దేవరకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోని క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను పాలరాతిలో పొదిగినట్లు గుర్తింపు
కాలిఫోర్నియాకు చెందిన పలువురు నిపుణుల అధ్యయనంలో వెలుగులోకి ..
సాక్షి, హైదరాబాద్ : పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్‌మహల్‌ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోరి్నయాలోని విఖ్యాత జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్‌లు కూడా నాలుగైదేళ్లలో విడతలవారీగా వచ్చి అధ్యయనం చేపట్టారు.
పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు.. ఇవి కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు అధ్యయనానికి వచ్చారు. అలా జరిగిన వారి అధ్యయనం ద్వారానే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు పనిలోపనిగా మన దేవరకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చిన రాళ్లనూ మోశారని వెలుగు చూసింది.
పర్చిన్‌కారీ పద్ధతిలో..
పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన నగిషిలను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకు పర్చిన్‌కారి పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్‌లలో పుటిన పియెట్రా డ్యురాకు కాస్త దగ్గరి పోలికుండే ఈ పర్చిన్‌కారి కళ 16వ శతాబ్దంలో భారత్‌లో అభివృద్ధి చెందింది. ముందుగా పాలరాతిపై ఆ ఆకృతిని గీసి దాని ప్రకారం రాయిని కట్ చేశారు.
అదే ఆకృతిలో రంగురాళ్లును అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించాక, పాలరాయిని కట్ చేసిన భాగంలో పొదిగారు. దీంతో ఆ డిజైన్ రాయిలో భాగమనే భ్రమ కలిగిస్తోంది. అలా తాజ్‌మహల్ కట్టడంలో పాలరాతిలో ఇలాంటి ఎన్నో ఆకృతులు ఒదిగిపోయాయి. వాటిల్లో మన తెలంగాణ ప్రాంత రాళ్లు కూడా చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇంకొన్ని రాళ్లను పియెట్రా డ్యురా పద్ధతిలో పాలరాతిపై ప్రత్యేక జిగురుతో అతికించి కళాత్మకంగా ఆకృతులద్దారు.
పలుగురాయిలో భాగమే..
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగురాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ (పారదర్శకంగా) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్ట్‌జ్‌గా పేర్కొంటారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల నగిషిల్లో వినియోగిస్తారు.
మన రాళ్లే ఎందుకు?..
తాజ్ కట్టడం గోడలపై పాలరాయి పరుచుకుంది. కానీ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ వంశీయులు ఆ పాలరాతి మీదుగా పూలతో కూడిన లతలు అల్లుకున్న అనుభూతిని కలిగించాలనుకున్నారు. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు.. ఇలా అన్నింటినీ ఈ నగిషిలకు వాడాలని నిర్ణయించి వాటికి ప్రపంచంలో ఏయే ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించారు.
ఆయా దేశాలను గాలించి వాటిల్లో మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో వాడారు. అలా వాడే విలువైన రాళ్ల జాబితాలో క్రిస్టల్ క్వార్ట్‌జ్ (ఓ రకమైన స్పటికం) కూడా ఒకటి. వాటికి ఏ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయో గాలిస్తే.. గోల్కొండ మైన్ అనే సమాధానం వచ్చిoది. కృష్ణా నదీ తీరాన్ని ఆసరా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించాయి.
ఇది వజ్రాలతోపాటు క్రిస్టల్ క్వార్ట్ జ్ కూడా ప్రసిద్ధే. అయితే ఇది ఆ గనుల ఆమూలాగ్రంలో లభించదు. మేలిమి రాళ్లు ప్రస్తుత దేవరకొండ, మహబూబ్‌నగర్‌లలోనే దొరికేవి. దీంతో ఈ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను తెప్పించారన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న విషయం.
నాణ్యత ఆధారంగా చూస్తే ఈ ప్రాంతానివే..
తాజ్‌మహల్‌లోని రాళ్లలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్‌నగర్ పరిసరాలే. మేలిమి రాళ్లను సేకరించిన షాజహాన్.. ఈ రాళ్ల విషయంలోనూ నాణ్యమైనవే గుర్తించారు. అప్పటి వర్తకంలో కీలకంగా ఉన్న ప్రాంతాల నుంచే సేకరించినందున అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది.
– చకిలం వేణుగోపాలరావు, జీఎస్‌ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
Comments
Please login to add a commentAdd a comment