అందుబాటులో జిప్‌సైకిల్, జిప్‌లైన్
ప్రత్యేకంగా అడవిలో జంగిల్ సఫారీ
భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలకు ప్రణాళికలు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్‌పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది.
ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు
పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్‌లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్‌క్లోజర్‌లను ఏర్పాటు చేశారు.
ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు
పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్‌సైకిల్, చిన్నారులకు జిప్‌సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్‌సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్‌సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.
అడవిలో జంగిల్ సఫారీ
పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు.
మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు
పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్‌లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
– సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment