గ్లాస్ టైల్స్.. హల్‌చల్ | wonders with glass tiles | Sakshi
Sakshi News home page

గ్లాస్ టైల్స్.. హల్‌చల్

Published Sat, Aug 9 2014 3:41 AM | Last Updated on Thu, Oct 4 2018 8:13 PM

గ్లాస్ టైల్స్.. హల్‌చల్ - Sakshi

గ్లాస్ టైల్స్.. హల్‌చల్

సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అని ఆత్రేయ ఏ టైంలో అన్నాడో కానీ, వ్యాపారులు దానికి కాస్త టెక్నాలజీ జోడించి వింతలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు టైల్స్ అంటే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయనే వరకే మనకు తెలుసు. కానీ, డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ మాత్రం అక్కడికే పరిమితం కావట్లేదు. అద్దంలా మారుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

 ఇంకా ఏమన్నారంటే..
 పూర్తిగా గ్లాస్‌తో తయారవడమే డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ప్రత్యేకత. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం మరో ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్‌మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌజ్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు.

     డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. వీటిలో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో లభ్యమవుతున్నాయి. ధర విషయానికొస్తే చ.అ.కు రూ.800-1,600 వరకు ఉంది. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి.
 జీవీటీ, పీజీవీటీ వంటి టైల్స్ కూడా: సాధారణంగా చాలా మంది బేసిక్ విట్రిఫైడ్ టైల్స్‌ను వాడుతుంటారు. వీటి ధర రూ.40-50 మధ్య ఉంటుంది. అయితే వీటిని షాపింగ్ మాళ్లలో వాడలేం. ఎందుకంటే కొంతకాలానికి ఈ టైల్స్‌పై ఉండే లేయర్స్ తొలగిపోతాయి. పాదాల ముద్రలూ పడతాయి.

అందుకే దీని స్థానంలో డబుల్ చార్జ్ టైల్స్‌ను వాడుతున్నారు. ఈ టైల్స్ పైన 2 ఎంఎం-3 ఎంఎం కోటింగ్ ఉంటుంది. దీంతో టైల్స్ అందంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నగరంలో గ్లేజ్‌డ్ విట్రిఫైడ్ టైల్స్ (జీవీటీ), పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్ (పీజీవీటీ) హల్‌చల్ చేస్తున్నాయి. అన్ని రకాల రంగుల్లో లభ్యమయ్యే వీటిని వాణిజ్య సముదాయాలు, ఆఫీసులు, షాపింగ్ మాళ్లలో వినియోగించుకోవచ్చు.

      జీవీటీలో 600/600 ఎంఎం నుంచి మీటర్/ మీటర్ సైజు వరకున్నాయి. వీటి ధరలు ఆయా సైజులను బట్టి చ.అ.కు రూ.60- రూ.170 వరకున్నాయి. ఎక్కువ విస్తీర్ణం ఉండే బ్యాంక్వెట్ హాళ్లు, రెస్టారెంట్లలో వీటిని వాడతారు. బాత్‌రూమ్, బాల్కనీ వంటి తక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకమైన టైల్స్ కూడా ఉన్నాయి. వీటి ధర చ.అ.కు రూ.30-45 మధ్య ఉంది.

 విదేశీ టైల్స్ కూడా: స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వాల్ టైల్స్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. మన దేశంలో ఉండే 600/600 ఎంఎం టైల్ బరువు సుమారుగా 7.5 కిలోలుంటే.. ఇటాలియన్ టైల్ అయితే దాదాపు 10 కిలోలుంటుంది. ఇవి బరువులోనే కాదు దృఢత్వంలోనూ పటిష్టమైనవి. గుజరాత్‌లో 300కు పైగా టైల్స్ తయారీ పరిశ్రమలున్నాయి. అదే మన దగ్గరైతే విజయవాడ, సామర్లకోట వంటి సుమారు 5 ప్రాంతాల్లోనే టైల్స్ తయారీ యూనిట్లున్నాయి. గతేడాది రూ.10.5 కోట్లను సాధించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఈ ఏడాది 15 కోట్లకు చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement