సాక్షి, మహబూబ్‌నగర్: పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు అంటూ గులాబీ పార్టీపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోదీ సిద్దమా? అని ప్రశ్నించారు. చర్చకు ఎవరు వచ్చినా తాము సిద్దమే అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
మహబూబ్‌నగర్‌లోని అమిస్తాపూర్ రైతు పండుగ ముగింపు సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న రైతుల రుణమాఫీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30 ప్రాధాన్యత ఉన్న రోజు. గతేడాది ఇదే రోజున మీరు నాకు అండగా నిలబడ్డారు. నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఆనాడు పాలమూరు బిడ్డల కన్నీళ్లను నేను చూశాను. 70 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డకు పాలించే అవకాశం వచ్చింది. పాలమూరు కష్టాలు నాకు తెలుసు. రైతుల కష్టాలు కూడా నాకు తెలుసు. ఏడాది పాలనలో రూ.54వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. ఏడాది క్రితమే నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాం. సీఎం పదవి బాధ్యత.. జవాబుదారితనంతో పని చేస్తున్నాను.
ఈరోజు వరి వేసుకుంటే రూ.500 బోనస్ ఇస్తామన్నది మా ప్రభుత్వం కాదా?. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు. ఆనాడు వరి వేస్తే ఉరే అన్నది కేసీఆర్ కాదా?. కాళేశ్వరానికి లక్షా రెండువేల కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా రికార్డు స్థాయిలో సాగు జరిగింది. గతంలో కాళేశ్వరం వల్లే పంటలు పండాయని చెప్పుకున్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు.
తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోదీ సిద్దమా?. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా చర్చకు మేం సిద్దం. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారు. ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసి కేవలం రూ.11వేల కోట్ల రుణమాఫీనే చేశారు. పంటలకు కనీస మద్దతు ధర తెచ్చిన ఘనత మాది. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్.. రైతులను ఉచిత విద్యుత్ ఇచ్చారు. సమైక్య పాలనలో కంటే కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగింది. పాలమూరులో గెలిచిన కేసీఆర్ జిల్లాకు ఏం చేశారు అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ మాటలు నమ్మి గిరిజనులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టేవాళ్లా. కొండగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని నేను అనుకున్నాను. లగచర్లలో కుట్ర ప్రకారమే దాడి జరిగింది. గొడవ చేసి మంపెట్టారు. విపక్షాల వలలో పడొద్దు. రైతులు కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. వినకుండా కొందరు ఆవేశపడ్డారు. ఈ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి రూ.73వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాం. పదేళ్లలో ఏ ప్రాజెక్ట్‌ను నిర్మించకపోగా.. పాలమూరును ఎడారిగా చేశారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చాం.. మీలా రైతులను గాలికి వదిలేయలేదు. కొన్ని సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదు. బీఆర్‌ఎస్ లాగా వదిలేయం అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment