా రుణాలైతే మరీను. పేరున్న వర్సిటీల్లో పాపులర్ కోర్సులైన ఇంజనీరింగో, మెడిసిన్‌నో లేక మేనేజ్మెంట్ కోర్సో చదివే విద్యార్థులకు మాత్రమే రుణాలు లభిస్తుంటాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా ఆ కోర్సు పూర్తి చేశాక సదరు అభ్యర్థికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాన్ని ఆధారం చేసుకునే రుణాలిచ్చేది. అందుకే సంప్రదాయ కోర్సులైన సంగీతం, ఫొటోగ్రఫీ, నృత్యం వంటి కోర్సులు చదివే వారికి రుణాలు కావాలంటే కాస్తంత ఇబ్బంది తప్పదు. అయితే మన దేశంలో ఇలాంటి సంప్రదాయ కోర్సుల ఫీజులు తక్కువే. కాబట్టి మరీ ఇబ్బంది ఉండదు. కానీ విదేశీ వర్సిటీల్లో ఇలాంటి కోర్సులు చదవాలంటే మాత్రం కష్టం. అయితే ఇలాంటివన్నీ అర్థం చేసుకున్న బ్యాంకులు కొన్ని ఈ కోర్సులకూ రుణాలిచ్చేలా కొత్త పథకాలు ఆరంభిస్తున్నాయి. అలాంటి వారికీ రుణాలు లభిస్తున్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు రూ.80 వేల కోట్ల వరకూ వెచ్చిస్తున్నారు. ఈ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధితో అంతకంతకూ దూసుకెళుతోంది. దీన్లో విద్యారుణం తీసుకొని ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి వాటా దాదాపు 15 శాతంగా ఉంది. నిజానికిపుడు పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకోవటమనేది తగ్గింది. ఉన్నత విద్య రుణం కోసం నేరుగా విద్యార్థులే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌ను చూసిన ప్రయివేటు ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. అవాన్స్, క్రెడీలా రుణాలు.. అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలైన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), హెచ్‌డీఎఫ్‌సీలు మేనేజ్మెంట్ కోర్సులతో పాటు సంప్రదాయ కోర్సులైన ఫొటోగ్రఫీ, సంగీతం, నృత్యం, డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులకూ విద్యారుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాల కోసం డీహెచ్ఎఫ్ఎల్ ‘అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. హెచ్డీఎఫ్సీ కూడా ఈ రుణాల కోసం ‘క్రె డీలా’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఆయా రుణాలను కేవలం కోర్సు ఫీజులకే పరిమితం చేయకుండా రుణానికి అర్హుడైన విద్యార్థి చదువు పూర్తయ్యేంత వరకు అవసరమయ్యే ఖర్చు, రవాణా చార్జీలను కూడా రుణంలో భాగంగానే మంజూరు చేస్తున్నాయి. వర్సిటీ, దేశాన్ని బట్టి వడ్డీ రేట్లు.. సంప్రదాయ కోర్సుల విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు... విద్యార్థులు ఎంచుకునే వర్సిటీ, దేశం ఆధారంగా మారుతూ ఉంటాయని హైదరాబాద్‌లోని ‘అవాన్స్’ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధికారి ఒకరు ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధితో చెప్పారు. ‘‘దేశీయంగా గుర్తింపు పొందిన వర్సిటీల్లోని విద్యాభ్యాసానికైతే 12.5 శాతం నుంచి 12.75 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాం. అదే విదేశాల్లోని వర్సిటీల్లో అయితే వడ్డీ రేటు 12.75 శాతం నుంచి ప్రారంభమై 14 శాతం వరకు ఉంటుంది. ఐఐఐటీ, ఐఎస్బీ, ఐఐటీ మద్రాస్ వంటి పేరొందిన వర్సిటీలు గుర్తించిన విద్యా సంస్థల్లో విద్యకైతే ఎలాంటి జామీను లేకుండా రుణాలను మంజూరు చేస్తున్నాం. అదే మన దేశంలోని ఇతర విద్యా సంస్థల్లో అయితే రూ.5 లక్షల విద్యారుణానికి తల్లిదండ్రుల వేతనాన్ని హామీగా పెట్టాల్సి ఉంటుంది. అదే విదేశాల్లోని వర్శిటీల్లో అయితే స్థిరాస్తులను జామీనుగా ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వివరించారు. అలాగే జీమ్యాట్, టోఫెల్ పరీక్షల్లో స్కోరు ఆధారంగా రుణాలను మంజూరు చేస్తామని తెలియజేశారు. -
భువిలో వైకుంఠం.. ఆంగ్‌కోర్‌వాట్ దేవాలయం
విదేశీ పుణ్యక్షేత్ర సందర్శనం అత్యంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. అక్కడి భాష, సాంఘిక అలవాట్లు, కట్టుబాట్లు తెలియక చాలామంది వెళ్లాలని బలమైన కోరిక ఉన్నా వెనుకంజ వేస్తుంటారు. సామాన్యుడికి సైతం ఈ ఆలయ సందర్శనం సులభం కావాలనే లక్ష్యంతో ట్రావెల్ ఛాయిస్ ఇంటర్నేషనల్ ఎం.డి. శ్రీ సంకురాత్రి బాల వెంకటేశ్వరరావుగారు, విదేశీ హిందూ దేవాలయాల సందర్శనకు ‘వరల్డ్ వైడ్ హిందూ’ అనే పేరిట ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసి ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. భువిలో వైకుంఠాన్ని తలపించే ఆలయాన్ని మీరెప్పుడైనా చూశారా? ఆ ఆలయం కంబోడియాలో ఉంది. కంబోడియాలో తొమ్మిదో శతాబ్దిలో కేవలం 35 ఏళ్ల వ్యవధిలో నిర్మించిన వైకుంఠవాసుని దివ్యధామమైన ‘ఆంగ్కోర్ వాట్’ దేవాలయం విశేషాలను తెలుసుకుందాం. ఒకప్పుడు కాంబోడియాను కాంభోజ దేశంగా పిలిచేవారు. యూరోపియన్ల ప్రభావంతో దీని పేరు కంపూచియాగా, కంబోడియాగా మారింది. కంబోడియాలోని ‘ఆంగ్కోర్ వాట్’ మహావిష్ణు ఆలయం ఒక మహాద్భుతం. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణాన్ని తలపెట్టిన రాజు రెండవ సూర్యవర్మ. అతని మరణంలోగా ఆలయ నిర్మిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెప్పారు. వెంటనే ఆయన ఆలయ నిర్మాణం చేపట్టాడు. ముందుగా ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు. ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్’ రాళ్లను ఎంపిక చేశారు. వాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు. పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు. ఈ ఆలయంలో 1,352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్’ పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. పశ్చిమ ముఖద్వారం గల ఈ ఆలయం ముఖద్వారం నుంచే మూడు పెద్దపెద్ద గోపురాలు కనిపిస్తాయి. టోనెల్సాన్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని పలు దేవాలయాల సముదాయం ఆహ్లాదభరితంగా ఉంటుంది. తర్వాతి కాలంలో ఈ ఆలయం తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఇది తిరిగి వెలుగు చూసింది. కంబోడియా జాతీయ పతాకంపై ‘ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయ చిత్రం ఉంటుందంటే, ఆ దేశం ఈ ఆలయానికి ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించిన సూర్యవర్మ మరణానంతరం తన అస్థికలను ఒక పేటికలో ఉంచాలని ఆదేశించాడట. తన మరణానంతరం అలా చేయగానే ఆయన మోక్షం పొందాడనేందుకు సూచనగా విష్ణుమూర్తి విగ్రహం కళ్లు తెరిచిందట. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన దివ్యధామం ‘ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయం. ఆంగ్‌కోర్‌వాట్’ ఆలయం Ph: 8143000999, 040 67461999 SMS: HOLIDAY WWH to 56677 -
మెట్రోకు విదేశీ తలుక్
కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్ పట్టాలు అడుగడుగునా విదేశీ హంగులు సాక్షి, సిటీ బ్యూరో: కొరియా కోచ్‌లు.. శ్యామ్‌సంగ్ హంగులు... ఫ్రాన్స్ పట్టాలు.. నగర మెట్రో ప్రాజెక్ట్‌లో ప్రతిదీ విశేషమే. అన్ని వర్గాల వారికీ మన మెట్రో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విదేశీ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను సంతరించుకుంది. దేశ విదేశాల్లో పేరొందిన సంస్థ లు మెట్రో ప్రాజెక్ట్‌లో మేము సైతం అన్నట్టుగా కీలక పనులు చేపడుతున్నా యి. మరికొన్ని అవసరమైన విడి భాగాలను సరఫరా చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రముఖ సంస్థలు సాంకేతిక, డిజైనింగ్, సేవలు, నిర్మాణం, ప్రణాళిక, నిర్వహణ, కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నాయి. వీటన్నింటిలో పాలు పంచుకుంటున్న దేశ విదేశాలకు చెందిన పేరెన్నికగన్న సంస్థల వివరాలివే.. కొరియా కోచ్‌లు దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ఒక్కో బోగీ ఖరీదు రూ.10 కోట్లు. ఇప్పటివరకు నాలుగు మెట్రో రైళ్లు ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. మరో మూడు త్వరలో కొరియా నుంచి నగరానికి చేరనున్నాయి. మొత్తంగా ఈ సంస్థ మెట్రో ప్రాజెక్ట్‌కు 2017 నాటికి సుమారు 171 బోగీలు(57రైళ్లు-ఒక్కో రైలుకు 3 బోగీలు)ను దశల వారీగా సరఫరా చేయనుంది. శ్యామ్సంగ్డేటా సిస్టమ్స్: కొరియాకు చెందిన ఈ సంస్థ మెట్రో రైలు స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన డిజైన్, విడిభా గాల తయారీ, సరఫరా, పరీక్షలను నిర్వహించనుంది. పార్సన్స్ బ్రింకర్‌హాఫ్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఈ సంస్థ మౌలిక వసతుల కల్పన రంగంలోని భారీ ప్రాజెక్ట్‌లకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మెట్రో ప్రాజెక్ట్‌లో సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత ఇంజినీరింగ్ డిజైన్లను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఇది 1885 నుంచి ఈ రంగంలో ఉంది. ఐదు ఖండాలలో సేవలందిస్తోంది. కియోలిస్ ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రజా రవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. మన మెట్రో ప్రాజెక్ట్ నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. హాల్క్రో ఈ సంస్థ మెట్రో ప్రాజెక్ట్ ప్రణాళిక, డిజైన్, నిర్వహణ అంశాల్లో సహకారం అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ పన్నులు, సేవలు, మేనేజ్మెంట్ విభాగాల్లో విలువైన సూచనలు, సలహాలు అందించడంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెట్రో ప్రాజెక్ట్‌లో కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తున్నందుకు సంస్థకు వచ్చే కార్భన్క్రెడిట్స్ (పర్యావరణ రాయితీలు)ను లెక్కగడుతుంది. ఏఈకామ్ యూరప్‌కు చెందిన ఈ కంపెనీ సాంకేతిక, యాజ మాన్య సేవలు అందిస్తోంది. పర్యావరణ, ఇంధనం, మంచినీరు, మౌలిక వసతుల విషయంలో మెట్రో ప్రాజెక్ట్‌కు సలహాలు అందిస్తోంది. లూయిస్‌బెర్జర్ అమెరికాకు చెందిన ఈ సంస్థ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో మనకు సహకారం అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో సేవలందిస్తోంది. ఓటీఐఎస్ నగరంలోని ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న 260 లిఫ్టులను, 410 ఎస్కలేటర్లను ఈ సంస్థ సరఫరా చేస్తోంది. చైనాకు చెందిన ఈ కంపెనీ నగర మెట్రో ప్రాజెక్టులో సుమారు రూ.400 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది. ఆర్థిక సహకారం ఇలా.. దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడుతున్న మెట్రో ప్రాజెక్ట్‌కు ఎల్అండ్టీ సంస్థ సుమారు రూ.3500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో రూ.11,500 కోట్లను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, సిండికేట్ బ్యాంక్‌ల నుంచి రుణంగా సేకరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.1458 కోట్లు ఖర్చు చేస్తోంది. భూసేకరణ, ఇతర వసతుల కల్పనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. ఫ్రాన్స్ పట్టాలు ఆకాశమార్గం (ఎలివేటెడ్) పట్టాలను ఫ్రాన్స్‌కు చెందిన రైల్స్, టాటా స్టీల్ (ఫ్రాన్స్‌లోని విభాగం) సంస్థ సరఫరా చేస్తోంది. సముద్ర మార్గంలో మొదట ముంబయికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్, మియాపూర్ డిపోలకు చేరుకుంటున్నాయి. మొత్తం మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్ నుంచి 22,500 మెట్రిక్ టన్నుల పట్టాలను దిగుమతి చేసుకోవడం విశేషం. -
గ్లాస్ టైల్స్.. హల్చల్
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అని ఆత్రేయ ఏ టైంలో అన్నాడో కానీ, వ్యాపారులు దానికి కాస్త టెక్నాలజీ జోడించి వింతలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు టైల్స్ అంటే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయనే వరకే మనకు తెలుసు. కానీ, డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ మాత్రం అక్కడికే పరిమితం కావట్లేదు. అద్దంలా మారుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. పూర్తిగా గ్లాస్‌తో తయారవడమే డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ప్రత్యేకత. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం మరో ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్‌మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌజ్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. వీటిలో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో లభ్యమవుతున్నాయి. ధర విషయానికొస్తే చ.అ.కు రూ.800-1,600 వరకు ఉంది. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి. జీవీటీ, పీజీవీటీ వంటి టైల్స్ కూడా: సాధారణంగా చాలా మంది బేసిక్ విట్రిఫైడ్ టైల్స్‌ను వాడుతుంటారు. వీటి ధర రూ.40-50 మధ్య ఉంటుంది. అయితే వీటిని షాపింగ్ మాళ్లలో వాడలేం. ఎందుకంటే కొంతకాలానికి ఈ టైల్స్‌పై ఉండే లేయర్స్ తొలగిపోతాయి. పాదాల ముద్రలూ పడతాయి. అందుకే దీని స్థానంలో డబుల్ చార్జ్ టైల్స్‌ను వాడుతున్నారు. ఈ టైల్స్ పైన 2 ఎంఎం-3 ఎంఎం కోటింగ్ ఉంటుంది. దీంతో టైల్స్ అందంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నగరంలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ (జీవీటీ), పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్ (పీజీవీటీ) హల్చల్ చేస్తున్నాయి. అన్ని రకాల రంగుల్లో లభ్యమయ్యే వీటిని వాణిజ్య సముదాయాలు, ఆఫీసులు, షాపింగ్ మాళ్లలో వినియోగించుకోవచ్చు. జీవీటీలో 600/600 ఎంఎం నుంచి మీటర్/ మీటర్ సైజు వరకున్నాయి. వీటి ధరలు ఆయా సైజులను బట్టి చ.అ.కు రూ.60- రూ.170 వరకున్నాయి. ఎక్కువ విస్తీర్ణం ఉండే బ్యాంక్వెట్ హాళ్లు, రెస్టారెంట్లలో వీటిని వాడతారు. బాత్రూమ్, బాల్కనీ వంటి తక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకమైన టైల్స్ కూడా ఉన్నాయి. వీటి ధర చ.అ.కు రూ.30-45 మధ్య ఉంది. విదేశీ టైల్స్ కూడా: స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వాల్ టైల్స్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. మన దేశంలో ఉండే 600/600 ఎంఎం టైల్ బరువు సుమారుగా 7.5 కిలోలుంటే.. ఇటాలియన్ టైల్ అయితే దాదాపు 10 కిలోలుంటుంది. ఇవి బరువులోనే కాదు దృఢత్వంలోనూ పటిష్టమైనవి. గుజరాత్లో 300కు పైగా టైల్స్ తయారీ పరిశ్రమలున్నాయి. అదే మన దగ్గరైతే విజయవాడ, సామర్లకోట వంటి సుమారు 5 ప్రాంతాల్లోనే టైల్స్ తయారీ యూనిట్లున్నాయి. గతేడాది రూ.10.5 కోట్లను సాధించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఈ ఏడాది 15 కోట్లకు చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
విదేశీ విద్య.. తప్పుల ముప్పు తప్పేదెట్లా
టాప్ స్టోరీ: ఉద్యోగ మార్కెట్లో ఫారెన్ డిగ్రీకి ఉన్న డిమాండ్.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. బ్యాంకులు సైతం సులువుగా రుణాలను మంజూరు చేస్తుండటం.. వంటి సానుకూల పరిస్థితుల కారణంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే హైదరాబాద్ విద్యార్థుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొన్ని పొరపాట్ల వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. విదేశీ వర్సిటీకి మార్గాన్ని మూసేస్తున్న దరఖాస్తుల్లో పొరపాట్లపై ఫోకస్.. ఇటీవలి గణాంకాలను పరిశీలిస్తే.. మూడింట రెండొంతుల మంది భారతీయ విద్యార్థుల విదేశీ వర్సిటీ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇదే ధోరణి హైదరాబాద్ విద్యార్థుల విషయంలోనూ కనిపిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాలు దరఖాస్తులను తిరస్కరించడానికి గల కారణాల్లో ముఖ్యమైనది దరఖాస్తు అసంపూర్తిగా ఉండటం, నిర్దేశించిన ధ్రువపత్రాలను దరఖాస్తుతోపాటు పంపకపోవడాన్ని విశ్వవిద్యాలయాలు తీవ్రంగా పరిగణించి, అలాంటి వాటిని తిరస్కరిస్తున్నాయి. అందువల్ల ఔత్సాహిక విద్యార్థులు విశ్వవిద్యాలయం పేర్కొన్న అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా దరఖాస్తుతోపాటు జతపరిచి పంపించాలి. సమగ్రంగా మార్కుల చిట్టాలు విశ్వవిద్యాలయాలకు అర్హతలకు సంబంధించి కేవలం డిగ్రీ సర్టిఫికెట్‌ను మాత్రమే కాకుండా.. సెమిస్టర్ల వారీగా మార్కుల ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాలి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన మార్కుల పూర్తి వివరాలను పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు, పరపతి లేఖ ధ్రువీకరణ పత్రాలతో పాటు తప్పనిసరిగా పంపించాల్సింది దరఖాస్తు ఫీజు. చాలామంది విద్యార్థులు చేస్తున్న మరో పొరపాటు పరపతి లేఖ(సాల్వెన్సీ లెటర్) పంపకపోవడం. విద్యార్థి పేరిట ఉన్న లిక్విడ్ ఫండ్స్‌కు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ బ్యాంకులు ఇచ్చే లేఖే పరపతి లేఖ. ఉపకార వేతనంతో విదేశీ యూనివర్సిటీలో చదివే అవకాశం వచ్చింది కాబట్టి, పరపతి లేఖను సమర్పించాల్సిన అవసరం లేదని విద్యార్థులు భావిస్తుంటారు. ఇది సరికాదు. విదేశాల్లో వంద శాతం స్కాలర్‌షిప్‌తో చదివే అవకాశం వచ్చినా, ఈ లేఖను తప్పనిసరిగా సమర్పించాల్సిందే. విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతంలో నివసించేందుకు, చదువుతున్న కాలంలో ఇతర ఖర్చులను విద్యార్థి భరించగలడనేదానికి కొల్లేటరల్ రుజువుగా పరపతి లేఖను విశ్వవిద్యాలయం పరిగణిస్తుంది. విద్యా రుణాలు చాలామంది విద్యార్థులు తమ విదేశీ విద్యకు అవసరమైన మొత్తం ఖర్చును బ్యాంకులు రుణాల రూపంలో ఇస్తాయని భావిస్తారు. కానీ, సాధారణంగా బ్యాంకులు చదువుకయ్యే మొత్తం ఖర్చులో 2/3 వంతు మొత్తాన్ని మాత్రమే రుణాలుగా ఇస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, దరఖాస్తు చేసుకోవాలి. విదేశాల్లో విద్యాభ్యాసానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆయా విశ్వవిద్యాలయాలు విద్యా రుణాలను కూడా ఇప్పిస్తాయేమో కనుక్కోవాలి. మంచి పేరున్న విశ్వవిద్యాలయాల్లో స్కాలర్షిప్లు, గ్రాంట్స్ కూడా లభిస్తాయి. అలాంటి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి. తక్కువ పదాల్లో, అర్థవంతంగా విదేశాల్లోని చాలా యూనివర్సిటీలు దరఖాస్తుతో పాటు పర్సనల్ స్టేట్మెంట్లు లేదా కామన్ ఎస్సేలను తప్పనిసరి చేశాయి. విద్యార్థి సమర్పించే ఈ సాధారణ వ్యాసం ఆధారంగా విద్యార్థి స్థితిగతులను యూనివర్సిటీ ప్రవేశాల కౌన్సెలర్ అంచనా వేస్తారు. విద్యార్థికి వర్సిటీలో ప్రవేశం కల్పించవచ్చా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. విద్యార్థి ఈ వ్యాసం ద్వారా తనను తాను నిజాయితీగా ఆవిష్కరించుకోవాలి. చాలామంది విద్యార్థులు ఎస్సే నిడివి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని భావిస్తారు. ఇది తప్పు. భావయుక్తంగా, క్లుప్తంగా ఉంటే సరిపోతుంది.