భారత ప్రభుత్వ అత్యున్నత విద్యా సంస్థల ఆసక్తి
దుబాయ్‌లో ఐఐఎఫ్‌టీ క్యాంపస్
విదేశాల్లో ఇప్పటికే పది ప్రైవేటు వర్సిటీ క్యాంపస్‌లు
భారత్‌లో 2025 నుంచి విదేశీ వర్సిటీ కార్యకలాపాలు
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
2021 నుంచి అడుగులు...!
విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు.
ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.
ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.
విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు
1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.
2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది.
3. ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది.
4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది.
5. ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్‌ఆర్‌ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.
6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది.
7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది.
8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది.
9. జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది.
10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది.
భారత్‌లోనూ విదేశీ క్యాంపస్‌లు
ఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది.
తమ క్యాంపస్‌ను గుర్గావ్‌లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి.
టాప్–10లో స్థానమే లక్ష్యం..
చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి.
మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment