Jungle Safari
-
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
కజిరంగా నేషనల్ పార్కులో మోదీ విహారం
జోర్హాట్: అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ శనివారం ఉదయం ఈ పార్కులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్యాంట్, షర్టు, జాకెట్, హ్యాట్ ధరించారు. ‘ప్రద్యుమ్న’ అనే ఏనుగుపై స్వయంగా విహరించారు. ఇక్కడి ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించి పరవశించిపోయారు. వాటిని తన కెమెరాలో బంధించారు. దాదాపు రెండు గంటలపాటు పార్కులో గడిపారు. ఎలిఫెంట్ సఫారీ, జీపు సఫారీని ఆనందించారు. ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్’ అయిన కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. ఏమాత్రం అలసట లేకుండా వనంలో ఉత్సాహంగా కలియదిరిగారు. జీపుపై విహారిస్తూ అధికారులను ఇక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా జంతువులు ఆయన కంటబడ్డాయి. మూడు ఏనుగులకు మోదీ తన చేతులతో చెరుకు గడలు తినిపించారు. ఫారెస్టు గార్డులు ‘వనదుర్గల’తో, ఏనుగు మావటీలతో, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా నేషనల్ పార్కులో పెద్దసంఖ్యలో గజరాజులు, ఇతర అరుదైన వన్య ప్రాణులు ఉన్నాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సంబంధిత చిత్రాలను కూడా పంచుకున్నారు. వనదుర్గలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. -
వైరల్ వీడియో: పులి కోసం అంతా పడిగాపులు! అంతలోనే సర్ప్రైజ్
-
పులి కోసం అంతా పడిగాపులు! అంతలోనే సర్ప్రైజ్
వైరల్: అడవుల్ని, అందులోని వన్యప్రాణులను కదిలించడం మనిషికి బాగా అలవాటైపోయింది. వాటి ఆవాసాల్లో వెళ్లి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఫలితం.. సో కాల్డ్ జనావాసాల మీద వన్యప్రాణుల దాడులు లేదంటే తిరిగి వాటినే చంపడం చూస్తున్నాం. అయితే.. వన్య ప్రాణులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే స్పృహ లేకుండా పోతున్నారు చాలామంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సురేందర్ మెహ్రా ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ఓపెన్ సఫారీ వ్యూ కోసం వెళ్లిన కొందరికి పెద్దపులి తానేంటో చూపెట్టింది. ఆశగా దాని చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్లపై.. ఒక్కసారిగా దూసుకొచ్చి వణుకు పుట్టించింది. టూరిస్టులు ఓ ఓపెన్ జీప్‌లో ఉండగా.. పొదల మాటున పులి ఉండడం గమనించి జీప్ డ్రైవర్ ఆపేశాడు. ఆ సమయంలో అది ఎప్పుడు బయటకు వస్తుందా? క్లిక్ మనిపిద్దామా? అని కెమెరాలతో రెడీగా ఉన్నారు కొందరు. అయితే.. వాళ్ల గోలకు చిర్రెత్తుకొచ్చిందేమో. గాండ్రిస్తూ ఉగ్రంగా ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. ఆ దెబ్బకు భయంతో జీప్ డ్రైవర్ వాహనాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లాడు. గట్టిగా అరవడంతో అది కాస్త వెనక్కి తగ్గింది. కొన్నిసార్లు, పులిని చూడటం కోసం మనం కనబరిచే అతి ఆత్రుత.. వాటి(పులుల) జీవితంలోకి చొరబడడం తప్ప మరొకటి కాదు అంటూ సురేందర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ, ఆయన ట్వీట్ ద్వారా వీడియో మాత్రం వైరల్ అవుతోంది. Sometimes, our ‘too much’ eagerness for ‘Tiger sighting’ is nothing but intrusion in their Life…🐅#Wilderness #Wildlife #nature #RespectWildlife #KnowWildlife #ResponsibleTourism Video: WA@susantananda3 @ntca_india pic.twitter.com/B8Gjv8UmgF — Surender Mehra IFS (@surenmehra) November 27, 2022 -
జంగిల్ సఫారీ కొత్త కొత్తగా..!
నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం: రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్గాయ్లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు. జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు. సఫారీకి అధునాతన హంగులు జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం. – విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల