ఏడాదిన్నర క్రితం మహబూబ్‌నగర్ శివారు దివిటిపల్లిలో ప్రారంభం
జీ ప్లస్ 4 భవనం, మౌలిక సదుపాయాలకు రూ.50 కోట్లు ఖర్చు
మొదట్లో 9 ఐటీ కంపెనీలు వచ్చినా.. ప్రస్తుతం రెండింటికే పరిమితం
మొత్తం లక్ష చదరపుటడుగుల విస్తీర్ణంలో 32 కంపెనీలకు అవకాశం
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వెనక్కి వెళ్లిన ఏడు కంపెనీలు
‘సాక్షి’ బృందం పరిశీలనలో పలు అంశాలు వెలుగులోకి..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ శివారు దివిటిపల్లిలో ఏడాదిన్నర క్రితం నిర్మించిన ఐటీ టవర్ ప్రస్తుతం నామమాత్రంగా కొనసాగుతోంది. దీనికి రూ.కోట్లు వెచ్చించి.. స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.. దీనికి ప్రధాన కార ణం ఐటీ కంపెనీలు ఇక్కడికి రాకపోవడమేనని తెలుస్తోంది.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ‘సాక్షి’బృందం గురువారం ఐటీ టవర్‌కు వెళ్లగా వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్‌హెచ్–44కు అతి సమీపంలో ఉన్నా..
జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)కి అతి సమీపంలోని దివిటిపల్లిలో ఐజీ గ్రీన్ కారిడార్ కోసం 2019లోనే 377 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఇందులో సుమారు రూ.50 కోట్లతో నాలుగు ఎకరాలలో (జీ ప్లస్4) ఐటీ టవర్‌కు తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఇందులో మొత్తం లక్ష చదరపుటడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తుల భవనాన్ని అన్ని హంగులతో అత్యాధునిక పద్ధతిలో నిర్మించారు.
ఒక్కొక్క అంతస్తులో 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఎనిమిది ఐటీ కంపెనీల చొప్పున ఉండేలా వదిలారు. దీనికి 2023 మే 6న బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 32 ఐటీ కంపెనీల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎన్‌హెచ్–44 చేరడానికి ప్రత్యేక రోడ్డుతో పాటు 24 గంటల ఇంటర్‌నెట్, విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం ఉంది.
ఈ భవనం చుట్టూ లాన్‌లో పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం.. ఆపై వాహనాల పార్కింగ్ కోసం విశాల స్థలం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభంలో తొమ్మిది ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఉద్యోగులు పనిచేసేవారు. అందరినీ శిక్షణ పేరిట నెలకు రూ.15 వేలనుంచి రూ.20 వేల వరకు ఆయా సంస్థల నిర్వాహకులు నియమించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు వెనక్కి..
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఏడు కంపెనీలు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిపోయాయి. వీటిలో జువెన్ టెక్నాలజీ, హెచ్‌ఆర్‌ఎస్, ఇ–గ్రోవ్ సిస్టమ్స్, ఇంటిట్యూస్, ఫోర్ ఓక్స్, ఐటీవర్షన్–360, అర్పాన్ టెక్ ఉన్నాయి. ఇప్పుడు కేవలం రెండు ఐటీ సంస్థలు మాత్రమే ఉండగా 44 మంది ఉద్యోగులే మి గిలారు.
వీటిలో గ్లోబల్ లాజిక్ (రెండో అంతస్తు) సంస్థను అప్పట్లో 75 మంది ఉద్యోగులతో ప్రారంభించారు. ఇక్కడ ప్రస్తుతం 18 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో సంస్థ ముల్లర్ డాట్ కనెక్ట్ పేరిట మూడో అంతస్తులో 26 మంది ఉద్యోగులతో కొనసాగుతోంది. వీరందరూ జిల్లాకేంద్రంతో పాటు జడ్చర్ల పట్టణంలో నివసిస్తూ.. ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాబ్‌లలో ఐటీ టవర్‌కు వచ్చి పనిచేసి వెళ్తున్నారు.
తమ కంపెనీ ఉద్యోగులు, ఉత్పత్తులపై ‘సాక్షి’ బృందానికి వివరించేందుకు నిర్వాహకులు నిరాకరించడం గమనార్హం. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదని వారు చెప్పుకొచ్చారు. కనీసం ఉద్యోగుల ఫోన్ నంబర్లు అయినా ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment