ఘన చరిత్ర కలిగిన దేవరకొండ ఖిలా
ఎన్నో అద్భుత కళాఖండాలకు ప్రసిద్ధి..
అయినా అభివృద్ధిలో నిర్లక్ష్యం..
పర్యాటక ప్రాంతం అయ్యేదెప్పుడు?
దేవరకొండ ఖిలాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నింటిలో దేవరకొండ కోట తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండ ఖిలాకు సురగిరి అనే పేరుంది. అంటే దేవతల కొండ అని దీని అర్థం.
కోట చుట్టూ ఎనిమిది చోట్ల ఆంజనేయస్వామి రూపాన్ని చెక్కి కోటను అష్ట దిగ్బంధనం చేశారని ప్రతీతి. ఎంతో ప్రాచుర్యం పొందిన దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయినా పాలకులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో నిరాదరణకు గురవుతోంది. – దేవరకొండ
కోట చుట్టూ 360 బురుజులు..
కాలక్రమేణా కోట గోడలు బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తోంది. పది కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్బేధ్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన గోడలు నేటికీ నాటి నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి.
7 గుట్టలను చుట్టుకొని ఉన్న శిలా ప్రాకారంలో 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, కొలనులు, సైనిక నివాసాలు, ధాన్యాగారాలు, సభావేదికలు, ఆలయాలు ఇలా.. ఎన్నో.. ఎన్నెన్నో. ప్రతీ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ పలకరిస్తుంటుంది.
రాజదర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణకుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు, గుర్రాలు వంటి ఆకృతులు ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నాయి. కోట సమీపంలో నరసింహ, ఓంకారేశ్వర, రామాలయం వంటి పురాతన దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి.
పద్మనాయకుల రాజధానిగా..
15వ శతాబ్దంనాటి ఈ కోటకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 700 ఏళ్ల కిందట 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులుగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా దేవరకొండ కీర్తి గడించింది. అనపోతనాయుడు, రెండవ మాదానాయుడి కాలంలో కోట నిర్మాణం జరిగింది.
మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోతనాయుడి వారసులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1236 నుంచి 1486 వరకు పాలన కొనసాగించారు. తర్వాత ఈ కోటను బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు వశం చేసుకున్నారు.
సందర్శకుల తాకిడి..
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిలా (Devarakonda Fort) సందర్శనకు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, విదేశీయులు సైతం కోటను సందర్శించి ఇక్కడి శిల్పకళా సంపదను చూసి ముగ్దులవుతున్నారు.
చదవండి: చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలే
ఇక తొలి ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినాల్లో దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున కోటకు చేరుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కోట సింహద్వారంపై చెక్కబడిన పూర్ణకుంభం చిహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం గమనార్హం.
పర్యాటక ప్రాంతంగా మార్చితే..
ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక. దేవరకొండ ఖిలా గతమెంతో ఘనచరిత్ర కలిగి నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల పట్టణాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయి.
ఈ ఖిలా విశిష్టత సైతం నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజల కోరిక. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖిలా ఆవరణలో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
దేవరకొండ ఖిలాకు చేరుకునేదిలా..
దేవరకొండ ఖిలా హైదరాబాద్‌కు 110 కిలోమీటర్లు, నాగార్జునసాగర్‌కు 45 కి.మీ, నల్లగొండ నుంచి సాగర్‌కు వెళ్లే దారిలో కొండమల్లేపల్లి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సాగర్ నుంచి దేవరకొండకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment