
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దివాళాకోరు మాటలు మాట్లాడే సీఎం దేశం ఎక్కడా ఉండరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒక్కటే మాట చెబుతున్నారు. రేవంత్ మాట మాట్లాడే ముందు ఒక్కసారి భట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితవు పలికారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ అట్లాస్ నివేదిక ఇచ్చిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ప్రస్తుతం తెలంగాణ అట్లాస్ నివేదికను నెట్ నుంచి తొలగించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను నివేదికలో భట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు. ఆ నివేదికలో తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అని చెప్పింది. కేసీఆర్ హయంలో సంపద ఎలా పెరిగిందో నివేదికలో ఉంది. భారత దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జీఎస్‌డీపీలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో గుజరాత్‌ను కూడా దాటింది. గత పదేళ్లలో తెలంగాణ ఆదాయం, సంపద పెరిగిందన్నారు.
కేసీఆర్ పాలనపై సొల్లు వాగుడు వాగిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ అట్లాస్ ఇప్పటికైనా చూడాలి. జీవ సంపదలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని నివేదికలో ఉంది. విద్యుత్ వినియోగం కూడా కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే పెరిగింది. బీఆర్‌ఎస్ పాలనలోనే ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికనే చెబుతోంది. అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా నివేదిక ఉంది. అన్ని వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం మాట మార్చడం లేదంటూ మండిపడ్డారు.
పది నెలల్లో తెలంగాణ అప్పులపై కట్టిన వడ్డీ 22వేల 56కోట్లు. నెలకు కడుతుంది 2,200 కోట్లు. ఇది నివేదికలో ఉంది. కానీ ఆరువేల కోట్లకు పైగా నెలకు అప్పులకు వడ్డీ కడుతున్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ బూతులు మాట్లాడం మానేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. విజ్ఞత లేని రేవంత్.. తెలంగాణను క్యాన్సర్ రోగితో పోల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత లక్ష మంది రేషన్ కార్డులు తొలగించినట్టు నివేదికలో ఉందన్నారు.

కాంగ్రెస్ హయంలో తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి వచ్చింది. రాబడి కంటే ఖర్చు ఎక్కువ చేస్తోంది. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు అప్పులు చేస్తున్నారు?. ముఖ్యమంత్రి రేవంత్‌వి తుగ్లక్ నిర్ణయాలు.. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాళేశ్వరం ఎండ పెట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీది దిక్కుమాలిన, సిగ్గుమాలిన పాలన. రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. నేను చెప్పిన విషయాలు అబద్ధం అని చెబితే ఏం చేయడానికి అయిన నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment