Crystal Glass Tiles
-
తాజ్‌మహల్‌లో తెలంగాణ రాళ్లు!
సాక్షి, హైదరాబాద్ : పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్‌మహల్‌ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోరి్నయాలోని విఖ్యాత జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా నాలుగైదేళ్లలో విడతలవారీగా వచ్చి అధ్యయనం చేపట్టారు. పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు.. ఇవి కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు అధ్యయనానికి వచ్చారు. అలా జరిగిన వారి అధ్యయనం ద్వారానే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు పనిలోపనిగా మన దేవరకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చిన రాళ్లనూ మోశారని వెలుగు చూసింది. పర్చిన్కారీ పద్ధతిలో.. పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన నగిషిలను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకు పర్చిన్‌కారి పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్‌లలో పుటిన పియెట్రా డ్యురాకు కాస్త దగ్గరి పోలికుండే ఈ పర్చిన్‌కారి కళ 16వ శతాబ్దంలో భారత్‌లో అభివృద్ధి చెందింది. ముందుగా పాలరాతిపై ఆ ఆకృతిని గీసి దాని ప్రకారం రాయిని కట్ చేశారు. అదే ఆకృతిలో రంగురాళ్లును అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించాక, పాలరాయిని కట్ చేసిన భాగంలో పొదిగారు. దీంతో ఆ డిజైన్ రాయిలో భాగమనే భ్రమ కలిగిస్తోంది. అలా తాజ్‌మహల్ కట్టడంలో పాలరాతిలో ఇలాంటి ఎన్నో ఆకృతులు ఒదిగిపోయాయి. వాటిల్లో మన తెలంగాణ ప్రాంత రాళ్లు కూడా చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇంకొన్ని రాళ్లను పియెట్రా డ్యురా పద్ధతిలో పాలరాతిపై ప్రత్యేక జిగురుతో అతికించి కళాత్మకంగా ఆకృతులద్దారు. పలుగురాయిలో భాగమే.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగురాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ (పారదర్శకంగా) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్ట్జ్గా పేర్కొంటారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల నగిషిల్లో వినియోగిస్తారు.మన రాళ్లే ఎందుకు?.. తాజ్ కట్టడం గోడలపై పాలరాయి పరుచుకుంది. కానీ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ వంశీయులు ఆ పాలరాతి మీదుగా పూలతో కూడిన లతలు అల్లుకున్న అనుభూతిని కలిగించాలనుకున్నారు. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు.. ఇలా అన్నింటినీ ఈ నగిషిలకు వాడాలని నిర్ణయించి వాటికి ప్రపంచంలో ఏయే ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించారు. ఆయా దేశాలను గాలించి వాటిల్లో మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో వాడారు. అలా వాడే విలువైన రాళ్ల జాబితాలో క్రిస్టల్ క్వార్ట్జ్ (ఓ రకమైన స్పటికం) కూడా ఒకటి. వాటికి ఏ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయో గాలిస్తే.. గోల్కొండ మైన్ అనే సమాధానం వచ్చిoది. కృష్ణా నదీ తీరాన్ని ఆసరా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించాయి. ఇది వజ్రాలతోపాటు క్రిస్టల్ క్వార్ట్ జ్ కూడా ప్రసిద్ధే. అయితే ఇది ఆ గనుల ఆమూలాగ్రంలో లభించదు. మేలిమి రాళ్లు ప్రస్తుత దేవరకొండ, మహబూబ్నగర్లలోనే దొరికేవి. దీంతో ఈ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను తెప్పించారన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న విషయం. నాణ్యత ఆధారంగా చూస్తే ఈ ప్రాంతానివే.. తాజ్మహల్లోని రాళ్లలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్‌నగర్ పరిసరాలే. మేలిమి రాళ్లను సేకరించిన షాజహాన్.. ఈ రాళ్ల విషయంలోనూ నాణ్యమైనవే గుర్తించారు. అప్పటి వర్తకంలో కీలకంగా ఉన్న ప్రాంతాల నుంచే సేకరించినందున అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
గ్లాస్ టైల్స్.. హల్చల్
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అని ఆత్రేయ ఏ టైంలో అన్నాడో కానీ, వ్యాపారులు దానికి కాస్త టెక్నాలజీ జోడించి వింతలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు టైల్స్ అంటే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయనే వరకే మనకు తెలుసు. కానీ, డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ మాత్రం అక్కడికే పరిమితం కావట్లేదు. అద్దంలా మారుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. పూర్తిగా గ్లాస్‌తో తయారవడమే డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ప్రత్యేకత. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం మరో ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్‌మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌజ్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. వీటిలో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో లభ్యమవుతున్నాయి. ధర విషయానికొస్తే చ.అ.కు రూ.800-1,600 వరకు ఉంది. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి. జీవీటీ, పీజీవీటీ వంటి టైల్స్ కూడా: సాధారణంగా చాలా మంది బేసిక్ విట్రిఫైడ్ టైల్స్‌ను వాడుతుంటారు. వీటి ధర రూ.40-50 మధ్య ఉంటుంది. అయితే వీటిని షాపింగ్ మాళ్లలో వాడలేం. ఎందుకంటే కొంతకాలానికి ఈ టైల్స్‌పై ఉండే లేయర్స్ తొలగిపోతాయి. పాదాల ముద్రలూ పడతాయి. అందుకే దీని స్థానంలో డబుల్ చార్జ్ టైల్స్‌ను వాడుతున్నారు. ఈ టైల్స్ పైన 2 ఎంఎం-3 ఎంఎం కోటింగ్ ఉంటుంది. దీంతో టైల్స్ అందంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నగరంలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ (జీవీటీ), పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్ (పీజీవీటీ) హల్చల్ చేస్తున్నాయి. అన్ని రకాల రంగుల్లో లభ్యమయ్యే వీటిని వాణిజ్య సముదాయాలు, ఆఫీసులు, షాపింగ్ మాళ్లలో వినియోగించుకోవచ్చు. జీవీటీలో 600/600 ఎంఎం నుంచి మీటర్/ మీటర్ సైజు వరకున్నాయి. వీటి ధరలు ఆయా సైజులను బట్టి చ.అ.కు రూ.60- రూ.170 వరకున్నాయి. ఎక్కువ విస్తీర్ణం ఉండే బ్యాంక్వెట్ హాళ్లు, రెస్టారెంట్లలో వీటిని వాడతారు. బాత్రూమ్, బాల్కనీ వంటి తక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకమైన టైల్స్ కూడా ఉన్నాయి. వీటి ధర చ.అ.కు రూ.30-45 మధ్య ఉంది. విదేశీ టైల్స్ కూడా: స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వాల్ టైల్స్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. మన దేశంలో ఉండే 600/600 ఎంఎం టైల్ బరువు సుమారుగా 7.5 కిలోలుంటే.. ఇటాలియన్ టైల్ అయితే దాదాపు 10 కిలోలుంటుంది. ఇవి బరువులోనే కాదు దృఢత్వంలోనూ పటిష్టమైనవి. గుజరాత్లో 300కు పైగా టైల్స్ తయారీ పరిశ్రమలున్నాయి. అదే మన దగ్గరైతే విజయవాడ, సామర్లకోట వంటి సుమారు 5 ప్రాంతాల్లోనే టైల్స్ తయారీ యూనిట్లున్నాయి. గతేడాది రూ.10.5 కోట్లను సాధించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఈ ఏడాది 15 కోట్లకు చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.