సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కాగా, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు.. శుక్రవారం తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు.
ఇక, గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్సీలు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నూతన పీసీపీ చీఫ్, కేబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ వివరించనున్నారు.
పీసీసీ రేసులోకి కొత్త పేర్లు..
ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తున్నట్టు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలంటున్నారు. దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
వారి పేర్లు ఇలా..
ఎస్సీ సామాజికవర్గం నుండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.
ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్.
బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ.
ఇదిలా ఉండగా.. నేటి సమావేశంలోనే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. సీఎంతో సహా ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో నలుగురిని మంత్రి మండలిలోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, కోదండరాం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment