గద్వాల: కవులు.. కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. రాజసానికి నిలువెత్తు నిదర్శనమైన గద్వాల సంస్థానం ఏర్పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం. నిజాం సంస్థానంతోపాటు 1948లో భారత యూనియన్‌లో విలీనమైన గద్వాల సంస్థానంపై సవివర కథనమిది.
నల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భావం
నల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) క్రీస్తుశకం 1663లో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి 1948 వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి 1663–1712 వరకు, తర్వాత కల్లా వెంకటన్న క్రీ.శ. 1712– 1716 వరకు, రమణయ్య క్రీ.శ. 1716– 1723 వరకు, తిమ్మక్క క్రీ.శ. 1723– 1725 వరకు, లింగమ్మ క్రీ.శ. 1725– 1740 వరకు, తిరుమలరావు క్రీ.శ. 1740– 1742 వరకు, మంగమ్మ క్రీ.శ. 1742– 1745 వరకు, చొక్కమ్మ క్రీ.శ. 1745– 1747 వరకు, రామరాయలు క్రీ.శ. 1747– 1761 వరకు, చినసోమభూపాలుడు– 2 క్రీ.శ. 1761– 1794 వరకు, రామభూపాలుడు–1 క్రీ.శ. 1794– 1807 వరకు, సీతారామభూపాలుడు–1 క్రీ.శ. 1807– 1810 వరకు, వెంకటలక్ష్మమ్మ క్రీ.శ. 1840– 1840 (4 నెలలు), సోమభూపాలుడు– 3 క్రీ.శ. 1840– 1844, వెంకటలక్ష్మమ్మ (మరల) క్రీ.శ. 1844–1845, రామభూపాలుడు–2 క్రీ.శ. 1845– 1901 వరకు, సీతారామభూపాలుడు– 2 క్రీ.శ. 1901–1924 వరకు, ఆ తర్వాత చివరి తరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ క్రీ.శ. 1924–1948 వరకు పాలన కొనసాగించారు.
విద్వత్కవులకు పేరు..
గద్వాల సంస్థానం కవులకు పేరుగాంచింది. నలసోమనాద్రి, చినసోమభూపాలుడు, రామభూపాలుడు–2, సీతారామభూపాలుడు–2, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తదితరులు కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనలోనే గద్వాల సంస్థానం విద్వత్కవుల ప్రాంతంగా వరి్ధల్లింది. వీరి పాలనలో సంస్థాన కవులు, సంస్థాన ప్రాంత నివాస కవులు, సంస్థానేతర ఆశ్రిత కవులకు ఆశ్రయమిచ్చి గద్వాల సంస్థాన ప్రాశస్త్యాన్ని నలుమూలలా చాటినట్లు చెబుతారు. ఈ కవులు రచించిన పద్యాలలో చాటు పద్యాలు ప్రత్యేకంగా గుర్తింపు సాధించాయి.
చెక్కుచెదరని నాటి కట్టడాలు
నలసోమనాద్రి కాలం పాలన మొదలుకొని చివరితరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలం వరకు నిర్మించిన వివిధ కట్టడాలు, భవనాలు, బావులు నేటికీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నాటి భవనాలు రాజుల అభిరుచికి, నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ.. చెక్కు చెదరకపోవడం విశేషం.
గద్వాల కోటలో డిగ్రీ కళాశాల, ఆలయం..
రాజులు పాలన సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. కోట లోపలి భాగం చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలిపోగా.. ముఖద్వారం, కోట చుట్టూ భాగాలు నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
చెక్కుచెదరని ఫిరంగి
రాజులు యుద్ధ సమయంలో వినియోగించే ఫిరంగి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ (1725– 1740), (1745– 1747) బావులు గత పాలన చిహ్నాలుగా ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రస్తుత పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఏటా జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావుల్లోనే నిర్వహిస్తారు.
మహారాజా మార్కెట్..
సంస్థానంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదలుకొని.. మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్‌లోనే లభించేవి. రైతులు పండించే పంట ఉత్పత్తులు కూడా ఇక్కడ విక్రయించేవారని చరిత్రకారులు చెబుతారు. మహారాజా మార్కెట్ చిహ్నం చాలా భాగం ధ్వంసమైనప్పటికీ.. దాని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.
కృష్ణారెడ్డి బంగ్లా ప్రత్యేకం
నలసోమనాద్రి నిర్మించిన (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) కోటలోనే రాజవంశీయులు కలిసి జీవించేవారు. అయితే 1924లో సీతారామభూపాలుడు–2 మృతి చెందడంతో.. ఆయన భార్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టారు. సీతారామభూపాలుని సోదరుడు వెంకటకృష్ణారెడ్డికి అప్పటి పాలకులతో మనస్పర్థలు ఏర్పడి.. మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లాను నిర్మించుకున్నారు. ఈయన రాజవంశీయుల చివరితరం పాలనలో రెవెన్యూ, భూ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన ‘కొండవీటిరాజా’ సినిమా షూటింగ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్‌ఈ కార్యాలయం, భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి. గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం, అనంతరం ఏర్పడిన మండల రెవెన్యూ కార్యాలయం కూడా చాలాకాలం పాటు ఇక్కడే కొనసాగింది. రాజావారి బంధువులు నేటికీ ఈ భవనంలోనే జీవనం కొనసాగిస్తుండగా.. మరికొంత భాగంలో ఎంబీ హైసూ్కల్, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. ఎండాకాలం, చలికాలం, వానాకాలంలో కూడా ఒకేరకమైన వాతావరణం ఉండేలా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment