సంప్రదాయ కోర్సులకూ రుణాలు! | Loans to both traditional courses! | Sakshi
Sakshi News home page

సంప్రదాయ కోర్సులకూ రుణాలు!

Published Sun, Feb 22 2015 2:58 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

సంప్రదాయ కోర్సులకూ రుణాలు! - Sakshi

సంప్రదాయ కోర్సులకూ రుణాలు!

విదేశీ వర్సిటీల్లో చదువులకూ మంజూరు
- అవాన్స్, క్రెడీలా పేర్లతో విద్యారుణాలు
- కొత్త రూట్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్, హెచ్‌డీఎఫ్‌సీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు రుణాలు అంత తేలికేమీ కాదు. అందులోనూ విద్యా రుణాలైతే మరీను. పేరున్న వర్సిటీల్లో పాపులర్ కోర్సులైన ఇంజనీరింగో, మెడిసిన్‌నో లేక మేనేజ్‌మెంట్ కోర్సో చదివే విద్యార్థులకు మాత్రమే రుణాలు లభిస్తుంటాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా ఆ కోర్సు పూర్తి చేశాక సదరు అభ్యర్థికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాన్ని ఆధారం చేసుకునే రుణాలిచ్చేది.

అందుకే సంప్రదాయ కోర్సులైన సంగీతం, ఫొటోగ్రఫీ, నృత్యం వంటి కోర్సులు చదివే వారికి రుణాలు కావాలంటే కాస్తంత ఇబ్బంది తప్పదు. అయితే మన దేశంలో ఇలాంటి సంప్రదాయ కోర్సుల ఫీజులు తక్కువే. కాబట్టి మరీ ఇబ్బంది ఉండదు. కానీ విదేశీ వర్సిటీల్లో ఇలాంటి కోర్సులు చదవాలంటే మాత్రం కష్టం. అయితే ఇలాంటివన్నీ అర్థం చేసుకున్న బ్యాంకులు కొన్ని ఈ కోర్సులకూ రుణాలిచ్చేలా కొత్త పథకాలు ఆరంభిస్తున్నాయి. అలాంటి వారికీ రుణాలు లభిస్తున్నాయి.
 
మార్కెట్ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు రూ.80 వేల కోట్ల వరకూ వెచ్చిస్తున్నారు. ఈ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధితో అంతకంతకూ దూసుకెళుతోంది. దీన్లో విద్యారుణం తీసుకొని ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి వాటా దాదాపు 15 శాతంగా ఉంది. నిజానికిపుడు పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకోవటమనేది తగ్గింది. ఉన్నత  విద్య రుణం కోసం నేరుగా విద్యార్థులే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌ను చూసిన ప్రయివేటు ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి.
 
అవాన్స్, క్రెడీలా రుణాలు..
అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలైన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్), హెచ్‌డీఎఫ్‌సీలు మేనేజ్‌మెంట్ కోర్సులతో పాటు సంప్రదాయ కోర్సులైన ఫొటోగ్రఫీ, సంగీతం, నృత్యం, డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులకూ విద్యారుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాల కోసం డీహెచ్‌ఎఫ్‌ఎల్ ‘అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఈ రుణాల కోసం ‘క్రె డీలా’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఆయా రుణాలను కేవలం కోర్సు ఫీజులకే పరిమితం చేయకుండా రుణానికి అర్హుడైన విద్యార్థి చదువు పూర్తయ్యేంత వరకు అవసరమయ్యే ఖర్చు, రవాణా చార్జీలను కూడా రుణంలో భాగంగానే మంజూరు చేస్తున్నాయి.
 
వర్సిటీ, దేశాన్ని బట్టి వడ్డీ రేట్లు..
సంప్రదాయ కోర్సుల విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు... విద్యార్థులు ఎంచుకునే వర్సిటీ, దేశం ఆధారంగా మారుతూ ఉంటాయని హైదరాబాద్‌లోని ‘అవాన్స్’ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధికారి ఒకరు ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధితో చెప్పారు. ‘‘దేశీయంగా గుర్తింపు పొందిన వర్సిటీల్లోని విద్యాభ్యాసానికైతే 12.5 శాతం నుంచి 12.75 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాం. అదే విదేశాల్లోని వర్సిటీల్లో అయితే వడ్డీ రేటు 12.75 శాతం నుంచి ప్రారంభమై 14 శాతం వరకు ఉంటుంది.

ఐఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐటీ మద్రాస్ వంటి పేరొందిన వర్సిటీలు గుర్తించిన విద్యా సంస్థల్లో విద్యకైతే ఎలాంటి జామీను లేకుండా రుణాలను మంజూరు చేస్తున్నాం. అదే మన దేశంలోని ఇతర విద్యా సంస్థల్లో అయితే రూ.5 లక్షల విద్యారుణానికి తల్లిదండ్రుల వేతనాన్ని హామీగా పెట్టాల్సి ఉంటుంది. అదే విదేశాల్లోని వర్శిటీల్లో అయితే స్థిరాస్తులను జామీనుగా ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వివరించారు. అలాగే జీమ్యాట్, టోఫెల్ పరీక్షల్లో స్కోరు ఆధారంగా రుణాలను మంజూరు చేస్తామని తెలియజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement